ఎన్నికల కంట్రోల్‌ రూమ్‌

Mar 17,2024 21:15

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఎన్నికల ప్రకటన విడుదలైన నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ అమలుపై ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ ఆదివారం ప్రారంభమైంది. కంట్రోల్‌ రూమ్‌కు సిపిఒ బాలాజీ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. దీనికి అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది హాజరయ్యారు. ఎలక్ట్రానిక్‌ అండ్‌ ప్రింట్‌ మీడియా, సోషల్‌ మీడియా సెల్‌, 24/7 కాల్‌సెంటర్‌, కంప్లైంటింగ్‌ మానిటరింగ్‌ సెల్‌, రిపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం విభాగాలు పని చేస్తున్నాయి. పబ్లిక్‌ యాప్‌ సి విజిల్‌మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనపై మెయిల్స్‌లో, సోషల్‌ మీడియాలో, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే ఫిర్యాదులను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులకు పంపించనున్నారు. ఈ ఎన్నికలలో ఫిర్యాదుల కోసం ప్రజా యాప్‌ సి విజిల్‌ ద్వారా కూడా స్వీకరిస్తున్నారు. ఈ యాప్‌ కోసం ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో కెమెరా ఆప్షన్‌ ఉండాలి. ఫొటోలు, ఆడియో, వీడియోలను, మోడల్‌ కోడ్‌ ఉల్లంఘన లైవ్‌ రిపోర్టింగ్‌ను ఈ యాప్‌ ద్వారా పంపవచ్చు. ముందుగా రికార్డ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు ఈ యాప్‌లో అనుమతించబడవు. ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో క్షేత్ర స్థాయిలో విచారించి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుదారు వారి పేరు, ఫోన్‌ నంబర్‌ రాసినా, రాయకున్నా ఫిర్యాదును స్వీకరించి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుల కోసం 24/7 పని చేసే 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు.
కంట్రోల్‌ రూమ్‌లో ల్యాండ్‌ లైన్‌ నంబర్లు
కంట్రోల్‌ రూమ్‌ ల్యాండ్‌ లైన్‌ 08922-797120, 08922-797124 నంబర్లకు ఫోన్‌ చేసి మోడల్‌ కోడ్‌ ఉల్లంఘనపై ఫిర్యాదులు చేయడంతోపాటు ఎన్నికల సమాచారాన్ని పొందవచ్చు.
నివేదికలు త్వరగా పంపాలి
ఎన్నికల కంట్రోల్‌ రూం నుంచి పంపించాల్సిన నివేదికలను ఎప్పటికప్పుడు వేగంగా పంపాలని కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. ఆదివారం కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్‌ అండ్‌ ప్రింట్‌ మీడియా, సోషల్‌ మీడియా సెల్‌, 24/7 కాల్‌ సెంటర్‌, కంప్లైంటింగ్‌ మానిటరింగ్‌ సెల్‌, రిపోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం విభాగాలు ఎలా పని చేస్తున్నాయని వివరాలు అడిగారు. సోమవారం నుండి పూర్తి సిబ్బందితో పనిచేయాలని సూచించారు. అందుకు తగ్గ కంప్యూటర్లు, టివిలు, ఇతర అవసరాలన్నింటిని ఆదివారం సాయంత్రానికే సిద్ధం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు జెసి కార్తీక్‌, డిఆర్‌ఒ అనిత, సిపిఒ బాలాజీ, జిల్లా పరిషత్‌ సిఇఒ రాజ్‌ కుమార్‌, డిపిఒ శ్రీధర్‌ రాజా, డిపిఆర్‌ఒ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️