జగన్‌ ఇచ్చిన పదవి తీసుకునివేరే పార్టీకి పనిచేస్తున్నారు

Apr 7,2024 21:29

ప్రజాశక్తి-శృంగవరపుకోట : వైసిపిలో సిఎం జగన్‌ ఇచ్చిన పదవులను తీసుకుని వేరే పార్టీకి పనిచేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అటువంటి వారు స్వలాభం కోసమే గాని ప్రజా క్షేమం కోసం పనిచేయరని ధ్వజమెత్తారు. అటువంటి వారిని లెక్కచేయనవసరం లేదని తేల్చిచెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని మాటిచ్చారు. ఆదివారం పట్టణంలోని శిరికి రిసార్ట్స్‌లో వైసిపి మండల అధ్యక్షులు మోపాడ కుమార్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వంలోనే ప్రజలు గౌరవంగా బతకగలరని తెలిపారు. పింఛన్ల పంపిణీ విషయంలో వాలంటీర్లపై ఇసికి ఫిర్యాదు చేసి, వైసిపిపై బురద చల్లాలని టిడిపి చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గృహసారథులంతా ఎన్నికల్లో చురుకుగా పనిచేసి మళ్లీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ. ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయకుమార్‌, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, జిసిసి చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, డిసిసిబి చైర్మన్‌ వేచలపు చినరామునాయుడు, కొప్పలవెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడుబాబు, ఎఎంసి చైర్‌పర్సన్‌ మూకల కస్తూరి, రాష్ట్ర ఫోక్‌, కల్చరల్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, జెడ్‌పిటిసిలు ఎం.వెంకటలక్ష్మి, శానాపతి అప్పారావు, వైస్‌ ఎంపిపి పినిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు.

➡️