ముందస్తు సాగు సాగేనా..!

ఖరీఫ్‌లో ముందస్తు సాగుపై ప్రతియేటా ప్రకటనలు గుప్పించడం.. షరా మాములు అన్నట్లుగా నారుమడులు ఆలస్యంగా వేయడం, దీంతో ప్రతియేటా రబీసాగుపై తీవ్ర ప్రభావం చూపడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి ముందస్తు సాగుకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులకు అవగాహన కల్పించి అధికారులు ప్రణాళికలు అమలు చేస్తారా అనే చర్చ నడుస్తోంది

.ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఖరీఫ్‌లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టనున్నారు. జూన్‌ ఒకటో తేదీన పంట కాలువలకు సాగునీరు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాలుసైతం జూన్‌ మొదటి వారంలోనే రాష్ట్ర్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఈ నెల 24వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈసారి ముందస్తు సాగుకు వాతావరణం అనుకూలంగా ఉన్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రతియేటా జూన్‌ ఒకటో తేదీన కాలువలకు నీరు విడుదల చేస్తున్నప్పటికీ నారుమడులు మాత్రం సకాలంలో పడటం లేదు. జులై మొదటి వారం వరకూ నారుమడులు వేయని పరిస్థితి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో రైతులు ముందుకు రావడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ఈసారి వాతావరణ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రైతులకు ఇప్పటి నుంచే ముందస్తు సాగుపై అవగాహన కల్పిస్తే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అధికారులు ఏవిధంగా ముందుకు సాగుతారో వేచిచూడాలి. ఖరీఫ్‌ సాగు ఆలస్యం కావడంతో ప్రతియేటా రబీలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీటి సమస్యతోపాటు అకాల వర్షాల బారిన పడి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం మే రెండో వారంలోనూ రబీ మాసూళ్లు సాగాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. గతేడాది మాత్రం రబీలో కురిసిన వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఖరీఫ్‌లో గాలులకు నేలకొరగని విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. రెండు జిల్లాల్లోనూ ఖరీఫ్‌లో అత్యధికంగా సంపత్‌ స్వర్ణ విత్తనాన్ని రైతులు వినియోగిస్తున్నారు. ఇంకా మెరుగైన విత్తనాలు ఉంటే రైతులకు అధికారులు సూచిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు కిలోకు రూ.ఐదు సబ్సిడీతో విత్తనాలు, ఖరీఫ్‌కు కావాల్సిన ఎరువులన్నీ సిద్ధం చేసినట్లు లెక్కలు వివరిస్తున్నారు. జూన్‌ రెండో వారంలోనే నారుమడులు వేసేలా రైతులకు అవగాహన కల్పిస్తేనే ఖరీఫ్‌ సాగు గాడినపడే అవకాశం ఉంటుంది. అలాకాకుండా జూన్‌ నెలాఖరు వరకూ నారుమడులు వేయకపోతే పరిస్థితి ప్రతియేటా మాదిరిగానే తయారవుతుంది. వాతావరణం అనుకూలంగా ఉన్న ఈ పరిస్థితుల్లో అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తేనే ముందస్తు సాగు ప్రణాళికలు ఫలించే అవకాశం ఉంటుంది. అధికారులు ఏవిధంగా ముందుకు సాగుతారో వేచిచూడాలి.

➡️