మరమ్మతులకు గురైన రేషన్‌ వ్యాన్‌

సరుకులు అందక ప్రజల ఇక్కట్లు
మూడు నెలలుగా ఇదే పరిస్థితి
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
ప్రజాశక్తి – ఆకివీడు
మండలంలోని అయిభీమవరంలో వినియోగదారులకు రేషన్‌ బియ్యం సరఫరా చేసే వ్యాన్‌ మూడు నెలలుగా షెడ్డులో ఉంది. దీన్ని పట్టించుకునేవారే లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రారంభించిన రేషన్‌ వ్యాన్‌ మరమ్మతులకు గురవుతుంది. ఈ రేషన్‌ వ్యాన్‌ సాధారణ వ్యక్తుల కన్నా వృద్ధులు, వికలాంగులకు సౌలభ్యంగా ఉంటుంది. ఆ రెండు కోవలకు చెందినవారు రేషన్‌ షాపు వద్దకు వెళ్లి క్యూలో నిల్చుని బియ్యం సరుకులు తీసుకునే పరిస్థితి ఉండదు. వారికి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. అయితే ఆ రకంగా ఉపయోగపడుతున్నప్పటికీ వ్యాన్లు మాత్రం నాణ్యతాలోపంతో ఎక్కడికక్కడ పడకేస్తున్నాయి. ఒక ఆయిభీమవరంలో వినియోగదారులకు రేషన్‌ సరుకులు సరఫరా చేసే వ్యాన్‌ సుమారు ఆరు నెలలుగా పడకేసింది. మొదటిగా వ్యాన్‌పై సరఫరా చేసే యువకుడిని ఫిర్యాదుల కారణంగా తప్పించారు. ఆ తర్వాత ఒక నెల రోజులు పాటు ఎవరిని నియమించలేదు. దీంతో రెండు నెలలు సరఫరా సమస్య ఏర్పడింది. ఆ తర్వాత దుంపగడపకు చెందిన ఒక యువకుడిని నియమించినా అతను ఒక నెలలోనే వెళ్లిపోయాడు. మళ్లీ రెండు నెలలు ఖాళీ ఏర్పడింది. ఎట్టకేలకు స్థానిక యువకుడిని రేషన్‌ సరఫరా కోసం నాలుగు నెలల క్రితం నియమించారు. అయితే నియమించిన ఒక్క నెల అతను వ్యాన్‌పై సరుకులు సరఫరా చేశాడు. ఆ కాలంలో కూడా వ్యాన్‌ వల్ల ఎంతో ఇబ్బంది పడినట్లు తెలిపాడు. ఆ తర్వాత నుంచి వ్యాన్‌ పనిచేయక సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం మూడు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బియ్యం సరఫరా చేసేవారు లేకపోవడంతో వృద్ధులు, వికలాంగులు బియ్యం తీసుకునే వారి శాతం భారీగా తగ్గిపోయింది. వీటికి తోడు వ్యవసాయ పనులకు వెళ్లిన వార్లు తిరిగొచ్చి తీసుకునేందుకు సమయం లేక అనేకమంది బియ్యం వదులుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఆకివీడు మండలంలో ఈ పరిస్థితులను సమీక్షించేందుకు పౌరసరఫరాల విభాగానికి సంబంధించిన ప్రత్యేకాధికారులు ఎవరూ లేకపోవడం గమనార్హం. ఎక్కడో ఉన్న డిటి ఇన్‌ఛార్జులు మాత్రమే పని చేస్తున్నారు. అధికారుల వద్ద పూర్తిస్థాయి సమాచారం ఉండదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రేషన్‌ వ్యాన్‌కు మరమ్మతులు చేయించి, రేషన్‌ సరఫరా చేసే వ్యక్తిని నియమించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

➡️