పండగ పూట పస్తులు

Jan 14,2024 19:56

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం నగర ప్రజానీకానికి తాగునీరు అందిస్తున్న ముషిడిపల్లి, నెల్లిమర్ల, సారిపల్లి మాస్టర్‌ పంప్‌ హౌస్‌ కార్మికులు పండగ పూట పస్తులుండాల్సి వచ్చింది. వారికి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడంతో ఆకలితో పండగ జరుపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలో వాటర్‌ వర్క్స్‌ కార్మికులు 73 మంది ఉన్నారు. వారిలో అమృత పథకం కింద పని చేస్తున్న 24 మందికి 5 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. నెల్లిమర్ల పంప్‌హౌస్‌లోని 29 మంది కార్మికులకు 3 నెలలు, ముషిడిపల్లి పంప్‌హౌస్‌లో పనిచేస్తున్న 20 మంది కార్మికులకు 2 నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర ప్రజలకు ఏడాదిలో అతిపెద్ద పండగ సంక్రాంతి. అటువంటి పండగ పూట విజయనగరంలో వాటర్‌ వర్క్స్‌ కార్మికులు ఆకలితో అలమటించే పరిస్థితిని నగరపాలక సంస్థ, ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టరు కల్పించారు. వేతనాల కోసం బోగి ముందు రోజు వరకు రాత్రి, పగలు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు పండగ కాబట్టి కనీసం ఒక్క నెల వేతనం వేయించే ఏర్పాటు చేస్తామని చెప్పి… మిన్నకుండిపోయారు. శుక్రవారం సాయంత్రం నుంచి అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు వేతనం కోసం ఎదురుచూపులు చూస్తూ వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంది. తక్షణమే జీతాలు చెల్లించకపోతే పంపింగ్‌ నిలుపుదల చేస్తామని హెచ్చరించినా వారికి వేతనాలు చెల్లించలేదు. పండగ పూట కూడా పిల్లలకు కనీసం మంచి భోజనం పెట్టలేని పరిస్థితిలో ఉన్నామంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారుల తీరుపై ఆగ్రహంపండగ పూట జీతాలు చెల్లించకుండా కార్మికులను, వారి కుటుంబాలను పస్తులు ఉంచడంపై నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కార్పొరేషన్‌ అధికారులకు కూడా జీతాలు ఇవ్వకపోతే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు పంప్‌ హౌస్‌ కార్మికులకు 2023 జూన్‌లో పెరిగిన రూ.2 వేలు వేతనం కూడా చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మీకు జీతాలు రాకుంటే? మాకు ఏడాదిలో అతిపెద్ద పండగ సంక్రాంతి. అటువంటి పండగకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకపోవడం దారుణం. అదే మీకు వేతనాలు రాకపోతే ఇలాగేనా ఉంటారు?. పండగకు బట్టలేవని పిల్లలు అడిగితే సమాధానం చెప్పలేని ధీన స్థితిలో ఉన్నాం. పండగకు పిండి వంటల కోసం సరుకులకు డబ్బులు ఇవ్వాలని నా భార్య అడిగితే సమాధానం చెప్పలేక కంటతడి పెట్టాల్సిన దుస్థితి రావడానికి కారణం కార్పొరేషన్‌ అధికారులే.- కోరాడ సన్యాసిరావు, పంప్‌ హౌస్‌ కార్మికుడు
ఇది మీకు భావ్యమా? వాటర్‌ వర్క్స్‌ కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడం కార్పొరేషన్‌ అధికారులకు భావ్యమేనా?. వేతనాలు ఇవ్వకుంటే కుటుంబంతో ఎలా బతుకుతారు? రెండు రోజుల పాటు కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే, ఎంతో కొంత వేతనం వేయిస్తామని చెప్పిన అధికారులు కనీసం పట్టించుకోకపోవడం దారుణం.- ఎ.జగన్మోహన్‌, ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకులు

➡️