మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత

Mar 4,2024 21:13

చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు
ప్రజాశక్తి – నరసాపురం
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం పెద్దఎత్తున నిధులు ఖర్చు పెట్టామని చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని చిట్టవరంలో రూ.36.60 లక్షలు జలజీవన్‌ మిషన్‌ నిధులతో నిర్మించే సురక్షిత తాగునీటి సరఫరా పైపులైను పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. రూ.43 లక్షలతో నిర్మించిన పలు సిమెంటు రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలను పూర్తి చేసుకున్నామన్నారు. గ్రామంలో రూ.43 లక్షలతో నిర్మించిన వివిధ సిమెంట్‌ రోడ్లను, రూ.37 లక్షలతో సురక్షిత తాగునీటి పైపులైను విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. గ్రామంలోని ఇంటర్నల్‌ రోడ్లు, లింక్‌ రోడ్లు పూర్తి చేశామన్నారు. నరసాపురం ప్రధాన రహదారి నుంచి గొంది వరకు ఆర్‌అండ్‌బి రోడ్డు పూర్తి చేసినట్లు తెలిపారు. హౌసింగ్‌ లేఅవుట్స్‌ పనులు పూర్తయ్యాయన్నారు. చిట్టవరంలో ప్రధానంగా తాగునీటి సమస్యను అధిగమించేందుకు గతేడాది రూ.80 లక్షల జలజీవన్‌ మిషన్‌ నిధులు మంజూరు చేసుకుని ఆరు నివాస ప్రాంతాల్లో పైపులైన్లకు ఖర్చు పెట్టామన్నారు. మిగిలి ఉన్న రెండు ఆవాసాలకు పైపులైన్లు మోటార్లకు సంబంధించి సోమవారం శంకుస్థాపన చేసి రూ.రూ.37 లక్షలతో పనులు పూర్తి చేసి గ్రామాల్లోని శివారు ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామన్నారు. రూ.1.30 లక్షలతో డ్రెయినేజీ పనులు పూర్తి చేసుకున్నామన్నారు. అనంతరం అర్హులకు రిజిస్ట్రేషన్‌ ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు బి.రాధాకృష్ణ, ఎంపిపి సోనీ, గ్రామ సర్పంచి దాడి లక్ష్మణరావు, ఎంపిటిసి సభ్యులు నక్క లక్ష్మీనారాయణ, పిఎసి డైరెక్టర్‌ చల్లా సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️