‘ఎస్‌ఆర్‌కెఆర్‌’లో ముగిసిన ఐసిఎఎఐ-2023

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
అల్గారేథమ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌లో పరిశోధనలు చేసే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం పెద్దఎత్తున నిధులు అందిస్తుందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్‌ఐటి వరంగల్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌బివి.సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అలగారిద్దమ్స్‌ ఇన్‌ అడ్వాన్స్డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఐసిఎఎఐ-2023) అంశంపై మూడు రోజుల పాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కళాశాల కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ హెడ్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంతర్జాతీయ సదస్సులకు వచ్చిన పేపర్లను విద్యార్థులు ప్రాజెక్టులు స్వీకరించి వాటికి ఆచరణ రూపం తీసుకొస్తే ఎన్నో వినూత్న ఆవిష్కరణలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. జెఎన్‌టియుకె కాకినాడ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎంహెచ్‌ఎం.కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ కళాశాలలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అన్ని విభాగాలు కృషి చేయాలని సూచించారు. తద్వారా విద్యార్థులకు ఫ్యాకల్టీకి ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న అధ్యాపకులకు డాక్టర్‌ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కెవి.మురళీకృష్ణంరాజు, ఎన్‌ఐటి వరంగల్‌ ప్రొఫెసర్‌ నగేష్‌బట్టు, డాక్టర్‌ కెఎన్‌వి.జగన్మోహన్‌, డాక్టర్‌ గుప్తా పాల్గొన్నారు.

➡️