సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె

కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె
ప్రజాశక్తి – భీమవరం రూరల్‌
మున్సిపల్‌ కార్మికుల సమస్యలు సామరస్యంగా పరిష్కరించకుండా ప్రభుత్వం బెదిరింపు చర్యలకు దిగడం సిగ్గు చేటని సిఐటియు, ఎఐటియుసి, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆదివారం సర్వమతాల ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు, ఎఐటియుసి పట్టణ కమిటీ నాయకులు సిహెచ్‌.రంగరావు, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు నాని మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయటం తగదన్నారు. కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేలాపు శ్రీను, ఎన్‌.విశ్వనాథం, బంగారు కామాక్షి, నేలాపు ధనలక్ష్మి, ఆశీర్వాదం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.నరసాపురం టౌన్‌ : నరసాపురంలో మున్పిపల్‌ కార్మికుల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు నెక్కంటి సుబ్బారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్స్‌ వెంటనే పరిష్కరించాలని, చర్చలు సామరస్యంగా జరపాలని, మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి పట్టణ నాయకులు నెక్కంటి క్రాంతికుమార్‌, ఆరేటి మృత్యుంజయరావు, సానాబోయిన ఫణిరాజు, ఎఐటియుసి కార్మికులు రత్తయ్య, గుమ్మడి శ్రీను, అమరావతి, బాబి, సుజాత పాల్గొన్నారు.

➡️