ఎన్నెన్నో ఆశలతో..

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గిర్రున తిరిగే కాలచక్రంలో 2023వ సంవత్సరం చరిత్ర పుటల్లోకి వెళ్లిపోయింది. 2024వ సంవత్సరం కొన్ని గంటల మునుపే రానే వచ్చేసింది. గడిచిపోయిన సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ… 2024వ ఏడుకు స్వాగతం పలుకుతూ జనం ఒకింత ఉత్సాహంతో కేరింతల నడుమ కేకులు కట్‌ చేస్తున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈ ఏడాదంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ పరస్పర పలకరింపులు, వాట్సాప్‌ మెసేజ్‌లు ఆదివారం అర్ధరాత్రి నుంచే మొదలయ్యాయి. ఇదంతా షరా మామూలే. ఈ కేక్‌ కటింగులు, పలకరింపులు కేరింతలు, నూతన సంవత్సర వేడుకలు ఎప్పుడూ జరుగుతున్నవే. కానీ, ఈ ఏడాది నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ముఖ్యంగా శాఖల్లో పనిచేస్తున్న స్కీమ్‌వర్కర్లు బరువెక్కిన గుండెలతో అడుగు పెడుతున్నారు. మునుపెన్నడూ లేనంతగా పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు సతమతమౌతున్నారు. రైతులు పుట్టెడు దు:ఖంతో ఉన్నారు. గతేడాది జిల్లాలో తీవ్ర వర్షాభావంతో కొంతమంది, మిచౌంగ్‌ తుపానుతో కురిసిన భారీ వర్షాలతో మరికొంతమంది రైతులు కుదేలయ్యారు. ప్రభుత్వ విధానాలతో పలు రకాల వ్యాపారులు, వృత్తిదారులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలోనైనా తమ సమస్యలు పరిష్కారం కావాలని ఉద్యోగులు, ప్రకృతి కరుణించాలని, ఇప్పటికే జరిగిన నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఇక సగటు ప్రజానీకం పెరిగిన ధరలు తగ్గించాలని, రోజూ పనులు దొరకాలని ఆరాటపడుతున్నారు. ఇవేవీ గొంతెమ్మ కోర్కెలు కాకపోయినప్పటికీ నూతన సంవత్సరంలోకి అడుగితున్న వేళ ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఆశలు, ఆలోచనలు, కొంగొత్త ఆకాంక్షలు మనసులు మెదలడం సహజమే. ఎదుగుదలకు, ఆలోచనలకు ఆటకంగా మారుతున్న అలవాట్లను వదిలించుకోవాలని భావించేవారు కొందరైతే, కొత్త విధానాలు అమలు చేసుకుని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొ ంచుకోవాలనే వారు మరికొందరు. సాదాసీదాగా సాగి పోతున్న జీవితంలో నూతన సంవత్సరం కొత్త జోష్‌ నింపాలని కొందరు కోరుకుంటారు. ఈ మాటకొస్తే… కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామనే ఆలోచనలు కుర్రకారు నుంచి వృద్ధుల దాకా ఒకింత నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. వారం పది రోజుల ముందు నుంచే నూతన సంవత్సరంలో ప్రారంభించబోయే పనులు, లక్ష్యాల గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకుంటారు. ఐతే గతంతో పోలిస్తే నూతన సంవత్సర వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పదేళ్ల క్రితానికి వెళ్లే గ్రీటింగు, టెలీఫోన్‌ సమాచారాల ద్వారా శుభాకాంక్షలు తెలుపుకునేవారు. అంతకు మునుపు వారం రోజుల ముందు నుంచే గ్రీటింగుల పంపే క్రమంలో పోస్టాఫీసులు కిటకిటలాడేవి. ఈ ఇప్పుడా పరిస్థితి లేదు. సప్తసముద్రాలు దాటివున్నవారు కూడా కంప్యూటర్‌ లేదా ల్యాప్‌ట్యాప్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్సు కలుసుకునే పరిస్థితి కొన్నేళ్ల కిందటే వచ్చేసింది. ఇప్పుడు మరింతగా పెరిగింది. ఇక అతిథులను, పెద్దలను కలుసుకునే క్రమంలో పుష్పగుచ్ఛాలు, పండ్లు, స్వీట్లు అందజేసుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. కేక్‌ కటింగ్‌ షరా మామూలే. ఈ క్రమంలో పండ్లు, స్వీటు దుకాణాలు, బేకరీలు, రంగులు విక్రయించే షాపులు ఆదివారం ఉదయం నుంచే సందడిగా కనిపించాయి. ముందస్తు ఆర్డర్లతో వ్యాపారులు బిజీబిజీగా మారారు.ఇక మందుబాబుల హడావుడి విజయనగరంలో హద్దులు దాటింది. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. పూటుగా తాగిన కుర్రకారు అర్ధరాత్రి దాటాక బైక్‌ రైడింగ్‌లతో వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏదైనా ఈ హడావుడి ఈ ఒక్కరోజే. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జనం మనసుల్లో మెలిగే ఆశలు, ఆకాంక్షలు, కొత్తకొత్త ఆలోచనలు ఆచరణాత్మకం కావాలని, మంచి ఫలితాలను ఇవ్వాలని, ముఖ్యంగా పుట్టెడు సమస్యలతో సతమతమౌతున్న రైతులు, ఉద్యోగులు, స్కీమ్‌వర్కర్లు, చిరువ్యాపారులకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరుకుందాం.

➡️