మళ్లీ వైసిపి వస్తేనే పథకాల కొనసాగింపు

వైఎస్‌ఆర్‌ ఆసరా భారీ బహిరంగ సభలో డిప్యూటీ సిఎం కొట్టు
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వం వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, అందరికీ మంచి జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెంలో వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత సంబరాలు శనివారం మదర్‌ వన్నీని ఆసుపత్రి ఎదురుగా ఉన్న మున్సిపల్‌ పార్కులో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు తాడేపల్లిగూడెం టౌన్‌, రూరల్‌, పెంటపాడు మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల పట్ల వైసిపి ప్రభుత్వానికి, సిఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉందన్నారు. జగనన్న సంక్షేమ పథకాల ఆర్థిక లబ్ధిని నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి, వైఎస్‌ఆర్‌ ఆసరా, చేయూత, కాపునేస్తం, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన ఇలా అనేక సంక్షేమ పథకాల ఆర్థిక లబ్ధి మొత్తాన్ని సిఎం జగన్‌ మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ అమలవుతాయన్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత సందర్భంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని 3939 స్వయం సహాయక సంఘాలకు చెందిన 37,773 మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తూ డ్వాక్రా రుణమాఫీ కింద రూ.33 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ అనపర్తి శామ్యూల్‌, జెడ్‌పిటిసి సభ్యులు ముత్యాల ఆంజనేయులు, ఆర్‌డిఒ కె.చెన్నయ్య, ఎఎంసి ఛైర్మన్‌ ముప్పిడి సంపత్‌కుమార్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ కర్రి భాస్కరరావు, పెంటపాడు ఎంపిపి దాసరి హైమావతి, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, వార్డు ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. నరసాపురం :భవిష్యత్తులో డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు మరింత బలోపేతం కావాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు సంబంధించిన వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ పట్టణంలోని కాటన్‌ పార్క్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పట్టణంలో 14 వార్డులకు సంబంధించిన 635 స్వయం సహాయక సంఘాలు 6,350 మంది మహిళలకు రూ.5.67 కోట్ల విలువైన నమూనా చెక్కును స్వయం సహాయక సంఘాల గ్రూపులకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తిరుమని నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు, ఎఎంసి ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కామన నాగిని పాల్గొన్నారు.

➡️