నేడు బంద్‌, సమ్మెకు సర్వం సన్నద్ధం

జిల్లా, మండల కేంద్రాల్లో ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు – నేతృత్వం వహించనున్న రైతు, కార్మిక సంఘాల నేతలు
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
దేశవ్యాప్తంగా 11 జాతీయ కార్మిక సంఘాలు, 550 రైతు సంఘాలకు పాతినిధ్యం వహిస్తున్న కిసాన్‌ సంయుక్త మోర్చా ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె, గ్రామీణ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో శుక్రవారం ర్యాలీలు, సభలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌.స్వామినాథన్‌కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించింది. అయితే ఆయన ప్రతిపాదించిన కనీస మద్దతు ధరను గత ప్రభుత్వాలు, నేటి బిజెపి ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించాయి. డాక్టర్‌ స్వామినాథన్‌ రైతాంగానికి మేలు చేసే విధానాన్ని సమగ్రంగా అధ్యయం చేసి ప్రకటించారు. మద్దతు ధర అంటే రైతు పంటను పండించేదానికి అయ్యే ఖర్చు, రైతు కుటుంబం చేసే శ్రమకు అదనంగా 50 శాతం జోడించాలని వివరించారు. ఇది అమలు కానందునే వ్యవసాయం నేడు దివాలా తీసింది. నేటికీ మన దేశంలో ప్రజలు 65 శాతం వ్యవసాయంపైనే ఉపాధికి ఆధారపడి ఉన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు వ్యవసాయాన్ని వదిలి పొట్ట కూటి కోసం వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. వ్యవసాయంపై ఆధారపడిన కూలీ, కౌలు రైతు, చిన్న, మధ్యతరగతి రైతులకు ప్రభుత్వం ఎటువంటి సహాయాన్నీ అందించడం లేదు. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ జరగనంతగా 2021-22లో మూడు రైతు నల్లచట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతాంగం మహా ఉద్యమం నడిపింది. ఆ సందర్భంగా ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, రైతులకు మద్దతుధరల గ్యారెంటీ చట్టం తీసుకొస్తామని, రైతులపై కేసులు ఎత్తివేస్తామని చేసిన వాగ్దానాలు నేటికీ అమలు కాలేదు. రైతులపై 45 వేల పోలీసు కేసులున్నాయి. 742 మంది ఈ ఉద్యమంలో మరణించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. కార్మిక వర్గం స్వాతంత్రం ముందు నుండి సాధించుకున్న కార్మిక హక్కులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దాడి చేస్తోంది. అందుకే ముందుగా కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా 16న తలపెట్టిన జాతీయ పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్‌కు జిల్లాలోని కార్మికులు, రైతులు సిద్ధమయ్యారు. అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో నిరసనలు తెలిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.

➡️