సవాళ్లు..ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన మండల సమావేశం

Dec 2,2023 18:39

ప్రజాశక్తి – వీరవాసరం
సవాళ్లు…ప్రతి సవాళ్లతో వీరవాసరం మండల పరిషత్‌ సమావేశం దద్దరిల్లింది. ఎంపిపి వీరవల్లి దుర్గాభవాణి అధ్యక్షతన ఎంపిడిఒ జ్యోతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మండల పరిషత్‌ సమావేశంలో నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో టిడిపి ఎంపిటిసి కొల్లేపర శ్రీనివాసరావు, ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబుల మధ్య తీవ్ర వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో వైసిపి నాయకులు ఓట్లు అడగవచ్చా అంటూ ఎంపిటిసి శ్రీనివాసరావు ఎంపిడిఒను సమాధానం చెప్పాలని కోరారు. దీనికి వైసిపి సర్పంచి ఓంకారం అడ్డు తగటడంతో గొడవ మొదలై ఒక్కసారిగా ఘర్షణ వైఖరి చోటు చేసుకుంది. పరిస్థితి చేదాటిపోతుందనుకున్న సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేయడం, టిడిపి ఎంపిటిసి శ్రీనివాసరావును తోటి సభ్యులు బయటకు తీసుకుపోవడంతో గొడవ సర్దుమనిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన ఎఎంసి ఛైర్మన్‌ పట్ల టిడిపి ఎంపిటిసి కించపరిచే విధంగా మాట్లాడడం తప్పంటూ క్షమాపన చెప్పాలంటూ వైసిపి సభ్యులు పట్టు పడటంతో సమావేశం ముందుకుసాగే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో ఎంపిపి వీరవల్లి దుర్గభవాణి కలుగజేసుకుని సమావేశంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నానని, సమావేశానికి సహకరించాలని కోరడంతో వాదులాటకు తెర పడింది. ఆ తరువాత సమావేశంలో శాఖల వారీ సమీక్ష నిర్వహించారు. దాళ్వా సాగుకు సాగునీటి కొరత ఉండదంటూ ఇరిగేషన్‌ ఎఇ సమావేశంలో ప్రకటించారు. మార్చిలోగా పంట కాలం పూర్తయ్యేట్టు సాగుకు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ధాన్యం కొనుగోలు పక్రియ మరింత సరళతరం చేయాలని, ఎండ్ల బళ్లను ఆన్‌లైన్‌ చేయించుకుంటేనే రవాణకు అనుమతి నిబంధనలు తొలగించాలని టిడిపి, జనసేన ఎంపిటిసిలు వ్యవసాయాధికారిణి బిన్సిబాబు, సివిల్‌ సఫ్లై ఆర్‌ఐ సురేష్‌ దృష్టికి తీసుకొచ్చారు. బిఎల్‌ఒలు ఓటర్ల జాబితా పరిశీలన సక్రమంగా నిర్వహించడంలేదంటూ ఎంపిటిసి సభ్యులు శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని తహాశీల్దార్‌ సుందరరాజు తెలిపారు. ఈ సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు గుండా జయప్రకాష్‌నాయుడు, ఎంపిటిసి సభ్యులు గుళ్లిపల్లి విజయలక్ష్మి, ఇందిర, వెంకటలక్ష్మి, విజయకుమారి, అడ్డాల రాము, బొల్లెంపలి శ్రీనివాస్‌చౌదరి, సర్పంచులు గెడ్డం భారతి, పరమేశ్వరావు, లీలాకృష్ణ పాల్గొన్నారు.రూ.55.5 లక్షల అభివృద్ధి పనులకు తీర్మానంవీరవాసరం మండలంలో వివిధ గ్రామాల్లో రూ.55.5 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మండల పరిషత్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. వీటితో పాటు వడ్డిగూడెం, అండలూరు గ్రామాలకు కూడా నిధులు కేటాయిస్తూ అనుంబంధ ఎజెండాను సమావేశంలో ఆమోదించారు. వీరవాసరం, మత్స్యపురి, కొణితివాడ గ్రామాలకు సంబంధించి గతంలో కేటాయించిన పనులకు పంచాయతీల నుంచి తీర్మానం లభించకపోవడంతో ఈ దఫా నిధులు కేటాయించలేని పరిస్థితి ఉందని ఎంపిపి తెలిపారు.

➡️