ఫించన్ సొమ్ము వైసిపి నేతల పంపిణీ

Mar 4,2024 15:30 #West Godavari District
Finchan money distributed by YCP leaders

 కలెక్టర్ కు ఎమ్మెల్యే నిమ్మల ఫిర్యాదు
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గంలో మార్చి నెల 1, 2 తేదీల్లో పంపిణీ చేయాల్సిన పెన్షన్ సొమ్మును అక్రమంగా వైసిపి నాయకులు పంపిణీ చేశారని ఎమ్మెల్యేఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అది కూడా ఇంటింటికి వెళ్లి వాలంటీర్ పంపిణీ చేయాల్సిన సొమ్మును పార్టీ ఆఫీసుల వద్ద, సత్రాల వద్దకు పిలిచి వైసిపి నాయకులు పంపిణీ చేశారని ఆరోపించారు. నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల గోపి ఇచ్చారంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ ప్రచారం చేశారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే నిమ్మల టిడిపి, జనసేన నాయకులతో కలిసి భీమవరం కలెక్టరేట్ కి వెళ్లి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సునీల్ కుమార్ కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం పాలకొల్లు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పెన్షన్ సొమ్మును వైసిపి నాయకుల చేతుల్లో పెట్టిన మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెన్షన్ సొమ్ము పార్టీ నాయకులకు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టడం తీవ్రమైన నేరం అని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పెన్షన్ సొమ్మును వైసీపీ ఇంచార్జ్ గుడాల గోపి ఇస్తున్నట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని చెప్పడం కమిషనర్, ఎంపీడీవోల ఉద్యోగ విధులు దుర్వినియోగం చేయడమే అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్లకు వెళ్లి ఇవ్వాల్సిన పెన్షన్లను పార్టీ ఆఫీసుల వద్ద, సత్రాల వద్ద ఎలా పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వ పెన్షన్ సొమ్ము కోట్ల రూపాయలు పక్కదోవ పడితే బాధ్యులు ఎవరని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

➡️