కృష్ణంరాజు ఆశయ సాధనకు కృషి

ఆయన సతీమణి శ్యామలాదేవి
ప్రజాశక్తి – మొగల్తూరు
కృష్ణంరాజు ఆశయ సాధన మేరకు వైద్య సేవలందించడమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఆయన సతీమణి శ్యామలాదేవి, లండన్‌కు చెందిన షుగర్‌ వ్యాధి నిపుణులు వేణు కవర్తపు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు జయంతి వేడుకను మొగల్తూరులో ఆయన స్వగృహంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును కట్‌ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణంరాజు పేదలకు విద్య, వైద్యం అందించడం కోసం తపించేవారన్నారు. ఆయన ఆశయ సాధన మేరకు తాము యుకె డయాబెటిక్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. కొన్ని కారణాలతో ఆయన ఉండగా అమలు చేయలేకపోయామని, ఇప్పుడు ప్రారంభించామని తెలిపారు. ఈ శిబిరాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవ నాయుడు, మాజీ సర్పంచి కలిదిండి స్వర్ణకుమార్‌బాబు, ఆకుల శేషసాయి సతీమణి గీత, పులపర్తి వెంకటేశ్వరరావు దాసరి బాబి, సిహెచ్‌విపి శ్రీనివాస్‌ప్రసాద్‌, కెపిఎస్‌ఎన్‌.ముక్తేశ్వరరావు, పలు పార్టీలకు చెందిన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.షుగర్‌ వ్యాధి పట్ల అప్రమత్తత అవసరంషుగర్‌ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లండన్‌కు చెందిన షుగర్‌ వ్యాధి నిపుణులు వేణు కవర్తపు, ఉప్పలపాటి శ్యామలాదేవి అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కష్ణంరాజు జయంతిని పురస్కరించుకుని మొగల్తూరులోని అందే బాపన్న జూనియర్‌ కళాశాల కోట్ల వెంకట రంగారావు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యుకె ఇండియా డయాబెటిక్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు మెమోరియల్‌ ఉచిత మెగా షుగర్‌ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. తాము చేపట్టిన వైద్య శిబిరాల ద్వారా షుగర్‌ వ్యాధితో కాలు చేతులు వంటి అవయవాలు కోల్పోకుండా నిరోధించేందుకు తగు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సుమారు 30 మంది వైద్యులు 2000 మంది ప్రజలకు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించారు. శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించి భీమవరం వర్మ హాస్పిటల్‌, హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేస్తామని నిర్వాహకులు తెలిపారు. వర్మ హాస్పిటల్‌ అధినేత పిఆర్‌కె.వర్మ, రాయసం నరేష్‌ అపోలో ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్‌ వైద్య సేవలందించారు. ఏరియా ఆర్‌ఎంపి అసోసియేషన్‌ సభ్యులు, పలువురు వాలంటీర్లు సేవలందించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడు, టిడిపి నాయకులు ఎన్‌ఆర్‌ఐ కొవ్వలియతి రాజారామ్మోహన్‌ నాయుడు, జనసేన పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొమ్మిడి నాయకర్‌ సందర్శించారు.

➡️