హ్యాట్రిక్‌ కొడతారా!

వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థులు హ్యాట్రిక్‌ సాధించడంపై అందరి దృష్టీ నిలిచింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రతిఘటన లేకుండా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో సారి కడప, రాజంపేట సిట్టింగ్‌ ఎంపీలు వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి కాంగ్రెస్‌ , టిడిపి, బిజెపి అభ్యర్థుల నుంచి సవాల్‌ ఎదురుకానుంది. కడప పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌. అవినాష్‌రెడ్డికి ప్రత్యర్థులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ కుమార్తె వైఎస్‌. షర్మిల కాంగ్రెస్‌, చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి టిడిపి తరుపున నిలువనున్నారు. వైఎస్‌ కుటుంబం నుంచే ఇద్దరు అభ్యర్థులు తలపడుతున్న నేపథ్యం ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్య అజెండాగా సాగుతున్న ఎన్నికల నేపథ్యంలో సానుభూతి రాజకీయం రంజుగా మారింది. పజాశక్తి – కడప ప్రతినిధి పిసిసి అధ్యక్షులు షర్మిల ఎన్నికల ప్రచారంలో అవినాష్‌రెడ్డిపై నేరుగా ఆరోపణలు గుప్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ఇలాంటి నాయకులను చట్టసభలకు పంపిస్తే సమాజం భవిష్యత్‌ ఎలా ఉంటాయో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. షర్మిలకు మద్దతుగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రచారం సాగిస్తున్నారు. 2014 నుంచి రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌కు జవజీవాలు కలిగించే నాయకత్వం లభించడంతో ఊపిరి పోసుకుంటోంది. ఓటింగ్‌ శాతం పెరుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఓటింగ్‌ పెరుగుదల ఏ పార్టీ ఖాతా నుంచి ఏమేరకు చీలుతాయనే అంశంపై అవినాష్‌రెడ్డి హ్యాట్రిక్‌ సాధించడం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. షర్మిల జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌ టికెట్ల కేటాయింపు అంశంలో ఆర్థిక, అంగ, అనుచర, ఓటింగ్‌ ఫాలోయింగ్‌ కలిగిన అభ్యర్థులను నిలపడంలోభాగంగా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బద్వేల్‌ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మను కాదని, ఇటీవలే పార్టీలో చేరిన ఎన్‌డి.విజయజ్యోతికి టికెట్‌ కేటాయించడం గమనార్హం.అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి బరిలో ఉన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డి బిజెపి టికెట్‌ దక్కించుకున్నారు. చేసేదేమీ లేకపోవడంతో చంద్రబాబు పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించారు. వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ చేపట్టిన బస్సుయాత్రల నేపథ్యంలో కడప పార్లమెంట్‌ బరిలో వైసిపి, కాంగ్రెస్‌ మధ్యే పోటీ నెలకొందనే వాతావరణం కనిపిస్తోంది. టిడిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఆశించిన పురోగతి కనిపించకపోవడం గమనార్హం. రాజంపేట పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గట్టి పోటీ ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుపున బిజెపి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బరిలో ఉన్నారు. మిథున్‌రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన పుంగనూరుతో సరితూగేలా పీలేరు ఉంది. సొంత నియోజకవర్గాల్లో ఆశించిన మెజార్టీ లభించే అవకాశం ఉంది.ఆర్థిక, అంగ, సామాజిక, అనుచర బలమూ ఉంది. రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రాజంపేటలో వైసిపి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అనుచరులు పెద్దఎత్తున టిడిపిలో చేరారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌.రమేష్‌కుమార్‌రెడ్డి వైసిపిలో చేరడం సమతూకం పాటించినట్లు అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసిపి అభ్యర్థి మిథున్‌రెడ్డి హ్యాట్రిక్‌ సాధించడం ప్రశ్నార్థకంగా మారింది. టిడిపి బిజెపితో కూటమి కట్టిన నేపథ్యంలో ముస్లిములు, క్రిస్టియన్లు వైసిపి వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఏదేమైనా కడప, రాజంపేట పార్లమెంట్‌ వైసిపి అభ్యర్థుల హ్యాట్రిక్‌ ఆశలు నెరవేరుతాయా, లేదో వేచి చూడాల్సిన అవసరం ఉందనడంలో సందేహం లేదు.

➡️