పేదల భూములపై రోడ్లు వేస్తారా?

Apr 6,2024 21:38

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని డోకిశిల రెవెన్యూలో శనివారం అనుమతుల్లేకుండా గిరిజనులు భూములపై రహదారుల పనులు వేయడంతో గ్రామస్తులతో పాటు సిపిఎం నాయకులు పి.రాము ఆధ్వర్యంలో పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డోకిశీల రెవెన్యూలోని తేలునాయుడువలసకు చెందిన కొంతమంది పేదల భూములపై శనివారం యంత్రాలతో గుర్తు తెలియని వ్యక్తులు రహదారి పనులు ప్రారంభించారని, దీన్ని తాము ప్రతిఘటించి రహదారి పనులు ఏ శాఖ వారు నిర్వహిస్తున్నారు, అనుమతులు ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు, ఈ పనులు ఎవరు చేయిస్తున్నారు అన్న నిలదీసి అడగ్గా ఎటువంటి సమాధానం చెప్పలేదని అన్నారు. దీనికి బాధ్యులుగా వెలగవలస పంచాయతీకి చెందిన సన్నిబాబు అనే వ్యక్తి చేస్తున్నట్లు తెలిసింది. ఎవరికి ప్రయోజనం లేని ఈ రహదారులు అధికార పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు చేయడం శోచనీయమని, ఎన్నికల కోడ్‌ ఉండగా ప్రభుత్వ పనులు చేపట్టకూడదని తెలిసినా, ఇలాంటి పనులకు పూనుకోవడం బరితెగింపు చర్యగా భావించి, ఈ పనులను ఆపకుంటే జిల్లా కలెక్టర్‌, డిఆర్‌ఒకు ఈ విషయమై తాము ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు .

➡️