బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయుల ధర్నా

Jan 3,2024 21:11

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని కోరుతూ బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద యుటిఎఫ్‌ ఆధ్వర్యాన 12 గంటల ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ ఒకటో తేదికి చెల్లించాల్సిన జీతాల కోసం 20వ తేది వరకూ ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో బ్యాంకుల్లో చేసిన అప్పులకు పెనాల్టీలు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ అవసరాల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయులు దాచుకున్న పిఎఫ్‌, ఎపిజిఎస్‌ఐ, సరెండర్‌ లీవ్‌ చెల్లింపులు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సకాలంలో డిఎలు ప్రకటించడం లేదని, అప్పుడప్పుడు ప్రకటించినా వాటి ఎరియర్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియదన్నారు. గతేడాది ఆగస్టు 24న జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో 2023 సెప్టెంబర్‌కి అన్ని బకాయిలు చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా ఇంతవరకు చెల్లింపు చేయలేదని ఆక్షేపించారు. అధికారులతో బకాయిల గురించి ప్రస్తావించినప్పుడల్లా వచ్చే నెలలో చెల్లిస్తామని దాటవేస్తున్నారు తప్ప ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే పిఆర్‌సి బకాయిలతోపాటు అన్ని రకాల ఆర్థికపరమైన బకాయిలు చెల్లింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. అనంతరం యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రమేష్‌ చంద్ర పట్నాయక్‌, జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మాట్లాడారు. ధర్నాలో యుటిఎఫ్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️