గ్రామాలాభివృద్ధే వైసిపి లక్ష్యం

ప్రజాశక్తి – గణపవరం
గ్రామాలాభివృద్ధే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ, ఉంగుటూరు ఎంఎల్‌ఎ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని భువనపల్లిలో రూ.2.46 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచినీటి చెరువు తవ్వకాలు రూ.30 లక్షలతో చేపడుతున్నట్లు చెప్పారు. రూ.45 లక్షలతో సచివాలయాలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రూ.21 లక్షలతో కాపవరం కాలవ నుంచి జగ్గయ్య మంచినీళ్ల చెరువుకు పైపు లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్మశానానికి రూ.21 లక్షలతో ప్రహారీ, అంతర్గత సీసీ రోడ్లు, రూ.37 లక్షల దాతల విరాళంతో నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాన్ని, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కిలారి సత్యవతి, రవిబాబు, నిడమర్రు ఎంపిపి ధనుకొండ ఆదిలక్ష్మి, సూర్య బలిజ రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శెట్టి అనంతలక్ష్మి, గణపవరం సర్పంచి మోర అలంకారం, భువనపల్లి ఉప సర్పంచి ఎల్లంకి నరేష్‌, ఎంపిడిఒ విజయకుమారి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️