విజయనగరం.. ఉపాధి రహిత కేంద్రం

Apr 27,2024 21:24

విజయనగరం జిల్లా కేంద్రం చారిత్రక పట్టణం. నేడు నగరంగా రూపాంతరం చెందినా అందుకు తగ్గ మౌలిక వసతులకు ప్రజలు నోచుకోవడం లేదు. శివారు కాలనీల్లో నేటికీ రోడ్లు,కాలువలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు లేవు. ఉపాధి కల్పించే ప్రధానమైన జ్యూట్‌ మిల్లులు ఏనాడో మూతపడగా, వాటిలో పనిచేస్తున్న కార్మికులు ఉపాధి కోసం వలసపోయిన వారు కొందరైతే.. చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారుర మరికొందరు.. పనులు లేక అల్లాడిపోతున్న ఇంకొందరు ఉన్నారు. పాలకులు ఎందరు మారినా ప్రజలు బాధలు పట్టడం లేదు. 1952లో ఏర్పడిన విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరిగాయి. ఇంత వరకు 9 మంది ఎమ్మెల్యేలుగా చేశారు. వీరిలో 7సార్లు, మూడు సార్లు, రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారు ఉన్నారు. అందులో రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రిగా పదవులు చేపట్టారు. కానీ నగరంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అభివృద్ధిలో వెనుకబడి ఉంది. జిల్లా కేంద్రమైన విజయనగరంలో ప్రజలకు సౌకర్యాలు ఆ స్థాయిలో అందించడంలో పాలకులు విఫలమయ్యారు.

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌:  విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీగా ఉన్న విజయనగరాన్ని 2016లో నగరపాలక సంస్థగా మార్పు చేశారు. అనంతరం 2017లో చుట్టుపక్కలున్న అయ్యన్నపేట, జమ్ము నారాయణ పురం, ధర్మపురి.గాజులురేగ, కెఎల్‌ పురంను నగరంలో విలీనం చేశారు. అయితే విలీనం చేసిన గ్రామాల్లో అభివద్ధి పనులు చేపట్టకపోగా పన్నుల భారం పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.సమస్యలు తిష్ట నగరంలో అనేక సమస్యలు ఏళ్ల తరబడి తిష్ట వేశాయి. ముఖ్యంగా నగరంలోని ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంలో ఇటు పాలకులు, అటు అధికారులు విఫలమయ్యారు. ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థతోపాటు రోడ్లపై ఆక్రమణలు ట్రాఫిక్‌ సమస్యకు ప్రధాన కారణం. ఇరుకైన రోడ్లు నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. కొద్దిపాటి వర్షం వస్తే నగరంలోని రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైతుబజార్లు మొత్తం జలమయం కావడంతో నగర ప్రజలు ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు.వర్షం వస్తే ముంపే నగరానికి వరద ముంపు సర్వసాధారణం అయిపోయింది. కారణం కాలువ వ్యవస్థ పురాతనమైనది కావడం, ఆక్రమణలు ఇందుకు కారణం. నగరంలో ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురై 80 మీటర్ల రహదారులు నేడు 60 మీటర్లకు తగ్గిపోయాయి. గంటస్తంభం ప్రాంతం, ఎమ్‌జి రోడ్డులో ఉన్న ఆక్రమించిన వారికి వేరేచోట ప్రత్యామ్నాయ స్థలాలు చూపించడంలో పాలకులు విఫలమయ్యారు. నగరంలో పెద్ద కాలువలు లేవు,100 ఏళ్ల క్రితం కాలువలే నేటికీ ఉండటం వల్ల వరదలు వచ్చిన ప్రతిసారీ కార్పొరేషన్‌ కార్యాలయం ప్రాంతంలో , మార్కెట్‌ ప్రాంతాలు జలమ యమవుతున్నాయి.అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రతిపాదనకే పరిమితంనగరంలో పురాతన కాలువ వ్యవస్థ ఉండటం వలన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మిస్తామని చెప్పిన నేతలు ఇంతవరకూ దాన్ని ఆచరణలో పెట్టలేదు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం సంగతెలా ఉన్నా ఉన్న డ్రెయినేజీలు సైతం మురుగునీరు పారక దుర్గంధం వెదజల్లుతూ వర్షాకాలం వస్తే ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. రూ.150 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ కాలువ వ్యవస్థ నిర్మాణం చేయాలని 15 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేసినా నేటికీ అమలు నోచుకోవడం లేదు. సర్వజన ఆసుపత్రే దిక్కునగరంలో అర్బన్‌ హెల్త్‌ కేంద్రాలు 15 వరకు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటీవల ఏడు మంజూరైనా వాటిలో మూడు మాత్రమే మాత్రమే ప్రారంభం అయ్యాయి తప్ప సేవలు అందడం లేదు. సిబ్బంది లేక వైద్య సౌకర్యాలు సక్రమంగా అందకపోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ రకంగా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారు. మే 13వ తేదీన మరోసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రానున్న పాలకులైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.పేరుకే డిగ్రీ కళాశాల నగరంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కనీస వసతులు లేకపోగా డిగ్రీ కాలేజీకి కనీసం సొంత భవనాలు లేకపోవడం సిగ్గుచేటు అని పలువురు విమర్శిస్తున్నారు. నగరంలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు, ఆందోళనలు చేసినా, వినతిపత్రాలిచ్చినా సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ హై స్కూళ్లు ఏర్పాటు చెయ్యలేదు. మూడున్నర లక్షల జనాభా కలిగిన నగరంలో ఒకే ఒక్క జూనియర్‌ కళాశాల ఉండటం వలన మున్సిపల్‌ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని బయటకొచ్చిన పేద విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి ప్రయివేటు కాలేజీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డున పడ్డ జ్యూట్‌ కార్మికులుజిల్లా కేంద్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పాలకులు ఎటువంటి కృషీ చేయలేదు. వందేళ్లుగా ఉన్న జ్యూట్‌ మిల్లులు మూతపడడం, మరో ఇండిస్టీ లేకపోవడంతో ఉపాధి కోసం ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే పదేళ్ల కిందట నగరంలో ఉన్న అరుణా, ఈస్టుకొస్తు జ్యూట్‌ పరిశ్రమలు మూతపడటంతో సుమారు 10 వేల మంది కార్మికులు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కార్మిక సంఘాల నాయకులు ఎంత పోరాడినా మిల్లు తెరవకపోవడంతో ఉపాధి కోసం కార్మికులు పెయింటర్లుగాను, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకుంటూ, తాపీ పనులు చేసుకుంటూ, షాపుల్లో పనిచేస్తూ, కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కల్పనలో టిడిపి ప్రభుత్వం గాని, వైసిపి ప్రభుత్వం గాని పట్టించుకోలేదు.

➡️