అరగంటలో కేసు నమోదు

Apr 8,2024 21:13

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన సంఘటనలపై అరగంటలో కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేయాలన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, తాహశీల్దార్లు, ఎంపిడిఒలు, పోలీసు అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సభ్యులతో కలెక్టరేట్‌ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎఫ్‌ఎస్‌టి ల పనితీరుపై సమీక్షించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి సుమారు 22 రోజులు గడిచిపోయినా, క్షేత్రస్థాయిలో యంత్రాంగం చురుగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఫిర్యాదు అందితేనే స్పందిస్తున్నారు తప్ప, తామంతట తాము పట్టుకున్న కేసులు దాదాపు లేవని అన్నారు. ఫిర్యాదు వస్తేగానీ స్పందించరా.. అంటూ నిఘా వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు చేయని బృందాలను నిలదీశారు., నిర్లిప్తతను విడిచిపెట్టాలని, పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్‌ఎస్‌టిలకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఇస్తామని, అప్పటికీ కేసులు నమోదు చేయకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో విస్తతంగా కోడ్‌ ఉల్లంఘనలు జరుగుతున్నా, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల సమావేశాల్లో తాగునీరు, మజ్జిగ మినహా, ఇంకా ఏది పంచినా, భోజనాలు పెట్టినా కోడ్‌ ఉల్లంఘన క్రిందే వస్తుందని తెలిపారు. అనధికారికంగా జరుగుతున్న కొనుగోళ్లపైనా దృష్టి సారించాలన్నారు. అలాగని ఎవరిపైన అయినా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే సహించేది లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. జిల్లా ఎస్‌పి దీపిక మాట్లాడుతూ, జిల్లాలో నగదును సీజ్‌ చేసుకున్న సంఘటనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇతర వాహనాలతో పాటు, బస్సులను కూడా విస్తతంగా తనిఖీ చేయాలని సూచించారు. సీజర్స్‌పై దృష్టి పెట్టాలన్నారు. అనవసరంగా ఎవరినీ వేధించవద్దని, తప్పుడు కేసులు పెట్టవద్దని ఎస్‌పి స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, డిఆర్‌ఓ ఎస్‌డి అనిత, సిపిఒ పి.బాలాజీ, ఎక్స్‌పెండిచర్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సత్యప్రసాద్‌, జిల్లా ఆడిట్‌ ఆఫీసర్‌ అరుణకుమారి, ఎంసిసి నోడల్‌ ఆఫీసర్‌ అరుణశ్రీ, ఎలక్షన్‌ సూపరింటిండెంట్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️