2024: ముందున్నది మహా సమరం

Dec 31,2023 06:47 #edite page

ఇజ్రాయిలీ వార్‌ మెషిన్‌ గాజాలో పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న కారు చీకట్లతో 2023 సంవత్సరం ముగుస్తోంది. దాదాపు మూడు నెలలుగా గాజాపై ఇజ్రాయెల్‌ సాగిస్తున్న క్రూరమైన దురాక్రమణపూరిత దాడులకు ఇంతవరకు (డిసెంబర్‌ 23 వరకు) 21,672 మంది మరణించారు, వీరిలో 8,000కి పైగా పిల్లలే ఉన్నారు.మరో 56,165 మంది గాయపడ్డారు బాంబు దాడుల్లో కుప్పకూలిన భవన శిథిలాల కింద సమాధి అయినవారు ఎంత మంది ఉంటారో చెప్పలేని స్థితి.

పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి అమెరికా పూర్తిగా మద్దతు ఇస్తున్నది, అక్టోబర్‌ 7న ఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌కు పెద్దయెత్తున ప్రాణాంతకమైన ఆయుధాలు, సామగ్రిని పంపింది. ఇప్పటికీ పంపిస్తున్నది. తక్షణమే కాల్పుల విరమణను కోరే ఏ తీర్మానాన్నీ ఐరాస భద్రతామండలిలో అమెరికా అనుమతించడం లేదు. తన వీటో పవర్‌ను ఉపయోగించి వాటిని అడ్డుకుంటున్నది. ఇజ్రాయెల్‌కు అమెరికా ప్రభుత్వం గట్టి మద్దతుగా నిలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ, భారత్‌ తీసుకున్న వైఖరే విడ్డూరంగా ఉన్నది. ఇజ్రాయెల్‌ చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించడం ద్వారా మోడీ ప్రభుత్వం ఆ దేశానికి అనుకూలంగా పూర్తిగా మొగ్గింది. ఆ మొగ్గు ఎంతవరకు వెళ్లిందంటే అక్టోబరులో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన తీర్మానానికి భారత్‌ మద్దతు నిరాకరించేంతదాకా వెళ్లింది. కాల్పుల విరమణకు పిలుపునిచ్చే తీర్మానం డిసెంబర్‌లో రెండవ సారి జనరల్‌ అసెంబ్లీ ముందుకు వచ్చినప్పుడు మాత్రం భారతదేశం అయిష్టంగానే దానికి అనుకూలంగా ఓటు వేసింది. అలా చేయకపోతే ఆసియాలో భారత్‌ ఒంటరిపాటు అయి ఉండేది. ఎందుకంటే ఆసియాలోని అన్ని దేశాలూ కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు వేశాయి.

2023 మోడీ ప్రభుత్వ రెండవ పర్యాయంలో చివరి సంవత్సరం అన్న విషయం తెలిసిందే. భారత ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజానికి ఊపిరాడని స్థితిలో మరో ఏడాది గడిచిపోయింది. పార్లమెంటును కొత్త భవనంలోకి మార్చడం దాని కొత్త అవమానకరమైన స్థితికి ప్రతీక. ఈ ఏడాది చివరి పార్లమెంటు సమావేశంలో ప్రతిపక్షాలకు చెందిన 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్‌ చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఎలా కుళ్లబొడుస్తున్నదో తెలియజేస్తున్నది.

భారత దేశ లౌకిక రాజ్య స్వభావాన్ని నాశనం చేసే ప్రక్రియ ఎంత వేగంగా సాగిపోతున్నదీ ఇది తెలియజేస్తున్నది. న్యాయవ్యవస్థ లోపాయికారీ సహకారంతో, కాశీ, మథురలోని అసలు మత ప్రదేశాలను సవాల్‌ చేసి, వాటిని తిరిగి తెరచి, పరిశీలించడం జరుగుతున్నది. . అయోధ్యలోని రామ మందిర ప్రారంభ కార్యక్రమాన్ని కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ప్రాయోజిత వేడుకగా నిర్వహించబోతున్నది.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో, మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరుల స్థాయికి దిగజార్చేందుకు, ఆవు లేదా గొడ్డు మాంసం రవాణా చేస్తున్నారనో మరొకటనో ఆరోపించి వారిపై మూక దాడులు చేసి కొట్టి చంపడం లాంటివి నిత్యకృత్యంగా మారిపోయాయి.. ముస్లింలపై గో గూండాల దాడులకు బుల్డోజర్‌ ఒక సంకేతంగా మారింది.

మే నెల నుండి మణిపూర్‌ అత్యంత ఘోరమైన జాతి ఘర్షణలను చూసింది. ఏడు నెలల తర్వాత కూడా, లోయ, కొండ ప్రాంతాల మధ్య బఫర్‌ జోన్‌లో భద్రతా బలగాలతో మెయితీ, కుకీల మధ్య జాతి విభజన కొనసాగుతూనే ఉంది. ఈ ఆస్తుల విధ్వంసానికి బిజెపి ముఖ్యమంత్రి పక్షపాత రాజకీయాలే కారణం గనుక ఆయనే దీనికి బాధ్యత వహించాలి. అన్ని సామాజిక తరగతులతో చర్చలు జరిపి దీనికి రాజకీయంగా పరిష్కారం చూపడంలో కేంద్రం విఫలమైంది. సున్నితమైన జాతుల ప్రాంతంలో మెజారిటీ రాజకీయాల వల్ల జరిగే విధ్వంసానికి మణిపూర్‌ నిలువెత్తు నిదర్శనం.

2023లో ఫెడరలిజం తీవ్ర దాడికి గురైంది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో మరింత దూకుడుగా జోక్యం చేసుకోవడం, చట్టాలు చేసే రాష్ట్ర శాసనసభ హక్కులను నిరాకరించడం వంటివి చేస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు, జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రాన్ని కూల్చివేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ను ఉపయోగించడంపై తీర్పు ఇవ్వడానికి న్యాయమూర్తులు నిరాకరించడం వంటి చర్యలు ఫెడరల్‌ సూత్రాల దారుణ ఉల్లంఘనకు న్యాయపరమైన చట్టబద్ధత ముద్ర వేశాయి.

జిడిపి వృద్ధి గణాంకాలను ఉటంకిస్తూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ అని మోదీ ప్రభుత్వం టామ్‌టామ్‌ వేసుకుంటోంది. కానీ, తలసరి జిడిపి పరంగా చూసేÊ భారత్‌ 2023లో 2600 డాలర్లతో జి20 దేశాలలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇంకా, ఏ వద్ధి రేటు నమోదు అయినా అది పెరిగిన ఉపాధి కిందికి మారలేదు. తాజా సిఎంఐఇ డేటా ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్‌లో నిరుద్యోగిత రేటు 10.05గా ఉంది, ఇది గడచిన 21 నెలల్లో అత్యధికం. అందులోనూ యువతలో నిరుద్యోగిత 23.22 శాతంగా ఉంది.

నిత్యావసర సరుకుల ధరలు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నాయి. వాస్తవ వేతనాలు క్షీణించడం, ఆకాశాన్నంటుతున్న ధరల, అంతులేని నిరుద్యోగంతో ప్రపంచ ఆకలి సూచీలో భారతదేశం యొక్క ర్యాంకింగ్‌ 125 దేశాలలో 111కి పడిపోయింది.

కార్పొరేట్‌-కమ్యూనల్‌ అపవిత్ర పొత్తు 2023లో కొట్టొచ్చినట్టు కనిపించింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కంపెనీ అదానీ గ్రూప్‌ కార్పొరేట్‌ మాసాన్ని, స్టాక్‌ మానిప్యులేషన్‌ను బయటపెట్టడంతో అది అంతర్జాతీయ వార్తగా మారింది. కానీ మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా గౌతమ్‌ అదానీకి రక్షణగా నిలిచింది. తనకు అత్యంత సన్నిహితుడైన ఆశ్రిత పెట్టుబడిదారునిపై తీవ్రమైన దర్యాప్తు జరపడానికి మొండిగా నిరాకరించింది. అదానీపై దాడిని భారతదేశంపై దాడిగా హిందూత్వ ప్రభుత్వం భావిస్తున్నది. మోదీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం పాటుపడుతున్నది. దీని ఫలితంగా ఆదాయ, సంపద అసమానతలు శిఖర స్థాయికి చేరాయి. జనవరి 2023లో విడుదల చేసిన ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం , సంపన్నులైన ఒక శాతం మంది దేశ సంపదలో 40 శాతానికి పైగా కలిగి ఉన్నారు, అయితే జనాభాలో సగం దాకా ఉన్న అట్టడుగు ప్రజానీకం కేవలం 3 శాతం మాత్రమే పంచుకున్నారు.

2023లో అణచివేత సాధనాలకు మరింత పదును పెట్టడం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను పెద్ద యెత్తున దుర్వినియోగపరచడం జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ల దాడులు, అరెస్టులు అధికార పార్టీ చేతుల్లో అస్త్రాలుగా మారాయి.

మొన్నటి పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగింపులో ప్రతిపక్షం లేకుండానే, మూడు కొత్త క్రిమినల్‌ చట్ట బిల్లులను ఆమోదించారు. దీంతో వలసవాద వారసత్వ అవశేషాలను తొలగించేసినట్లు చెప్పారు. నిజానికి ఇది వలసరాజ్యాన్ని పున్ణ ప్రతిష్టించే మరో రూపమే. కొత్త క్రిమినల్‌ చట్టాలలో పౌరుల ప్రాథమిక భద్రతలను తొలగించి, పోలీసు రాజ్యాన్ని రుద్దే అనేక నిబంధనలు ఉన్నాయి.

ఈ కార్పొరేట్‌ – మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాడుతున్నారు. కార్మిక, కర్షక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్‌ మోర్చా కలసి సెప్టెంబర్‌లో నిర్వహించిన ఉమ్మడి సదస్సు నవంబర్‌లో మూడు రోజుల మహా పడావ్‌ పిలుపునిచ్చాయి . ఈ ఉమ్మడి నిరసన చర్యకు ముందు దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ వర్గాల కార్మికులు రైతుల అనేక పోరాటాలు నిర్వహించారు. బిజెపి ప్రభుత్వ నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల వివిధ సెక్షన్ల కార్మిక, రైతు పోరాటాలు అనేకం జరిగాయి.

2023 చివరి సగంలో ప్రతిపక్ష పార్టీలు కలిసి 28 పార్టీలు కలసి ఇండియా వేదికగా ఏర్పడ్డాయి. 2024 ఏప్రిల్‌-మే నెల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడటమే ప్రతిపక్షాల కలయిక లక్ష్యం. ఇది రాజ్యాంగ మౌలిక లక్షణాలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం పరిరక్షణకు సాగించే పోరాటం. కొత్త సంవత్సరం 2024, భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే ఓ మహా సమరానికి సాక్షిగా నిలవనుంది.

(డిసెంబర్‌ 31, 2023)

➡️