‘రెబల్స్‌’ రచ్చ..!

అసంతృప్తులతో వైసిపి, టిడిపిలో గందరగోళం
ఉండి, నూజివీడు, నరసాపురంల్లో టిడిపికి తప్పని తలనొప్పి
చింతలపూడి వైసిపి ఎంఎల్‌ఎ కాంగ్రెస్‌లో చేరి పోటీకి రెఢ
ఏ పార్టీ అభ్యర్థికి నష్టమో అంటూ రకరకాల లెక్కలు
వెనక్కి తగ్గుతారా.. పోటీకి సిద్ధమా అనేది సందిగ్ధమే
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
టిడిపి, వైసిపిలో అసంతృప్తులతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. రెండు జిల్లాల్లో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రధానంగా నాలుగుచోట్ల ఆయా పార్టీల నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడిన నాయకులు రెబల్స్‌గా, ఇతర పార్టీల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు దీటుగా నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలైన టిడిపి, వైసిపి అభ్యర్థుల్లో ఎవరికి నష్టం జరుగుతుందోననే చర్చ సర్వత్రా సాగుతోంది. ఉండి నియోజకవర్గ టిక్కెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి శివరామరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. నియోజవకర్గమంతా తిరుగుతూ ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. ఆయన్ని బుజ్జగించేందుకు టిడిపి ఎన్ని ప్రయత్నాలు చేసినా శివరామరాజు వెనక్కి తగ్గలేదు. దీంతో ఉండి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. శివరామరాజు బరిలో ఉండటంతో టిడిపికి నష్టమా, వైసిపికి నష్టమా అనే అంచనాలు పెద్దఎత్తున సాగుతున్నాయి. ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసినప్పటికీ విత్‌డ్రాల సమయం వచ్చేసరికి ఆయన్ని ఒప్పించి పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారమూ సాగుతోంది. అప్పటి వరకూ టిడిపికి తలనొప్పి తప్పదని చెప్పొచ్చు. నరసాపురం నియోజకవర్గ టిక్కెట్‌కు సంబంధించి ఆది నుంచి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌ పేరు ప్రముఖంగానే విన్పించింది. టిడిపి నుంచి మాధవనాయుడు, పొత్తూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్‌నాయుడు టిక్కెట్‌ ఆశించారు. వైసిపిని వదిలి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం టిక్కెట్‌ తనదే అంటూ చెబుతూ వచ్చారు. చివరికి జనసేన అభ్యర్థిగా నాయకర్‌ పేరు ఖరారైంది. దీంతో టిడిపి అధిష్టానం రామరాజు, రామ్మోహననాయుడుతో మాట్లాడి ఇరువురి నుంచి సమస్య లేకుండా సద్దుమణిగేలా చేసింది. అయితే మాజీ ఎంఎల్‌ఎ బండారు మాధవనాయుడుని మాత్రం పిలిచి మాట్లాడలేదని తెలిసింది. దీంతో ఎన్నికల బరిలో ఉండేందుకు మాధవనాయుడు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానంటూ ఇటీవల మీడియా సమావేశంలో మాధవనాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. మాధవనాయుడు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుందోననే చర్చతోపాటు టిక్కెట్‌ రాకపోవడంతో అలకబూనిన కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనకు మద్దతుగా నిలుస్తారా, రెబల్‌గా మారి వ్యతిరేకంగా పని చేస్తారా అనేది తేలాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో చివరి నిముషంలో వైసిపిలో చేరిన కొత్తపల్లి అప్పటి జనసేన అభ్యర్థి నాయకర్‌కు నష్టం చేకూర్చారనే చర్చ అప్పట్లో సాగింది. ఈసారి ఏం జరుగుతుందో వేచిచూడాలి.’ముద్దరబోయిన’ తిరుగుబాటు జెండా టిడిపి నుంచి నూజివీడు టిక్కెట్‌ ఆశించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టిడిపి అధిష్టానం ఝలక్‌ ఇచ్చింది. స్థానికేతరుడు, వైసిపి నుంచి వచ్చిన కొలుసు పార్థసారధికి టిక్కెట్‌ ఇచ్చింది. దీంతో ముద్దరబోయిన తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా భారీగా ఖర్చు పెట్టేందుకు సైతం ముద్దరబోయిన సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారనే సానుభూతి ముద్దరబోయినకు ఉంది. నూజివీడు బరిలో ఈయన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టిడిపికి నష్టం అత్యధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ వైసిపి ఓట్లను చీల్చే అవకాశం ఉందని లెక్క కడుతున్నారు. ఈయన ఎన్నికల బరిలో కడవరకూ నిలబడతారో, లేదో వేచి చూడాల్సి ఉంది.వైసిపి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కాంగ్రెస్‌ నుంచి పోటీ వైసిపి చింతలపూడి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా మరోసారి టిక్కెట్‌ ఆశించినా దక్కలేదు. దీంతో ఆయన వైసిపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. చింతలపూడి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంఎల్‌ఎగా ఉన్న ఆయన తనకంటూ సొంత బలగాన్ని తయారు చేసుకున్నారు. దీంతో వైసిపికి ఇబ్బందికరమేననే ప్రచారం సాగుతోంది. ఆయా స్థానాల్లో ఏం జరుగుతుందో ఎన్నికల బరిలో చూడాల్సి ఉంది.

➡️