సూర్యనారాయణమూర్తి సేవలు చిరస్మరణీయం

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
పత్రికా రంగానికి, సమాజానికి యద్దనపూడి సూర్యనారాయణమూర్తి చేసిన బహుముఖ సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు యద్దనపూడి సూర్యనారాయణమూర్తి స్మారక ఉత్తమ జర్నలిస్ట్‌ పురస్కార ప్రదాన కార్యక్రమం తాడేపల్లిగూడెం జర్నలిస్ట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెస్‌క్లబ్‌, ఎపియుడబ్ల్యూజె జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధాల వెంకటరామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు, గరికపాటి బాపయ్యశర్మ, ఐజెయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్‌ మాట్లాడారు. యద్దనపూడి సూర్యనారాయణ మూర్తి స్మారక ఉత్తమ జర్నలిస్ట్‌ పురస్కారాన్ని 2023 సంవత్సరానికి న్యూస్‌టుడే బుట్టాయగూడెం విలేకరి మామిడిశెట్టి శ్రీరాంప్రసాద్‌కు అతిథులు బుద్ధాల వెంకటరామారావు, చింతకాయల బాబూరావు అందించారు. అవార్డు కింద రూ.5116 నగదు పారితోషికం, జ్ఞాపిక, నూతన వస్త్రాలు, శాలువా, పూలమాలలతో సత్కరించారు. యద్దనపూడి పేరిట సీనియర్‌ పాత్రికేయుల గౌరవ సత్కార కార్యక్రమంలో భాగంగా రత్నగర్భ సంపాదకుడు పివిఎ.ప్రసాద్‌ (ఏలూరు), ఆంధ్రజ్యోతి విలేకరి వి.నాగేశ్వరలింగమూర్తి (భీమవరం), విశాలాంధ్ర విలేకరి ఐతా సురేష్‌ (కుక్కునూరు)కు జ్ఞాపిక, శాలువా, నూతన వస్త్రాలు, పూలమాలలతో సన్మానించారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, బుట్టాయగూడెం, వీరవాసరం, ప్రెస్‌క్లబ్‌ల తరపున కూడా అవార్డు గ్రహీతలను, గౌరవ సత్కార గ్రహీతలను సన్మానించారు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన అలేఖ్యకు యద్దనపూడి కుమార్తె వైఎన్‌విఆర్‌.పద్మావతి తమ తల్లితండ్రుల జ్ఞాపకార్థం రూ.5116 నగదు పారితోషికం అందించి జ్ఞాపిక, నూతన వస్త్రాలతో సత్కరించారు. తొలుత యద్దనపూడి విగ్రహానికి బుద్ధాల వెంకటరామారావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎపియుడబ్ల్యూజె రాష్ట్ర నాయకుడు జివిఎస్‌ఎన్‌.రాజు, జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్‌, జిల్లా కోశాధికారి ముత్యాల శ్రీనివాస్‌, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు తమ్మిసెట్టి రంగసురేష్‌, కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు, భీమవరం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు కడలి వరప్రసాద్‌, యద్దనపూడి సుబ్బారావు కుటుంబ సభ్యులు, ఐజెయు జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్‌, మున్సిపల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు పి.పాపారావు, జిఎస్‌.శర్మ పాల్గొన్నారు.

➡️