తెలుగు లోగిళ్లలో తొలి పండగ

Apr 8,2024 21:10

ప్రజాశక్తి – విజయనగరం : వసంత రుతువును వేదిక చేసుకుని కోయిలలు సుమధుర సంగీతాన్ని ఆలపిస్తే…రెమ్మలకు తొడిగిన చివురులు, పసిపాపలు పిడికిళ్లు తెరిచి నీళ్లలో ఆడుకున్నట్లు హర్షధ్వానాలు తెలియజేస్తాయి. ఆకులు రాల్చిన మోడులు కొత్త చివురుల పీతాంబరాన్ని ధరిస్తే, ప్రకృతి పచ్చటి పట్టు పరికిణీ కట్టుకుని కొత్త పెళ్లికూతురై ముస్తాబవుతుంది. ఊరి వాకిళ్లు మామిడి తోరణాలై, లోగిళ్లు నిత్య వసంతం కావాలని ఆకాంక్షిస్తాయి. విచ్చుకున్న వేపపూలు చిరుగాలికి ఊగుతుంటే పగలే వెన్నెల కురిసినట్లుంటుంది. మామిడిచెట్టుకు కాసిన పిందెలు నోరూరిస్తుంటే దాని నీడ చల్లదనాన్ని కుమ్మరిస్తుంది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తీర్థంగా భావించి పుచ్చుకుంటే సర్వరోగాలు, సర్వభయాలు తొలగి శుభాలు కలుగుతాయనే నమ్మకాన్ని సంప్రదాయం మనకు కలిగించింది. ‘ఉగ’ అంటే నక్షత్రపు నడక అని అర్థం. నక్షత్రాలు నడక ప్రారంభించిన కాలాన్నే సృష్టి ఆరంభించిన కాలంగా భావిస్తారు. అంటే ‘ఆది’ ఉగాదిగా మారిపోయింది. ఉగాదినే సంవత్సరాది అని పిలుచుకుంటాం. అయితే ఒకప్పుడు హేమంత రుతువుతో సంవత్సరం ప్రారంభవుతుందని కొందరు… శిశిరంతో ప్రారంభమవుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. కానీ జ్యోతిర్వేత్త వరాహ మిహిరుడు మాత్రం ఉత్తరాయణ వసంత కాలాన్నే ఉగాదిగా పేర్కొన్నాడు. ఎందుకంటే… రుతువుల్లో మొదటిది వసంతం. మాసాల్లో మొదటిది చైత్రం. పక్షాల్లో మొదటిది శుక్ల. తిధుల్లో మొదటిది పాఢ్యమి కనుకన అన్నీ కలిసిన రోజు ఉగాదిగా ఉద్ఘాటించారు. అప్పటి నుంచి వసంతంలోనే ఉగాది జరుపుకుంటున్నారు.మంగళవారం నుంచి కొత్త ఉగాది ‘క్రోధి’ పేరుతో ప్రవేశిస్తుంది. ఉగాది పంచాంగ శ్రవణం ఉగాదికి మరో విశిష్టత పంచాంగ శ్రవణం. జ్యోతిష్యం, శాస్త్రం, నిరుక్తం, చందస్సు, వ్యాకరణం వంటి అంశాలతో కూడిన పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగము, కరణము అనే ఐదు యోగాలుంటాయి. ఆ రోజున పంచాంగం ద్వారా తమ రాశి చక్రాలను తెలుసు కుంటారు. వ్యవసాయ దారులు కొత్తసంవత్సరం ఎంత వానలు కురుస్తాయోనని తెలుసుకుని దాన్ని బట్టి కొందరు వ్యవసాయాన్ని లెక్కకడతారు. ఈ విధంగా ఉగాది ప్రత్యేకత పలువురిని సాంప్రదాయ రీతిలో ఆకట్టుకుంటుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారు. తిధి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్షు, నక్షత్రం వల్ల పాపపరిహారం, యోగం వల్ల వ్యాధి నివృత్తి, కరణం వల్ల కార్యానుకూలం కలుగుతాయని పూర్వీకులు చెబుతుంటారు. పంచాంగం ద్వారా మంచి చెడులను, గ్రహబలాన్ని తెలుసుకుని తమదైనందిన కార్యక్రమాలు చేసేవారు. భవిష్యత్తును పంచాంగం తెలుపుతుందనేది కొందరి విశ్వాసం.ఏదీ నిజమైన ఉగాది? ఉగాదులొస్తున్నారు… పోతున్నారు. కానీ మధ్య తరగతి మనిషికీ, అట్టడుగు మనిషికీ తీరని ఆశలు ఎన్నో, ఎన్నెన్నో…. ఉగాది పచ్చడిలోని తీపి ఉన్నవాడికే దక్కుతుంది. చేదు లేని వాడికే మిగిలిపోతుంది. ఎన్నో ఉగాదుల్ని దాటుకుంటూ వచ్చినా… గూడులేని అభాగ్యులెందరో, కూడులేని అన్నార్తులెందరో. కులాలూ, మతాలూ ఇంకా కత్తులు దూస్తూనే ఉన్నాయి. మనిషిని మనిషే దోచుకునే సమాజం కొనసాగుతూనే ఉంది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతునే ఉన్నాయి. నిరుద్యోగం రోజురోజుకు తీవ్రమవుతుంది. ఉపాధి కరువై మరింత మంది రోడ్డున పడుతూనే ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్‌ శక్తులకు పాలకులు కారుచౌకగా అమ్మేస్తున్నారు. ధనవంతులను మరింత ధనవంతులుగానూ, పేదలను మరింత పేదలుగానూ చేస్తున్నారు. సామాన్యుల జీవన ప్రమాణాలను మరింతగా దిగజార్చుతున్నారు. పాలకుల విధానాల వల్ల పాతాళానికి నెట్టబడుతున్న సామాన్యుడు ఆ విధానాలకు వ్యతిరేకంగా నిలిచి ఉద్యమించిన నాడే సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుంది. అప్పుడే నిజమైన ఉగాది.

➡️