30 నుంచి జాతీయస్థాయి నాటక పోటీలు

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

ఈ నెల 30, 31, జూన్‌ 1, 2 తేదీల్లో భీమవరంలోని డిఎన్‌ఆర్‌ కళాశాల క్రీడా మైదానంలో ‘చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్‌ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్‌ తెలిపారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 30న డిఎన్‌ఆర్‌ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు, మాజీ ఎంఎల్‌ఎ అల్లు సత్యనారాయణ, పంతం వేణుగోపాలకృష్ణ నెహ్రు జాతీయ స్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. 30న సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటులు, నాటక రచయిత డాక్టర్‌ పురాణం వెంకటరామ్‌ కుమార్‌కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటులు దర్శకులు జనాబ్‌ ఎస్‌ఎం భాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం, జూన్‌ 2న అజో విభో కందాళం ఫౌండేషన్‌ అప్‌ అమెరికా వ్యవస్థాపకులు అప్పాజ్యోసుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటీమణి ఎం.రత్నకుమారికి పెనుపోతుల శేషగిరిరావు హార్థిక చైతన్య పురస్కారం అందిస్తున్నామని తెలిపారు. జూన్‌ 2న జరిగే కార్యక్రమానికి సినీ హాస్యనటులు సూరంపూడి సుదర్శనరావు, దర్శకులు రాజా వన్నెంరెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.4 రోజులు.. 9 నాటికలు..నాలుగు రోజులపాటు తొమ్మిది నాటికలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 30న గోవాడ క్రియేషన్స్‌ హైదరాబాద్‌ వారి ‘మూల్యం’, 31న కళాంజలి హైదరాబాద్‌ వారి ‘రైతే రాజు’, అరవింద ఆర్ట్స్‌ తాడేపల్లి వారి ‘మనస్విని’, ఉషోదయ కళానికేతన్‌ వారి ‘విముక్తి’, జూన్‌ 1న అభినయ ఆర్ట్స్‌ గుంటూరు వారి ‘ఇంద్ర ప్రస్థం’, తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి ‘నిశ్శబ్ధమా ! నీ ఖరీదెంత’, శ్రీసాయి ఆర్ట్స్‌ కొలకలూరు వారి ‘కౌసల్యా సుప్రజ రామా’, 2న చైతన్య కళాభారతి కరీంనగర్‌ వారి ‘స్వప్నం రాల్చిన అమృతం’, విటిపిఎస్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఇబ్రహీంపట్నం వారి ‘ఎనిమి’ నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ జాతీయస్థాయి నాటక పోటీలను అందరూ తిలకించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాయప్రోలు శ్రీనివాసమూర్తి, పిఆర్‌ఒ భట్టిప్రోలు శ్రీనివాసరావు, కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీను, పేరిచర్ల లక్ష్మణ వర్మ, కనగర్ల రామకృష్ణ, ఆర్టిస్ట్‌ జ్యోతిరాజ్‌, కాగిత వెంకట రమణ, ముచ్చకరచల హేమసుందర్‌, యు.అప్పారావు, ఎండి భాషా ,అంగర చిన వీరాస్వామి పాల్గొన్నారు.

➡️