ఓటు వేసేయండిలా..

ప్రజాశక్తి – ఉంగుటూరు

ఈ నెల 13న మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే ముఖ్య ఎన్నికలు ఇవి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఎన్నికలు కాబట్టే అన్ని రాజకీయ పార్టీలూ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ కూడా అన్ని చర్యలు తీసుకుంది. ప్రతి ఓటరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలి. అంతటి ప్రాముఖ్యత కలిగిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసే విధానం గురించి తెలుసుకుందాం.పోలింగ్‌ కేంద్రాన్ని ఎలా కనుగొనాలి? గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రం కనుక్కోవడం సులభమే. పట్టణాలు, నగరాల్లో అనేక పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు కొంత అయోమయానికి గురవుతారు. తమ పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాంటి వారు పోలింగ్‌ స్టేషన్‌ను కనుక్కోవడానికి మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ప్లే స్టోర్‌ నుండి ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ‘సఅశీష yశీబతీ జూశీశ్రీఱఅస్త్ర ర్‌a్‌ఱశీఅ’ విభాగంలో ఓటరు వివరాలను పొందుపరిస్తే పోలింగ్‌ స్టేషన్‌ వివరాలు వస్తాయి. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా పోలింగ్‌ కేంద్రాన్ని కూడా కనుగొనవచ్చు. ఓటరు గుర్తింపు కార్డుపై ఇచ్చిన ఎపిక్‌ నెంబర్‌ ద్వారా, మొబైల్‌ నంబర్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాన్ని గుర్తించొచ్చు. ఓటింగ్‌కు ముందు బిఎల్‌ఒ ఇచ్చిన ఓటర్‌ స్లిప్‌లో కూడా పోలింగ్‌ కేంద్రం, బూత్‌ నంబర్‌ సహా పూర్తి సమాచారం ఉంటుంది. ఓటర్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1950కి కాల్‌ చేసి కూడా ఓటరు తన సమాచారాన్ని అడగొచ్చు. ఓటయేడానికి ఏమేం తీసుకెళ్లాలి? పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లే ముందు ఓటరు తన ఓటర్‌ ఐడి లేదా ఇతర ఫొటో గుర్తింపు కార్డులు, ఓటర్‌ స్లిప్పులను తీసుకెళ్లాలి. ఓటర్‌ ఐడి కార్డు లేకున్నా ఓటెయ్యొచ్చు. ఓటర్‌ స్లిప్‌ అనేది ఎన్నికల అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు. ఒకవేళ ఓటర్‌ స్లిప్‌ ఇవ్వకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోలింగ్‌ బూత్‌ వద్ద లేదా రాజకీయ పార్టీల ఏజెంట్ల వద్ద కూడా పొందవచ్చు.పోలింగ్‌ స్టేషన్‌లో ఓటింగ్‌ ప్రక్రియ ఎలా? మీరు పోలింగ్‌ బూత్‌లోకి అడుగు పెట్టగానే మొదటి అధికారి ఓటరు జాబితాలో మీ గుర్తింపు కార్డులోని పేరుతో పరిశీలిస్తారు. ఓటరు జాబితాలో మీ పేరుందో, లేదో చెక్‌ చేసి, మీ ఐడి కార్డును తనిఖీ చేస్తారు. పోలింగ్‌ ఏజెంట్‌ కూడా జాబితాలో పేర్లు సరిచూసుకుంటారు. రెండో అధికారి మీ వేలికి సిరా వేస్తారు. ఆ తర్వాత పార్లమెంట్‌, అసెంబ్లీకి రెండు చీటీలు ఇస్తారు. అలాగే రిజిస్టర్‌లో మీతో సంతకం చేయిస్తారు. మూడో అధికారి ఆ చీటీని చెక్‌ చేసి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషిన్‌ (ఇవిఎం) కంపార్టుమెంట్‌ దగ్గరకు పంపిస్తారు. ముందుగా మీరు పార్లమెంట్‌ అభ్యర్థికి ఓటు వేయాలి. ఆ తరువాత ఎంఎల్‌ఎ అభ్యర్థికి వేరే కంపార్టుమెంట్‌లో ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రిసైడింగ్‌ అధికారి/పోలింగ్‌ అధికారి ఇవిఎం మిషన్‌ బటన్‌ నొక్కిన తరువాత ఇవిఎంలో మిమ్మల్ని ఓటు వేసేందుకు అనుమతిస్తారు. మీరు ఇవిఎం యంత్రంపై ఉన్న అభ్యర్థుల పేర్లు, పార్టీ పేరు, ఆయనకు సంబంధించిన గుర్తు సరిగా గుర్తించి మీకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఉన్న బ్లూ బటన్‌పై నొక్కాలి.అప్పుడు దాని పక్కనే ఉన్న రెడ్‌ సిగల్‌ వెలగడంతో పాటు పెద్దగా బీప్‌ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మీ ఓటు నమోదైనట్లు లెక్క. మీ ఓటు ఎవరికి పడిందో తెలుసుకోవడానికి ఇవిఎం పక్కనే ఉన్న ఓటర్‌ వెరిఫియేబుల్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిప్యాట్‌)లో ఏడు సెకన్లపాటు చూడొచ్చు. ఒకవేళ వివిప్యాట్‌లో బ్యాలెట్‌ స్లిప్‌ కన్పించకపోయినా.. బీప్‌ సౌండ్‌ రాకపోయినా.. మీరు వెంటనే ప్రిసైడింగ్‌ అధికారిని సంప్రదించాలి.

➡️