ప్రజా శ్రేయస్సే ముఖ్యమంత్రి లక్ష్యం

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌

ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలో పది కోట్ల 15 లక్షల రూపాయలతో జరిగిన అభివృద్ధి పనులను మంగళవారం ఆయన ప్రారంభించి మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా తోకతిప్పలో రూ.18 లక్షలతో నిధులతో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.8.30 లక్షలతో కొల్లాటి పెద్దిరాజు ఇంటి నుంచి కొల్లాటి లక్ష్మణస్వామి ఇంటి వరకూ నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే రూ.ఐదు లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. దెయ్యాల తిప్ప గ్రామంలో రూ.పది లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం రూ.9 కోట్లతో దిరుసుమర్రు హరిజనవాడ నుండి కోమటితిప్ప వరకూ ఐదు కిలోమీటర్లకుపైబడి నూతనంగా నిర్మించిన బీటీ, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేశారన్నారు. భీమవరం మండలంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలను, పట్టాలను ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, ఎంపిపి సంఘం జిల్లా అధ్యక్షులు పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్‌పిటిసి కాండ్రేగుల నరసింహారావు, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ తిరుమాని ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️