అడుగడుగునా నిర్బంధం

Jan 22,2024 20:58

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లాలో అంగన్‌వాడీలపై ప్రభుత్వం అడుగడుగునా నిర్భందం ప్రయోగించింది. రిలే నిరాహార దీక్షల నేపథ్యంలో ‘జగనన్నకు చెబుదాం’ అంటూ చలో విజయవాడకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా నుంచి ఆదివారం రాత్రి నాలుగు బస్సులు బయలు దేరాయి. దీనికి ముందే అంగన్‌వాడీల నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న నాయకుల ఇళ్లను పోలీసులు మప్టీలో చుట్టుముట్టారు. ఫోన్లు కూడా ట్రాప్‌ చేసినట్టు సమాచారం. పోలీసుల దుశ్చర్యలను ముందుగానే గమనించిన అంగన్‌వాడీ నాయకులు, కార్యకర్తలు కొందరు తమ బంధువులు, స్నేహితులు ఇళ్లకు చేరుకుని వివిధ ప్రాంతాల్లో బస్సులు ఎక్కుతూ విజయవాడకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాష్ట్ర కేంద్రానికి సమాచారం అందించడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల పోలీసులను ఉసుగొల్పారు. వారంతా ఎక్కడికక్కడ బస్సులు ఆపుతూ విజయనగరం నుంచి బయలుదేరిన బస్సులను నక్కపల్లి, తుని, రాజమండ్రి, ఏలూరు ప్రాంతాల్లో అడ్డుకున్నారు. డ్రైవర్లను బెదిరించి మరీ వెనక్కితీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు, అంగన్‌వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమేమిటంటూ అంగన్‌వాడీలు ఆగ్రహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్డుకోవాల్సి వస్తుందంటూ పోలీసులు అసలు గుట్టు విప్పారు. బస్సులో కాకుండా, రైళ్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో వెళ్లినవారు మాత్రం సోమవారం తెల్లవారుజాముకే విజయవాడ చేరుకుని ఆందోళనా కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు అటకాయించిన బస్సుల్లోని ఒకటి డెంకాడ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురావడమే కాకుండా, ఇక విజయవాడ వెళ్లబోమంటూ అంగన్‌వాడీలనుంచి లిఖిత పూర్వక పూచీకత్తులు ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి చేశారు. దీన్ని ప్రతిఘటిస్తూ అంగన్‌వాడీలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
విజయవాడలో అంగన్వాడీల అరెస్టు
బొబ్బిలి : నియోజకవర్గం నుంచి చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లిన అంగన్వాడీలను సోమవారం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ర్యాలీకి సిద్ధమవుతుండగా, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, రోజా, అనురాధ, నిర్మల, లక్ష్మి, తదితరులను అరెస్టు చేసి, ప్రత్యేక వాహనంలో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని ఓ ప్రయివేటు ఫంక్షన్‌ హాల్లో నిర్బంధించారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరితే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️