ఈవీఎంల ధ్వంసంలో వైఫల్యం ఎవరిది?

May 22,2024 23:20

పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను నేలకేసి కొడుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు వద్ద పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం వ్యవహారంపై వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చి ఈవీఎంను, వివిప్యాట్‌ను ధ్వంసం చేసినా పోలింగ్‌ అధికారులు ఫిర్యాదు నమోదు చేయలేదు. గుర్తు తెలియని వ్యక్తులని మాత్రమే రాశారని, ఎన్నికల అధికారులు కూడా నివేదికను యథాతథంగా ఈసీకి పంపారని తెలిసింది. ఈనెల 15న పోలీసులకు పోలింగ్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ఇటీవల సిట్‌ అధికారుల దర్యాప్తు తరువాత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈనెల 20న రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. కేసులో పిన్నెల్లి రామకృష్నారెడ్డిని ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో మొత్తం ఏడు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు అధికారులు రికార్డులు నమోదు చేశారు. మిగతాచోట్ల నిందితులను అరెస్టు చేయడం, వారిపై కేసులు నమోదు చేయడంలో చురుకైనపాత్ర పోషించిన అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదులో వత్తిళ్లకు తలొగ్గి జాప్యం చేశారని తెలిసింది. సిట్‌ అధికారులు విచారణ తర్వాత కేసు నమోదు చేసిన రెంటచింతల పోలీసులు 10 సెక్షన్ల కింద పిన్నెల్లిని ప్రధాన నిందితుడుగా పేర్కొన్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో పూర్తిస్తాయిలో వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు చెప్పిన అధికారులు పిన్నెల్లిపై కేసు నమోదు చేయడానికి ఎందుకు కాలయాపన చేశారనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈవీఎం ధ్వంసం చేయడం అంటే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా వ్యాఖ్యానించడం ద్వారా త్వరలో బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని తెలుస్తోంది. పోలింగ్‌ కేంద్రంలో గొడవ జరగడం, ఈవీఎం ధ్వంసం, పోలింగ్‌ అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లి రాగానే లేచినిలబడి నమస్కారం చేయడం నిబంధనలకు విరుద్ధంగా జరిగినా జిల్లా అధికారులు కూడా వీటిపై తక్షణ చర్యలు తీసుకోలేకపోయారు. ధ్వంసమైన ఈవీఎం స్థానంలో మరొక ఈవీఎం అమర్చే సందర్భంలో అయినా రిటర్నింగ్‌ అధికారి సిసి పుటేజిలను, వెబ్‌కాస్ట్‌ వీడియోను పరిశీలించి తక్షణం కేసులు నమోదు చేయాల్సి ఉన్నా ఆయనా వత్తిళ్లకు తలొగ్గి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని చెబుతున్నారు. ఈవీఎంల ధ్వంసం తరువాత పిన్నెల్లిని హౌస్‌ అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన తరువాత అయినా జరిగిన ఘటనలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను పంపడంలో ఎందుకు జాప్యమైంది. ఎవరి వత్తిడితో పల్నాడు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడంలో మిన్నకుండిపోయారనే అంశం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈవీఎంల ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆయన తెలంగాణలో ఉన్నారని తెలిసి పల్నాడు నుంచి పోలీసు అధికారులు వెళ్లారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో గాలిస్తున్నారు. పల్నాడు ఎస్‌పి మలికాగర్గ్‌ అధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో డిజిపి పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

➡️