అన్ని స్థానాల్లోనూ విజయం మాదే

May 11,2024 21:11

 వైసిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అన్ని స్థానాలలో వైసిపి జెండా ఎగర వేయబోతున్నా మని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ డిప్యూటీ కోఆర్డినేటర్‌ మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం క్యాంప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర పరిధిలో మూడు సిద్ధం సభలు ఏర్పాటు చేసుకొని జగన్‌ ప్రచారం నిర్వహించి, ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో 19 శాసనసభ, 5 పార్లమెంట్‌ సభ్యులు విస్తతంగా ప్రచారం నిర్వహించామని తెలిపారు. తప్పకుండా అన్ని స్థానాలలో వైసిపి జెండాను ఎగరవేయబోతున్నామని తెలిపారు. చంద్రబాబు పాలన, జగన్‌ పాలన మధ్య వ్యత్యాసం ప్రజలందరికీ వివరించామని, 2024 మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకర్షించిందని తెలిపారు. మళ్ళీ జగన్‌ వస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం మీద విషం చిమ్మడమే పనిగా కూటమి పెట్టుకుందని, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.. 14 ఏళ్లు సిఎంగా పనిచేసి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం చేయని వ్యక్తి చంద్రబాబు, ఆయనలా మోసపూరిత హామీలు జగన్‌ ఏనాడూ ఇవ్వలేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్‌ కట్టుబడి ఉన్నారని, గత పాలకులు ఎవరూ చేయని విధంగా ఈ ప్రాంతానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించారని తెలిపారు. ప్రజలెవరూ టిడిపి కూటమి మాయ మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే జగన్‌ కి మరోసారి మద్దతివ్వాలని కోరారు.

➡️