బకాయి వేతనాలివ్వాలని స్కూల్‌ స్వీపర్ల నిరసన

ప్రజాశక్తి – తణుకురూరల్‌

స్కూల్‌ స్వీపర్లకు 8 నెలల బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలోకి చొరబడి బకాయి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఎంఇఒ మురళీ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌, గార రంగారావు మాట్లాడుతూ స్కూల్‌ స్వీపర్లకు 8 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారన్నారు. మున్సిపల్‌ స్కూల్‌ ఉన్న విధంగా మండల ఏడ్యుకేషన్‌ నుండి కూడా వేతనాలు ఇవ్వాలన్నారు. ఇస్తున్న రూ.4 వేలు పెరుగుతున్న ధరలతో చాలడం లేదన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బకాయి వేతనాలు ఇవ్వకుంటే మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి తాళాలు వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వీపర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పి.శారద, కార్యదర్శి కొంగరపు సత్యవతి, ధనలక్ష్మి, పి.లక్ష్మి, హేమలత, బంగారమ్మ, మహాలక్ష్మి, అర్జునమ్మ, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

➡️