భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూ.70 కోట్లతో నీటి సరఫరా

Apr 21,2024 22:09

ప్రజాశక్తి- భోగాపురం : భోగాపురం అంతార్జాతీయ విమానాశ్రయానికి నీటి సరఫరా పనులు ప్రారంభమయ్యాయి. ఈ విమానాశ్రయానికి ఒకరోజుకు 5 మిలియన్‌ (50లక్షలు) లీటర్లు అవసరమని గుర్తించారు. అందుకు 70 కోట్ల రూపాయలతో రెండు విడతల్లో పనులు జరగనున్నాయి. మొదటి విడత కింద రూ. 28 కోట్లతో 1.7మిలియన్‌ లీటర్లు నీటిని మాల నందిగాం గ్రామం వద్దనున్న చంపావతి నుంచి సరఫరా చేసేందుకు పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఆగస్టులో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రెండోవిడతలో రూ.42కోట్లతో తారకరామ తీర్ధసాగర్‌ నుంచి మరో పైపులైను వేసి తాగునీరు సరఫరా చేయనున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు 2025 డిసెంబరు నెలాఖరుకు పూర్తయ్యేలా జిఎంఆర్‌ సంస్థ ఎల్‌అండ్‌టి సంస్థకు పనులు అప్పగించింది. అందుకు అవసరమైన తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అందుకు అధికారులు తాగునీటిని నందిగాం పంచాయతీ మాల నందిగాం సమీపంలోని చంపావతి నదిలో బావులు నిర్మించి అక్కడ నుంచి సరఫరా చేయాలని నిర్ణయించారు. ఇందులో ఒక బావిలో నీటిని నిల్వ చేసి మరో బావి నుంచి నీటిని పంపింగ్‌ చేయనున్నారు. పైపులైనుకు సంబంధించి మాల నందిగాం, నందిగాం, ఉప్పుగెడ్డ, రామచంద్రపేట, మిరాకిల్‌ కళాశాల, బమ్మిడిపేట నుంచి చేపలకంచేరు వెళ్లే రహదారి మీదుగా గూడెపువలస మూడు గుళ్లు వద్ద విమానాశ్రాయానికి అనుసంధానం చేయనున్నారు. అక్కడ నుంచి విమానాశ్రయం లోపలకు మరో 2కిలోమీటర్లు సరఫరా పాయింటుకు పైపులైను వేయనున్నారు. ఇలా మొత్తం బావులు నుంచి విమానాశ్రయానికి 14 కిలో మీటర్లు పైపులైన్లు పనులు జరుగుతున్నాయి. శరవేగంగా చంపావతి నదిలో బావుల నిర్మాణం మాలనందిగాం వద్ద చంపావతి నదిలో రెండు బావుల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చేపలకంచేరు వెళ్లే రహదారి నుంచి బమ్మిడిపేట, రామచంద్రపేట వరకు సుమారు 6కిలో మీటర్లు పైపులైన్లు పనులు కూడా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చంపావతి నదిలోని బావులు నుంచి మాల నందిగాం, నందిగాం మీదుగా ఉప్పుగెడ్డ వరకు పైపులైన్లు వేసేందుకు పైపులు డంపింగ్‌ చేశారు. పైపులను తిరుపతి సమీపంలో కంపెనీ నుంచి కొనుగోలు చేస్తున్నారు. భోగాపురం గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఇ వైకుంఠం నాయుడు నేతృత్వంలో ఒక బృందం కూడా ఇక్కడ నుంచి నేరుగా కంపెనీకి వెళ్లి పైపుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించాకే అనుమతులు ఇచ్చారు.
ఆగస్టు నెలాఖరుకు పనులు పూర్తి చేయాలని నిర్ణయించాం
విమనాశ్రయానికి తాగునీటి సరఫరా పనులు ఆగస్టు నెలలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మొదటి విడత కింద 28కోట్లతో మాల నందిగాం వద్దనున్న చంపావతి నదిలో బావుల నిర్మాణం జరుగుతోంది. అలాగే పైపులైను పనులు మాల నందిగాం నుంచి ఉప్పుగెడ్డ వరకు పెండింగు ఉన్న పైపులైను పనులు కూడా ప్రారంభించాం. రెండో విడతలో తారకరామ తీర్ధసాగర్‌ నుంచి నీటిని అందించనున్నాం.
– జమ్ము వైకుంఠనాయుడు, ఆర్‌డబ్యుఎస్‌, డిఇ, భోగాపురం

➡️