ఆరోగ్యశ్రీకి సుస్తీ..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

పేదవాడి ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రయివేటు ఆసుత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండు జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 60కుపైగా సర్జీలు జరుగుతుంటాయి. ఒక్కసారిగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో రోగులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కొన్ని ఆసుపత్రుల్లో కొనసాగుతున్నట్లు చెబుతున్న మాటలు బూటకంగా మారాయి. ఏలూరు జిల్లాలో అతిపెద్ద మెడికల్‌ ఆసుపత్రి ‘ఆశ్రం’లో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడంతో రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ ఆగకుండా చూడాలని జనం కోరుతున్నారు.సామాన్యుడికి అందనంత ఎత్తుకు వైద్యం, విద్య ఖర్చులు పెరిగిపోయాయి. ఆరోగ్యశ్రీ లేకపోతే సామాన్యులు వైద్యం చేయించుకోలేని పరిస్థితి నెలకొనగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేకుండా పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడింది. నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రమూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. వైద్యం విషయంలో సామాన్యులకు ఎంతో కొంత ఆసరాగా ఆరోగ్యశ్రీ సేవలు నిలుస్తున్నాయి. గుండె ఆపరేషన్లు, కిడ్నీలకు డయాలసిస్‌, ఎముకలు సర్జీలు, కేన్సన్‌ రోగులకు కీమోథెరఫీ వంటి సేవలు ఆరోగ్యశ్రీలో కీలకంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రయివేటు ఆసుపత్రులు సేవలు నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. పేదల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జనాల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అతిపెద్ద ఆసుపత్రి, మెడికల్‌ కాలేజీ ‘ఆశ్రం’లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది. దీంతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలో 31, పశ్చిమలో 29 మొత్తం 60 ప్రయివేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. ప్రతిరోజూ తక్కువగా లెక్కించిన రెండు జిల్లాలో 60కుపైగా ముఖ్యమైన సర్జీలు జరుగుతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. డయాలసిస్‌, గుండె ఆపరేషన్లు, రోడ్డు ప్రమాద కేసుల్లో ఎముకల సర్జీలు, కేన్సర్‌ రోగులకు సంబంధించి కీమోథెరఫీ వంటి అనేకం జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.1500 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి రెండు జిల్లాల్లోనూ రూ.70 కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క ఆశ్రం ఆసుపత్రికే రూ.15 కోట్ల వరకూ ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఆసుపత్రికీ తక్కువగా లెక్కించినా రూ. 50 లక్షలకుపైగానే ఆరోగ్యశ్రీ సొమ్ములు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో ప్రయివేటు ఆసుపత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ చేసిన పరిస్థితి నెలకొంది. అధికారులు ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడినట్లు కొన్ని ఆసుపత్రులు ముందుకు సాగించేందుకు ఒప్పుకున్నట్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా ఉందని తెలుస్తోంది. దీంతో అత్యవసర కేసులకు సంబంధించి రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రూ.వేలు, లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించుకోలేక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాన సర్జీలకు సంబంధించిన సేవలు అక్కడ లేకుండా పోయాయి. దీంతో ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లకు, ఆస్మదీయులకు రూ.వేల కోట్లు కట్టబెడుతున్న పాలకులు పేదల కోసం ఖర్చుచేసే ఆరోగ్యశ్రీ బకాయిలు మాత్రం చెల్లింకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే పరిస్థితి కొనసాగితే పేదల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి రానుంది. ప్రభుత్వం వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

➡️