ఘనంగా కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవాలు

Jan 28,2024 21:37

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కలియుగ భీముడు కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవాలు నగరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం కోడి రామ్మూర్తి పార్కు వద్ద ఏర్పాటు చేసిన రామ్మూర్తి విగ్రహాన్ని డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీలో క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బల ప్రదర్శన ద్వారా విజయనగర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన మహోన్నత వ్యక్తి కోడి రామ్మూర్తి నాయుడని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విజయనగరంలో కోడి రామ్మూర్తి వ్యాయామశాల అతి ప్రాచీనమైనదని అన్నారు. ఆధునిక పరికరాలతో ఎన్నో ప్రైవేటు వ్యాయామశాలలు నెలకొల్పినా కోడి రామ్మూర్తి వ్యాయామశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ తర్ఫీదు పొందిన ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులను గెలుచుకున్నారని గుర్తుచేశారు. ఇటీవల రూ.16 లక్షలతో వ్యాయామశాలలో మరమ్మతులు చేయించామన్నారు. 28 లక్షల రూపాయలతో ఇండోర్‌ స్టేడియాన్ని అభివృద్ధి చేశామన్నారు. ప్రకాశం పార్కు శిథిలావస్థకు చేరుకోవడంతో కోటి రూపాయల నిధులు వెచ్చించి రాష్ట్రంలోనే తొలి మహిళా పార్కుగా తీర్చిదిద్దామని వెల్లడించారు. నెహ్రూ పార్కును చిల్డ్రన్స్‌ పార్క్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలోని ప్రధాన జంక్షన్లలో వివిధ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వ్యాయామశాల ప్రాంతంలో కోడి రామ్మూర్తి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయ యాదవ్‌, వ్యాయామ సమాజం అధ్యక్షులు పెనుమజ్జి విజయలక్ష్మి, కార్యదర్శి పెద్ది లక్ష్మీనారాయణ, పివి నరసింహారాజు, రంగారావు దొర, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారనాయుడు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

➡️