ఓట్ల తొలగింపు దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు

Feb 14,2024 22:17

రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి – ఏలూరు
నియోజకవర్గ పరిధిలో ఫారం-7కి దరఖాస్తులు 0.1 శాతంకన్నా ఎక్కువ వస్తే ఆ ఓట్ల తొలగింపు పరిశీలనకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ఏలూరు జిల్లా ఓటర్ల జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో బుధవారం ఆయన సమావేశమయ్యారు. సమావేశంలో డిఆర్‌ఒ డి.పుష్పమణి, కలెక్టరేట్‌ ఎఒ కె.కాశీవిశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు డి.రత్నబాబు (బిఎస్‌పి), నెరుసు నెలరాజు (బిజెపి), పి.ఆదిశేషు (సిపిఎం), ఆర్‌.సత్యనారాయణ (ఆమ్‌ఆద్మీ), పాలి ప్రసాద్‌ (టిడిపి), కలవకొల్లు సాంబ (వైసిపి) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల చేసిన తుదిఓటర్ల జాబితా పరిశీలించింది, లేనిదీ ఆయా రాజకీయపక్షాల ప్రతినిధులను కలెక్టర్‌ ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఫారం-7కి దరఖాస్తులు 0.1 శాతంలోపు, పైన ఉంటే వాటిని పరిశీలించేందుకు జిల్లాస్థాయిలో డిప్యూటీ కలెక్టర్లతో కూడిన రెండు బృందాలను నియమించామన్నారు. కమిటీ పరిశీలన అనంతరం సంబంధిత ఓట్ల తొలగింపునకు జిల్లా ఎన్నికల అధికారిగా తాను చర్యలు తీసుకుంటానన్నారు. అదే 0.1 శాతంకన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే ఆ ఓట్లను తొలగించాలంటే రాష్ట్రస్థాయిలో కమిటీ పరిశీలించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పిస్తామన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా నిర్ధేశించిన సంఖ్య మేరకు అనుబంధ పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలని రాజకీయపక్షాల ప్రతినిధులను ఆయన కోరారు. సంబంధిత వివరాలు ఆయా నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులకు అందజేస్తే సంబంధిత బృందాలతో పరిశీలించి అనుబంధ పోలింగ్‌ స్టేషన్లకు అవసరమైతే ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపుతామన్నారు. జిల్లాలో తుది ఓటర్ల జాబితా విడుదల నాటికి 16,24,416 ఓట్లు నమోదవ్వగా అనంతరం కొత్తగా దరఖాస్తు చేసిన వాటి పరిశీలన అనంతరం నేటికీ 16,25,618కు చేరిందన్నారు. జిల్లాలో ఫిబ్రవరి 14వ తేదీ నాటికి అందిన దరఖాస్తుల్లో 17,010 పరిశీలనలో ఉన్నాయన్నారు. వాటిలో ఫారం-6 కింద 4,034, ఫారం-7 కింద 7,562, ఫారం-8 కింద 5,414 పరిశీలనలో ఉన్నాయన్నారు. వీటన్నింటినీ త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇవి సప్లిమెంట్‌ ఓటర్ల జాబితాలో చేర్చుతామన్నారు.

➡️