పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయండి

నేటికీ లక్షలాది మంది గీత కార్మికులు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఒకవైపు గీత వృత్తి ప్రమాదకరంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోయినా కుటుంబ పోషణ కోసం వృత్తిని కొనసాగిస్తున్నారు. తరాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారుగాని గీతన్నల రాతలు మార్చే పాలకులు రావడం లేదు. వృత్తికి గ్యారంటీ లేదు. జీవితాలకు భద్రత లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సందర్భంగా ‘మోకు భుజాన వేసుకుని.. నేను ఉన్నాను, నేను విన్నాను’ అని గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, కిస్తీలు రద్దు చేసి తాటి చెట్లపై హక్కు లేకుండా చేసి వృత్తిని దారుణంగా దెబ్బతీశారు.కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పోరాటం వల్ల వేలం పాటలు రద్దు, గీచే వారందరికీ సభ్యత్వం, గుర్త్తింపు కార్డులు, గీచే వారికే చెట్టుపై హక్కు, ఎక్స్‌గ్రేషియా, గుడి, బడి, చర్చి తప్ప ఎక్కడైనా కల్లు అమ్ముకునే హక్కు, ప్రతి సొసైటీలో చెట్లు పెంచుకునేందుకు ఐదెకరాల భూమి ఇవ్వాలని జిఒ 560, ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు ఉచితంగా గీసుకునే హక్కు, 50 సంవత్సరాలు పైబడిన గీత కార్మికులకు పింఛను ఇవ్వాలని జిఒ 350, తాటి, ఈత చెట్లు నరికిన వారికి రూ.వెయ్యి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించేలా జిఒ, తదితర హక్కులు నాడు సాధించుకున్నాం. అంతేకాదు ప్రభుత్వానికి, కల్లుగీత కార్మికులకు మధ్య వారధిలా పని చేయడానికి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 1991లో పోరాడి సాధించుకున్న కల్లుగీత కార్పొరేషన్‌ను వైసిపి ప్రభుత్వం మూసేసింది. హర్యానా, కర్ణాటక, తెలంగాణ, ఒడిశ్శా, గోవా, యానాం తదితర రాష్ట్రాల నుండి అక్రమ మద్యం వరదలా మన రాష్ట్రానికి వస్తుంటే అరికట్టలేకపోతున్నారు. ఎనీటైమ్‌ విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మించి కల్లు అమ్మకాలు దెబ్బతీస్తున్నారు. 2020 లాక్‌డౌన్‌ సమయంలో మనపక్క రాష్ట్రాలు కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు కల్లుపై ఏవిధమైన ఆంక్షలూ విధించలేదు. ఆ రాష్ట్రాల్లో గీత కార్మికులు స్వేచ్ఛగా కల్లు అమ్ముకున్నారు. మన రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కల్లుగీత కార్మికులపై కక్షగట్టి, కల్లుపై ఆంక్షలు విధించి 40 రోజులు కల్లు గీయనీయలేదు. ఎక్సైజ్‌ అధికారులు దౌర్జన్యంగా గీత కార్మికులపై బైండోవర్‌ కేసులు పెట్టారు. తాటిచెట్లకు ఉన్న కల్లు కుండలను రాళ్లతో పగలగొట్టారు. వైసిపి ప్రభుత్వం ఉపాధి పోయి కష్టాల్లో ఉన్న గీత కార్మికులను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాలు చేయడంతోపాటు ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవి) ద్వారా మంత్రులు, అధికారులతో చర్చించాం. అన్నదమ్ముల్ల్లా కలిసి ఉన్న గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాల గీత కార్మికులను వైసిపి ప్రభుత్వం చీల్చేసింది. కులాల కార్పొరేషన్లు పెట్టి వైసిపి కార్యకర్తలు కొందరికి పదవులు ఇచ్చారు. కులాల కార్పొరేషన్‌ పెట్టి గీత కార్మికుల కొంపలు ముంచారే తప్ప వారికి ఒరిగిందేమీ లేదు. ప్రభుత్వం మాత్రం కార్పొరేషన్లు తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంది. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి 14 నెలలైనా అతీగతీ లేదు. వందల సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇస్తారో.. లేదో తెలియదు. కిస్తీలు రద్దు చేసి తాటిచెట్లపై హక్కు లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. గీత కార్మికులను ఈ ప్రభుత్వం ఎందుకు చిన్నచూపు చూస్తోంది. కార్పొరేషన్లకు, గీత కార్మికుల సంక్షేమానికి ఏమాత్రం నిధులు కేటాయించలేదు.గీత కార్మిక కుటుంబాల పట్ల వైసిపి ప్రభుత్వ వైఖరి ఏమిటీ, ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గీత కార్మికుల సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. వైసిపి ప్రభుత్వ విధానాల వల్ల వృత్తిలో బతకలేక నగరాలకు, విదేశాలకు ఇతర పనులకు వలసలు పోతున్నారు. ఇదేనా గీత కార్మిక కుటుంబాలకు వైసిపి ప్రభుత్వం ఇచ్చే బహుమతి.. అందుకే మనకు తీరని అన్యాయం చేసిన వారికి మన సత్తా ఏమిటో చూపిద్దాం.కల్లు కుండేమో కన్నీరు పెడుతుంది.. ఊరువాడ మద్యం మాత్రం వరదలా పారుతోంది.. గీతన్నల బతుకులు బజారుపాల్జేస్తోంది. ఆంధ్ర కల్పవృక్షంగా పేరొందిన తాటిచెట్లు రియల్‌ ఎస్టేట్‌ దెబ్బకు నేలకొరుగుతున్నాయి.కల్లుపై కక్షగట్టిన సర్కారుపై ఐక్యంగా పోరాడదాం.. వృత్తిని కాపాడుకుందాంకల్లుగీత కార్మికుల ప్రధాన డిమాండ్లు1.2024-25 బడ్జెట్‌లో గీత కార్మికుల సంక్షేమానికి రూ.30 కోట్లు కేటాయించాలి.2.తాటిచెట్టుకు రూ.5 చొప్పున పన్ను (కిస్తీలు) కట్టించుకుని చెట్టుపై హక్కు కల్పించాలి.3.వృత్తిలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలి. సేఫ్టీ (రక్షణ) మోకులు ఇవ్వాలి.4.ప్రతి గీత కార్మికునికీ బీమా అమలు చేయాలి. ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించాలి.5.అర్హులైన గీత కార్మికులందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి.6.వృత్తిలో ప్రమాదానికి గురై చనిపోయిన వారి కుటుంబాలకు, శాశ్వత వికలాంగులకు రూ.10 లక్షలు, తాత్కాలిక వికలాంగులకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. చనిపోయిన పిల్లలకు విద్య, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.7.బెల్టు షాపులు, అక్రమ మద్యం తక్షణం అరికట్టాలి. వారానికి రెండు రోజులు లిక్కర్‌ డ్రై డేలుగా ప్రకటించాలి.8.కల్లు సొసైటీలకు 40 శాతం మద్యం షాపులివ్వాలి.9.ప్రతి సొసైటీకీ చెట్లు పెంచడానికి జిఒ 560 ప్రకారం ఐదెకరాల భూమి ఇవ్వాలి.10.గీత కార్మికులందరికీ ద్విచక్ర మోటారు వాహనాలు ఉచితంగా ఇవ్వాలి.11.గీతన్న బంధు ప్రకటించి ప్రతి గీత కార్మిక కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలి.12.తాటి, ఈత చెట్లను నరికిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.13.పింఛను రూ.5 వేలకు పెంచాలి. ఎలాంటి షరతులూ విధించరాదు.14.1991లో పోరాడి సాధించుకున్న కల్లుగీత కార్పొరేషన్‌ను యధావిధిగా పని చేయించాలి. కార్పొరేషన్‌ ప్రభుత్వానికి, కల్లుగీత కార్మికుల మధ్య వారధిలా పని చేయాలి. వృత్తిలో చనిపోయిన వారి కుటుంబానికి తక్షణ దహన సంస్కారాలకు రూ.30 వేలు, గాయాలైన వారికి వైద్య ఖర్చులకు రూ.20 వేలు కార్పొరేషన్‌ నుండి తక్షణమే ఇవ్వాలి.15.కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి.16.ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలి.17.సొసైటీల నిర్వహణపై అధ్యక్షులకు, సభ్యులకు అవగాహన కల్పించేందుకు జిల్లాస్థాయి చైతన్య సభలు పెట్టాలి.18.నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలి.19.పేద గీత కార్మికులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.20.కేరళ మాదిరిగా కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించి ఉపాధికి గ్యారంటీ ఇవ్వాలి. కల్లుగీత సహకార సంఘాలను పటిష్టపర్చాలి.- జుత్తిగ నరసింహమూర్తిఎపి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

➡️