‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లుకలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ

Feb 26,2024 22:36

ప్రజాశక్తి – భీమవరం
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అధ్యక్షతన పబ్లిక్‌ పరీక్షల నిర్వహణా ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. మార్చి 18 నుండి 30వ తేదీ మధ్య నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. రెగ్యులర్‌ విద్యార్థులు 21,341 మంది, గత పరీక్షల్లో తప్పిన వారు 6,085 మంది మొత్తం 27,426 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా నిర్వహించే ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షలు మార్చి 18 నుండి మార్చి 27 వరకు మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ నిర్వహిస్తారన్నారు. ఎస్‌ఎస్‌సికి 997 మంది, ఇంటర్‌ పరీక్షలకు 1,890 మంది మొత్తం 2,887 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ నెల 27 నుండి టెట్‌ పరీక్షల అనంతరం ఇంటర్‌, ఎస్‌ఎస్‌సి పరీక్షలు నిర్వహించనున్నందున అన్ని రకాల పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖాధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ బి.శివనారాయణరెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ కానాల సంగీత్‌ మాధుర్‌, డిఇఒ ఆర్‌.వెంకట రమణ, జిల్లా వార్డు, గ్రామ సచివాలయాల అధికారి కెసిహెచ్‌.అప్పారావు, డిఎస్‌పి వి.నారాయణస్వామిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️