దొంగల్ని వదిలేసి ఉద్యోగులపై కేసులా

Apr 7,2024 21:25

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : పోలీసులు అంటే ప్రజలకు రక్షక భటులు… కానీ, శ్రమను దోచుకునే యజమానులకు తొత్తులు కాదు. రక్షక భటులంటే నేరం, హింస, హానికరమైన చర్యలను నివారించడానికి రాజకీయాలకు అతీతంగా, బంధుత్వాలకు భిన్నంగా వ్యవహరించాల్సిన భద్రతా యంత్రాంగం. కానీ, అదే రక్షకభటులు.. దొంగలకు, శ్రమను దోచుకునే వారికి రక్షణగా నిలిస్తే ఏమనాలి? పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని అనుకోవాలా? లేక రాజకీయ నాయకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి స్వతంత్రను కోల్పోతున్నారని భావించాలా? ఇది జిల్లాలో తాజాగా జరుగుతున్న చర్చ ఇది.జిల్లాలో దొంగతనాలు, దోపిడీలు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో చెడ్డీగ్యాంగ్‌లు స్వైరవిహారం చేస్తున్నాయి. చింతలవలస ప్రాంతంలో జరిగిన రెండు దొంగతనాల తరువాత చీకటిపడితే శివారు ప్రాంతాల్లోని కుటుంబాలకు కంటిమీద కునుకు ఉండడం లేదు. గంజాయి దిగుమతి, వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. పెద్ద గంజాయి మాఫియానే నడుస్తోంది. అటువంటి రహస్యాలు బయటపడతాయనే భయంతోనే గతేడాది కెఎల్‌ పురంలోని ఓ యువకుడిని ఓ ముఠా కడతేర్చినట్టు ఆ ప్రాంతవాసులు కథలు కథలుగా చెప్పుకున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని నివారించేందుకు పోలీసుల సంఖ్య సరిపోవడం లేదంటూ కొంతమంది పోలీసు అధికారుల నోట వినిపిస్తోంది. ఇక కొట్లాటలు, కుటుంబ కలహాల కేసులైతే లెక్కలేదు. వీటిని నివారించడంతోపాటు కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన పోలీసులు యాజమాన్యాలకు, శ్రమదోపిడీ చేసిన వారికి కొమ్ముకాస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మిమ్స్‌ ఉద్యోగుల ఆందోళనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఇందుకు తార్కాణమని జనం చెప్పుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 67 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవేవీ గొంతెమ్మ కోర్కెలు కాదు. 2003లో ఏర్పాటైన మిమ్స్‌ ఆసుపత్రిలో సుమారు వెయ్యి పడకలు ఉన్నాయి. నర్సులు, ఎఎన్‌ఎంలు, ఆయాలు, వార్డు బార్సుతోపాటు ఎలక్ట్రికల్‌, పబ్లింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, లేబోరేటరీ, సెక్యూరిటీ తదితర విభాగాల్లో సుమారు 400మంది పనిచేస్తున్నారు. 2020లో కోవిడ్‌ సందర్భంగా ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందించారు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడి ఉద్యోగుల అంకితభావం.. అటు కాలేజీ, ఇటు బోధనాసుపత్రి ప్రతిష్ట పెంచింది. 2011 ఫిబ్రవరి వరకు సిఐటియు అండతో ఉద్యోగులు చేసిన పోరాటంతో వేతనాల పెంపు, నెలవారీ సెలవులు, డిఎ సదుపాయం, వేతన సవరణకు యాజమాన్యం ముందుకు రాక తప్పలేదు. ఈ క్రమంలోనే 2013, 2015, 2017 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా వేతన ఒప్పందాలు జరిగాయి. 2011 అక్టోబర్‌ నుంచి 2020 అక్టోబర్‌ వరకు క్రమం తప్పకుండా డిఎ పెరిగింది. ఇందుకు తగ్గట్టే ఉద్యోగులు యాజమాన్యానికి సహకరించారు. లాభాపేక్షలో పడ్డ యాజమాన్యం 2019లో చేయాల్సిన వేతన ఒప్పందానికి ముందుకు రాలేదు. ఇతర సదుపాయాల విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. 2021 నుంచి పనిలో చిన్నపాటి పొరపాట్లు జరిగినా జరిమానాలు విధించడం లేదా వేతనాల నుంచి కోత వంటి దుర్మార్గ చర్యలకు దిగింది. చివరికి బలవంతపు అంగీకార లెటర్లు రాయించడం వరకు వెళ్లింది. ఇటీవల కాలంలో వేధింపులు ముమ్మరం చేయడంతోపాటు చిన్నపాటి పొరపాట్లను సాకుగా చూపి పలువురిని సస్పెండ్‌ చేసింది. దీంతో యాజమాన్యం నిజస్వరూపం తెలుసుకున్న కార్మికులు సిఐటియు నాయకత్వంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉద్యోగులంతా ఆందోళనబాట పట్టారు. మిమ్స్‌ ఆసుపత్రి ముందు నిరసన దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ మొదలుకుని, కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, చివరికి కమిషనర్‌ వరకు ఈ సమస్యను తీసుకెళ్లారు. ఇటు స్థానిక ఎమ్మెల్యే, ఇతర పాలకుల దృష్టిలో కూడా సమస్యను పెట్టారు. అయినా స్పందించకపోవడంతో న్యాయ పోరాటం చేస్తున్న మిమ్స్‌ ఉద్యోగులకు ఇతర ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. 15 రోజుల క్రితం నెల్లిమర్ల మండలంలోని అన్ని గ్రామాల నుంచీ వందలాది ప్రజానీకం వచ్చి మద్దతు ప్రకటించారు. అయినా పాలకులు, అధికారులు న్యాయం చేయం చేసేందుకు చొరవ చూపలేదు. ఉద్యోగులు మాత్రం తమ ఆందోళన సామరస్యంగానే కొనసాగిస్తున్నారు. వీరి నిరసనలను పోలీసులు శాంతిభద్రత సమస్యగా చూపిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని జనం చర్చించుకుంటున్నారు. గడిచిన 67 రోజులుగా శిబిరం వద్ద రోజూ పోలీసులు పహారా కాస్తున్నారు. సుమారు 20 సార్లు ఉద్యోగులు, వారికి అండగా నిలిచిన సిఐటియు నాయకులను అరెస్టులు చేశారు. నిత్యం ఉద్యోగులను వెంబడిస్తూ బూట్ల చప్పుడు, లాఠీల ప్రదర్శనతో భయబ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు రోజుల్లో 27 మందిని అరెస్టుచేయగా, 24 మందిని రిమాండ్‌కు కూడా తరలించారు. దీంతో, పోలీసుల చర్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు స్వతంత్రను కోల్పోయి, రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని కొందరు, కనీసం ఉద్యోగుల బాధలను కూడా ఆకలింపజేసుకోకుండా కర్కశంగా వ్యవహరిస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే, ఉద్యోగుల హక్కులను కాలరాయడం మానేసి, వేతనాలు పెంచకుండా, డిఎలు చెల్లించకుండా తిరిగి వేధింపులకు పాల్పడుతున్న మిమ్స్‌ యాజమాన్యంపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. దొంగల్ని వదిలేసి, శ్రమదోపిడీకి గురౌతున్న వారిని హింసకు, వేధింపులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

➡️