2024 ఎన్నికలు బిజెపికి కష్టమే! 

Mar 29,2024 04:30 #artical, #editpage

పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల తొలి దశగా ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనున్న 102 నియోజకవర్గాలకు నామినేషన్‌ పత్రాల సమర్పణ పూర్తయింది. రెండో దశలో ఎన్నికలు జరగనున్న కేరళ సహా నియోజకవర్గాల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పరిస్థితులలో ఎన్నికల చిత్రపటాన్ని సమీక్షించినట్లయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ మూడోసారి గెలవడం కష్టమే. 400 పైగా సీట్లు గెలుస్తానని ప్రధాని మోడీ పదే పదే ప్రకటించడం కేవలం తన పార్టీ కార్యకర్తలను వెంట నిలుపుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కేనని రోజురోజుకూ స్పష్టమవుతోంది.
గత రెండు లోక్‌సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి ఎన్‌డియేకు అనేక ప్రతికూల అంశాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఎలక్టోరల్‌ బాండ్‌ స్కామ్‌. ఈ స్కామ్‌తో బిజెపి అవినీతి నిరోధక ముసుగు తొలగిపోయింది. తప్పుడు ఎత్తుగడల ద్వారా కార్పొరేట్లకు లాభాలు కూడబెట్టుకునే అవకాశాలు కల్పించింది. అందుకుగాను క్విడ్‌ ప్రో కో (నీకు ఇంత నాకు అంత) పద్ధతుల్లో కార్పొరేట్ల నుంచి బిజెపికి భారీగా ముడుపులు అందాయని ప్రజలకు అర్ధమైంది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత, ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎస్‌బిఐ విడుదల చేసింది. ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడానికి, ప్రతిపక్ష పార్టీలను చీల్చడానికి అవసరమైన ఎమ్మెల్యేలను కార్పొరేట్ల ద్వారా కొనుగోలు చేసిందనేది స్పష్టమైంది. ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. బిజెపి చేసిన ఈ మెగా స్కాం ఎన్నికల ప్రధాన అంశంగా మారింది.
దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను మద్యం అవినీతి కేసులో ఇ.డి అరెస్టు చేసి జైలుకు పంపింది. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ అరెస్ట్‌ జరిగింది. నిష్పక్షపాతంగా, పోలింగ్‌ నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం మౌనం వహించడం పెద్ద మిస్టరీగా మారింది. బిజెపి డబ్బు పుచ్చుకుందన్న విషయం ఎస్‌బిఐ పత్రాల ద్వారా తెలుస్తున్నది. కానీ కేజ్రీవాల్‌ డబ్బు తీసుకున్నారన్న దానికి ఇ.డి ఇంతవరకు ఆధారాలు ఇవ్వలేకపోయింది. అయితే మద్యం కుంభకోణం కేసు నిందితుడి నుంచి బిజెపి డబ్బులు తీసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అయినా నిందితులను, నిందితుల నుంచి డబ్బులు తీసుకున్న బిజెపి నాయకత్వాన్ని ప్రశ్నించడం లేదు, అరెస్టు చేయడం లేదు. కేజ్రీవాల్‌ మాత్రం జైల్లో ఉన్నారు. ఇక్కడ బిజెపి ద్వంద్వ నీతిని ప్రజలు గమనిస్తున్నారు. మార్చి 31న ఢిల్లీలోని రామ్‌ లీలా మైదాన్‌లో జరగనున్న ర్యాలీ…అవినీతిపరులను కాపాడుతూ, ప్రతిపక్షాలపై వేటు వేస్తున్న మోడీ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక వంటిది. అంతేగాక, మోడీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్న స్పష్టమైన సందేశాన్ని ఇవ్వనుంది. ‘ఇండియా’ వేదికకు చెందిన ప్రముఖులందరూ ఈ ర్యాలీలో పాల్గంటారు. గత రెండు లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీ నుంచి బిజెపి ఏడు స్థానాలను గెలుపొందిందిగాని, ఈ సారి ఆ పరిస్థితి లేదన్నది స్పష్టం.
గత రెండు లోక్‌సభ ఎన్నికలకు భిన్నమైన అంశం ఒకటి మన ముందుంది. ‘ఇండియా’ బ్లాక్‌ కొన్ని రాష్ట్రాలు మినహా దేశమంతటా బిజెపిని ఐక్యంగా ఎదుర్కొంటోంది. ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో సీట్ల ఒప్పందం కుదిరింది. బీహార్‌, మహారాష్ట్రలలో ఈ ఒప్పందాన్ని త్వరలో అమలు చేయనున్నారు. అంటే 300 పైగా స్థానాల్లో ‘ఇండియా’ బ్లాక్‌ బిజెపితో నేరుగా ఢకొీనే అవకాశం ఉంది. ఈ దెబ్బకు బిజెపి కంచుకోటలు బీటలు వారతాయనడంలో సందేహం లేదు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో బిజెపికి సీట్లు తగ్గవచ్చు. హర్యానా లోని జాట్‌ సామాజిక వర్గం బిజెపి కి వ్యతిరేకంగా మారి, ఆ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీకి మద్దతునివ్వడం, మద్దతు ధర కోరుతూ రైతులు చేస్తున్న సమ్మెకు వ్యతిరేక వైఖరి తీసుకోవడం, అగ్నివీర్‌ పథకాన్ని తీసుకురావాలనుకోవడం… వంటి కారణాల వల్ల వారు బిజెపి పట్ల ఆగ్రహంగా వున్నారు. దీన్ని చల్లార్చేందుకే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను మార్చారని, కానీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడ బిజెపి సగం సీట్లు మాత్రమే గెలుస్తుందని సమాచారం. బిజెపి కి కంచుకోట అయిన గుజరాత్‌లో కూడా తాము ఎన్నికలలో పోటీ చేయలేమంటూ అభ్యర్థులు వెనక్కి తగ్గడం మోడీ-షా నాయకత్వానికి పెద్దగా ఆశ్చర్యం కల్గించడంలేదు.
మహారాష్ట్రలో బిజెపి కి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని ప్రాథమిక అంచనా. ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ ఎన్‌సిపిలను చీల్చి అధికారాన్ని చేజిక్కించుకున్న మోడీ, షాల తీరును మహారాష్ట్ర ప్రజలు అంగీకరించడం లేదు. పార్టీలను చీల్చడమే కాకుండా ఎన్నికల గుర్తులను కూడా లాక్కున్నారనే భావన బలంగా ఉంది. అజిత్‌ పవార్‌ ఎన్‌సిపి, షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు మాత్రమే బిజెపితో ఉన్నారు. ఆ పార్టీల కార్యకర్తలు చెక్కుచెదరలేదన్నది వాస్తవం. అందుకే ఎలాంటి ప్రజాభిమానం లేని రాజ్‌ థాకరే పార్టీని అమిత్‌ షా ఎన్‌డియేలో భాగస్వామిని చేశారు. రాజ్‌ థాకరే ఎన్‌డియే లోకి రావడం షిండే వర్గాన్ని కలవరపరిచింది. ఉత్తర భారతీయులను నిరంతరం అవమానిస్తూ, వారిపై విద్వేషపూరిత ప్రకటనలు చేసిన రాజ్‌ థాకరేను బిజెపి కూటమిలో చేర్చుకోవడం వల్ల ఆ ప్రాంతంలో బిజెపి ఓట్లు గల్లంతు కావచ్చు.
ఎన్‌డియే పరిస్థితి బీహార్‌లో కూడా గత ఎన్నికల కంటే దారుణంగా ఉంది. నితీష్‌ కుమార్‌ ఎత్తుగడ ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. పశుపతి కుమార్‌ పరాస్‌ ‘రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ’ ఎన్‌డియే నుంచి నిష్క్రమించడం కూడా కూటమిని బలహీనపరుస్తుంది. ఒడిశాలో బిజెడి, పంజాబ్‌లో అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకునేందుకు బిజెపి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. గత రెండు ఎన్నికలలో పొత్తుల గురించిన ఆలోచనే చేయని బిజెపి…ఈసారి మిత్రపక్షాల కోసం వెంపర్లాడడం ఆ పార్టీ గడ్డు పరిస్థితికి నిదర్శనం.
కేరళలో బిజెపికి ఏ మాత్రం ఆశ లేదు. గత ఎన్నికలలో వచ్చిన ఓట్లను నిలబెట్టుకోవడం కూడా కష్టమే. వారి ఏకైక ఆశ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ పైనే ఉంది. కేరళలో కాంగ్రెస్‌కు ప్రధాన శత్రువు సిపిఎం. బిజెపి కాదు. కేరళ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఎల్‌.డి.ఎఫ్‌లు చేసిన పోరాటాల్లోనూ యు.డి.ఎఫ్‌ పాల్గనలేదు. రాష్ట్ర ఆర్థిక హక్కుల కోసం… లౌకికవాదం, ప్రజాస్వామ్యంతో సహా రాజ్యాంగం ప్రతిపాదించిన ఆలోచనలను పరిరక్షించడం కోసం…కేరళ ప్రజలు చేసిన పోరాటాలకు కాంగ్రెస్‌, యు.డి.ఎఫ్‌ వెన్నుపోటు పొడిచాయి. దీన్ని అర్థం చేసుకున్న ఆ రాష్ట్ర ప్రజలు ఎల్‌.డి.ఎఫ్‌కు పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నట్లు గమనించవచ్చు. ఎన్నికల ప్రచార రంగంలో ఎల్‌.డి.ఎఫ్‌ ముందంజలో ఉంది. యు.డి.ఎఫ్‌కి భారీ వైఫల్యం ఎదురుచూస్తోంది.

– ఎం.వి. గోవిందన్‌

వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు

➡️