అన్నమో.. రామచంద్రా..!

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 213 పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి పంపిణీ చేసేందుకు ఏలూరు కోటదిబ్బపై ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సామగ్రి తీసుకునేందుకు సుమారు 1500 మంది సిబ్బంది వివిధ ప్రాంతాల నుంచి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌కు ఆదివారం ఉదయం ఏడు గంటలకే చేరుకున్నారు. అయితే ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సిబ్బందికి ఈసారి చేదు అనుభవం ఎదురైంది. సగం మంది అల్పాహారం తినేటప్పటికి అందరికీ అందకుండానే అయిపోవడంతో గత్యంతరం లేక కొంతమంది బయటకు వెళ్లి తిన్నారు. ఇక మధ్యాహ్నం భోజనం పరిస్థితి అయితే మరీ అధ్వానం. మధ్యాహ్నం 12:30కే కూరలు అయిపోవడంతో కొంతమంది కేవలం సాంబారు, పెరుగుతో మాత్రమే భోజనం పూర్తి చేశారు. మరో 20 నిమిషాల్లో సాంబారు, పెరుగు కూడా అయిపోవడంతో ప్లేట్లలో అన్నం వడ్డించుకుని కూరలు వస్తాయని ఎదురు చూశారు. మధ్యాహ్నం భోజనానికి రెండు కౌంటర్లు ఏర్పాటు చేయగా ఒక కౌంటర్లో సాంబారు, పెరుగు ఉన్నాయని తెలియడంతో మొదటి కౌంటర్లో అన్నం వడ్డించుకుని రెండో కౌంటర్‌ వైపు సిబ్బంది పరుగులు తీశారు. ఐదు నిమిషాల్లో అక్కడ కూడా సాంబారు అయిపోవడంతో కొద్దిమంది పెరుగుతోనే భోజనం పూర్తి చేశారు. మరో రెండు నిమిషాల్లో పెరుగు కూడా అయిపోవడంతో అన్నం వడ్డించుకున్న ప్లేట్లతో చాలామంది చాలాసేపు ఎదురు చూశారు. మరి కొంతమంది అసంతృప్తితో అన్నంతో నిండిన ప్లేట్లను కిందపడేసి వెనుదిరిగారు. తామంతా ప్రభుత్వ ఉద్యోగులమని, గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నామని, తమకు భోజనం కూడా పెట్టకుండా ఇలా అవమానించడం సరికాదని విచారం వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలాగే అన్నం ప్లేట్లు పట్టుకుని కొంతమంది ఎదురు చూశారు. కొద్దిసేపటికి అన్నంలో కలుపుకునేందుకు ఎలాంటి గ్రేవీ లేని మీల్‌మేకర్‌ కూర తీసుకువచ్చి వడ్డించడంతో అలాగే భోజనం పూర్తి చేసి విధులకు వెళ్లిపోయారు. శిక్షణ తరగతుల్లోనూ ఇలాగే జరిగిందని, సరైన భోజనం పెట్టలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందితోపాటు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో ఉన్న సిబ్బంది పోలీసులు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం రెండు వేల మంది వరకు ఉండగా భోజనం ఏర్పాట్లు ఎందుకు చేయలేకపోయారో అర్థం కాని ప్రశ్నగా మారింది. భోజనం ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌ మాత్రం తమకు తక్కువ సంఖ్య చెప్పారని, ఇప్పుడు ఎక్కువమంది వచ్చి భోజనం చేశారని, అందుకే కూరలు సరిపోలేదని చెబుతున్నారు. భోజనాల దగ్గర ఇంత గందరగోళం జరుగుతున్నా రిటర్నింగ్‌ ఆఫీసర్‌గాని, ఇతర అధికారులుగాని అటువైపు రాకపోవడం గమనార్హం. అయితే తొలుత సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం భోజనాలు ప్రారంభంలో వడ్డించడంతోపాటు భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఆయన చివర వరకూ ఉన్నా.. మధ్యలో వచ్చినా అధికారుల వైఫల్యం ఏమిటో తెలిసేదని పోలింగ్‌ సిబ్బంది వ్యాఖ్యానించడం విశేషం.

➡️