శంఖారావంలోనూ తేలని లెక్క

Feb 19,2024 21:18

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జిల్లాలో పూరించిన శంఖారావంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనేది కొంతలో కొంతైనా స్పష్టత వస్తుందని ఆశించిన తెలుగు తమ్ముళ్లు ఒకింత అయోమయానికి, గందరగోళానికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే కావాలన్న ఆశావహులకు కూడా ప్రయాస తప్పలేదు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ అభిమానులతోపాటు ప్రజలు కూడా పోటీకి ఎవరికి అవకాశం దక్కుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల బహు నాయకత్వం, గ్రూపుల పోరు ఉండడమే ఇందుకు కారణం. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేష్‌ శంఖారావం సభలు జరిగిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల తెలుగు తమ్ముళ్లు అత్యంత ఉత్సాహంగా సభలకు హాజరు కాగా, పాలకొండ, బొబ్బిలి, సాలూరు, విజయనగరం తదితర నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన సభలు చివరి వరకు జనం లేకపోవడంతో వెలవెలబోయాయి. దీంతో ప్రాంగణాలు నిండేవరకు లోకేష్‌ అక్కడే నిరీక్షించి, అనంతరం వేదికపైకి వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. అంతమాత్రాన ఆయా నియోజకవర్గాల్లో సభకు కూడా హాజరు కాలేనంత తక్కువ కేడర్‌ ఉందని చెప్పలేం. వారిని సమయానికి రప్పించడంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. గజపతినగరం, రాజాం, చీపురుపల్లి తదితర సభల్లో జనం పోటెత్తారు. ఈ సంగతి కాస్త అటుంచితే… ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడం, మరోవైపు ఎక్కువ నియోజకవర్గాల్లో గ్రూపులపోరు తారా స్థాయికి చేరుకుంది. దీంతో లోకేష్‌ చేపట్టిన శంఖారావం సభల్లో అభ్యర్థులను ప్రకటించకున్నా… పార్టీ కేడర్‌కు పరోక్షంగా సంకేతాలు ఇస్తారనే చర్చ ముందస్తుగా సాగింది. అటువంటి పరిణామాలేవీ శంఖారావం సభల్లో కనిపించలేదు. దాదాపు అన్ని చోట్లా పార్టీ ఇన్‌ఛార్జులు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పెద్దలను కూడా కూర్చోబెట్టారు. దాదాపు అన్ని చోట్లా పార్టీ నాయకులందర్నీ కలుపుకునే రీతిలోనే లోకేష్‌ ప్రసంగం గానీ, పలకరింపు తీరు గానీ కనిపించింది. అయినా, ఎన్నికల గుర్రం ఎవరనేది ఊహకు కూడా అందనివ్వక పోవడంతో దాదాపు అన్ని గ్రూపుల్లోనూ నిస్తేజం కనిపిస్తోంది. విజయనగరం నియోజకవర్గంలో పూసపాటి అశోక్‌ గజపతి గానీ, ఆయన కుమార్తె, నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతి గానీ.. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు. లోకేష్‌ మాట్లాడినప్పుడు గీత హయాంలో అభివృద్ధి జరిగిందని కితాబిచ్చారు. విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని అశోక్‌ లేదా ఆయన కుమార్తె పంచుకున్నట్టుగా వ్యవహరిస్తే బిసికి చెందిన గీత పరిస్థితి ఏమిటో? అంటూ చాలా వరకు చర్చ నడుస్తున్నప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. చీపురుపల్లిలో మంత్రి బొత్సను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపుతారని పార్టీ నాయకుల్లో సైతం ప్రచారం జరుగుతోంది. కానీ, శంఖారావం సభలో కిమిడి నాగార్జునకు మించిన నాయకులెవరూ కనిపించలేదు. నెల్లిమర్ల స్థానం టిడిపికా, జనసేనకా అన్న సందేహం ఇరు పార్టీల కేడర్‌నీ వీడలేదు. శృంగవరపుకోటలో సీటు కోసం స్థానిక మాజీ ఎమ్మెల్యే, మరో నేత గొంప కృష్ణ పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో శంఖారావం సభలో ఇరు గ్రూపులకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, స్థానిక నాయకుడు కరణం శివరామకృష్ణతోపాటు కొద్దికాలంగా సీటు ఆశిస్తున్న కె.ఎ.నాయుడు అన్న కుమారుడు శ్రీనివాసరావుకు కూడా సభలో పాల్గొనే అవకాశం కల్పించారు. దీంతో, అభ్యర్థి ఎవరు? అనే సందేహం యథాతథంగానే ఉండిపోయింది. సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, నెల్లిమర్ల నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రతిభా భారతి గైర్హాజరు వెనుక ఆంతర్యమేమిటో?రాజాం నియోజకవర్గంలో మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి, ఆమె కుమార్తె గ్రీష్మ గైర్హాజరు కావడం పట్ల సర్వత్రా చర్చ నడుస్తోంది. కొన్నాళ్ల క్రితమే పార్టీలోని ఓ రాష్ట్ర నాయకుడి కనుసన్నల్లో ప్రతిభా భారతి ఆధ్వర్యాన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోండ్రు మురళికి వ్యతిరేకంగా నాలుగు మండలాలకు చెందిన నాయకులు రహస్య సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పాల్గొన్న మండల నాయకులు హాజరైనప్పటికీ ప్రతిభా భారతి, గ్రీష్మ హాజరు కాకపోవడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉంది.

➡️