75 ఏళ్ల భారత రాజ్యాంగం-ప్రస్తుత సవాళ్లు

Jan 26,2024 07:09 #Editorial

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్‌ రాజకీయాలు, క్రోనీ కాపిటలిజమ్‌ రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 50,000 కోట్లకు అధిపతిగా ఉన్న అదానీ నేడు 11 లక్షల కోట్లకు అధిపతిగా మారారు. కేంద్రంలోను అనేక రాష్ట్రాలలోను మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్‌ కంపెనీలు, బొగ్గు మొదలైన రంగాలన్నీ అదానీ, అంబానీల నియంత్రణలోనే ఉన్నాయి. వీరు రాజకీయ రంగాన్ని నియంత్రణ చేస్తూ తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరికి పూర్తిగా సహకరిస్తున్నది.

2024 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. రాజ్యాంగ పరిషత్‌ దాదాపు మూడేళ్ల పాటు కృషి చేసి రూపొందించిన రాజ్యాంగం 1949 నవంబర్‌ 26న ఆమోదం పొంది, 1950 జనవరి 26న అమలులోకి రావడంతో ‘గణతంత్ర’ (రిపబ్లిక్‌) దినోత్సవంగా ప్రకటించుకున్నాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ 60 రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ‘రాజ్యాంగ పీఠిక’లో రాజ్యాంగ లక్ష్యాలను, ఆశయాలను వివరించారు. 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ పేర్కొన్నది. రాజ్యాంగ మౌలిక స్వరూప అంశాలుగా సమాఖ్య విధానం, లౌకికవాదం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు మొదలగు వాటిని న్యాయమూర్తులు పేర్కొన్నారు. గత 74 ఏళ్లుగా భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలబడి, ‘భిన్నత్వం’ గల భారత దేశాన్ని సమైక్యంగా ముందుకు తీసుకువెళ్లటానికి దోహదపడినది. దాదాపు 105కు పైగా రాజ్యాంగ సవరణలు జరిగినప్పటికి రాజ్యాంగ మౌలిక స్వరూపం కొనసాగుతూనే ఉన్నది. కాని 2014 నుంచి ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ‘మౌలిక స్వరూపమే’ కోల్పోయే విధంగా దాడులు ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి బయట పడాలంటే ప్రజాచైతన్యం, ప్రజాభిప్రాయమే ప్రధాన మార్గం.

సమాఖ్య విధానంపై దాడి

            భారతదేశానికి గల భిన్నత్వం దృష్ట్యా రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య విధానాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఉపయోగించనప్పటికీ, 1వ నిబంధనలో భారతదేశాన్ని ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని చెప్పారు. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించారు. అనేక సందర్భాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలలో మార్పుల కోసం నియమించి వాటి సిఫార్సుల ఆధారంగా రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాఖ్య విధానంపై దాడి ప్రారంభించి రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జి.యస్‌.టి రాష్ట్రాల ఆర్థిక వనరులను దెబ్బతీశాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత వేలాది చిన్నతరహా పరిశ్రమలు మూతపడి రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయాయి. జి.యస్‌.టి వలన రాష్ట్రాలకు లక్ష కోట్లు నష్టం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన 3 వ్యవసాయ చట్టాలు సమాఖ్య విధానానికి పూర్తి విరుద్ధం. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా, కేంద్రం ఈ చట్టాలను చేసింది. అందువల్లనే లక్షలాది మంది రైతాంగం ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో వాటిని ఉపసంహరించుకోక తప్పలేదు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. విద్యారంగంలో ప్రధాన నిర్ణయాలు చేయాలంటే రాష్ట్రాలతో సంప్రదించాలి. కాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 2020 జులైలో రాష్ట్రాలతో సంప్రదించకుండానే ‘జాతీయ విద్యావిధానం-2020’ ప్రకటించడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.కేంద్ర ప్రభుత్వం తరచుగా జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించడమే కాక ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆధ్వర్యంలో జమిలి ఎన్నికల కోసం ఒక కమిటీని నియమించడం ఫెడరల్‌ విధానానికి విరుద్ధం. బహు పార్టీ వ్యవస్థ బలంగా ఉండి భిన్నమైన పార్టీలు భిన్న రాష్ట్రాలలో గెలుపొందుతున్న సమయంలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు. నరేంద్రమోడీ నియమించిన గవర్నర్లు కేరళ, తమిళనాడు, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందికి గురిచేయటం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధం.

లౌకికవాదానికి విఘాతం

            ఆధునిక ప్రపంచంలో లౌకికవాదం కలిగిన దేశం మాత్రమే ప్రజాస్వామ్య రాజ్యంగా కొనసాగుతుంది. రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రజలకు 25 నుంచి 28 వరకు గల నిబంధనలలో మత స్వేచ్ఛను కల్పించారు. భారత రాజ్యాంగాన్ని పీఠికలో లౌకికరాజ్యంగా ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మతపరంగా విభజన చేస్తూ ‘మెజారిటీ వాదాన్ని’ రెచ్చగొడుతున్నది. అనేకచోట్ల మైనార్టీలపై, దళితులపై దాడులు జరుగుతున్నాయి. మత విభజన చేయడానికి జమ్ము కాశ్మీర్‌ రాష్ట్రానికి రాజ్యాం గం కల్పించిన 370వ నిబంధన రద్దు చేయటమే కాక, జమ్ము కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేకుండా చేసింది. పౌరుల మధ్య మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ‘ఏక పౌరస్మృతి’ అంశాన్ని తెర మీదకు తెచ్చింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని మతపరమైన అంశంగా మార్చి రాజకీయ లబ్ధి పొందే విధంగా ఆ ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ ఉత్సవం మొత్తం భక్తికి సంబంధించిన అంశంలా కాకుండా ‘మెజారిటీ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా’ కొనసాగటాన్ని ప్రత్యక్షంగా మనందరం చూశాం.

మణిపూర్‌లో కుకీలు, మెయితీలు మధ్య బేధాలను సృష్టించి మతపరంగా లబ్ధి పొందటానికి ప్రయత్నం జరుగుతున్నది. పాఠ్యపుస్తకాలలో కూడా చరిత్ర పాఠాలపై దాడి చేస్తూ మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తున్నది. చివరికి ‘కాశ్మీరీ ఫైల్స్‌’ వంటి సినిమాల ద్వారా కూడా మతపరమైన విభజనకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.

ప్రమాదంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం

             రాజ్యాంగ నిర్మాతలు భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టారు. కార్యనిర్వాహక వర్గం, శాసనశాఖ, న్యాయ వ్యవస్థల మధ్య సమతౌల్యత ఉండాలి. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలన్నీ మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి బలైపోతున్నాయి. ఎన్నికల కమిషన్‌కు స్వతంత్రత లేకుండా చేయటానికి ఇటీవల చట్టాన్ని ఆమోదించారు. సుప్రీంకోర్టు పని తీరులో కూడా జోక్యం చేసుకుంటున్నారు. కొలీజియం చేసిన కొన్ని నిర్ణయాలను మోడీ ప్రభుత్వం ఆమోదించకుండా తమకిష్టమైన న్యాయమూర్తులను మాత్రమే నియమిస్తున్నారు. అనేక కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా రావటానికి ఇదే ప్రధాన కారణం. మోడీ భారతదేశ పార్లమెంటరీ విధానాన్ని ఆచరణలో అధ్యక్ష పాలనా విధానంగా మార్చివేస్తున్నారు.

భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు

             భారత రాజ్యాంగంలో 19వ నిబంధన ద్వారా పౌరుడికి భావప్రకటనా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ కల్పించబడ్డాయి. పౌరుల ఈ స్వేచ్ఛలను కాపాడటానికి రాజ్యాంగం అనేక రక్షణలు కల్పించినది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా ఈ స్వేచ్ఛలను కాపాడుకోవచ్చని రాజ్యాంగం చెప్పింది. కానీ మెడీ ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛకు అనేక ప్రతిబంధకాలు కల్పిస్తున్నది. గతంలో గోవింద పన్సారే, గౌరీ లంకేశ్‌, యమ్‌.యమ్‌.కల్బుర్గి వంటి వారిని సంఘ పరివార్‌ శక్తులు హత్య చేశాయి. తమతో విభేదించేవారిని, ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా ముద్ర వేసి జైళ్లలో ఏళ్ల తరబడి ఉంచుతున్నారు. ప్రొఫెసర్‌ సాయిబాబాకు హైకోర్టు బెయిల్‌ ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ద్వారా ఆ బెయిల్‌ను రద్దు చేయించడం దీనికి పెద్ద ఉదాహరణ.

అనేక విశ్వవిద్యాలయాలలో ముఖ్యంగా ఢిల్లీలో గల జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం వంటి చోట విద్యార్థి ఉద్యమాలను అణచివేస్తున్నారు. యన్‌.డి.టివి, ది వైర్‌, న్యూస్‌ క్లిక్‌ వంటి మీడియా సంస్థల గొంతును నొక్కివేయడం ప్రస్తుత పౌరస్వేచ్ఛ పరిమితిని తెలియచేస్తున్నది. ప్రబీర్‌ పురకాయస్థ వంటి పలువురు జర్నలిస్టులను, కాలమిస్టులను అరెస్టు చేసి నెలల తరబడి జైళ్లలో ఉంచటం రాజ్యాంగ సూత్రాలకు పూర్తి విరుద్ధం. బిల్కిస్‌ బానో ఉదంతంలో నేరస్తులను విడుదల చేసి, పూలదండలు వేసి ఊరేగించటం సంఘ పరివార్‌ దుర్మార్గాన్ని తెలుపుతున్నది. అయితే ఇటీవల బిల్కిస్‌్‌ బానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొంత ఉపశమనంగా ఉన్నది.

కార్పొరేట్‌ రాజకీయాలు-క్రోనీ కాపిటలిజమ్‌

               ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్పొరేట్‌ రాజకీయాలు, క్రోనీ కాపిటలిజమ్‌ రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తిగా విరుద్ధం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి కేవలం 50,000 కోట్లకు అధిపతిగా ఉన్న అదానీ నేడు 11 లక్షల కోట్లకు అధిపతిగా మారారు. కేంద్రంలోను అనేక రాష్ట్రాలలోను మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఓడరేవులు, విమానాశ్రయాలు, విద్యుత్‌ కంపెనీలు, బొగ్గు మొదలైన రంగాలన్నీ అదానీ, అంబానీల నియంత్రణలోనే ఉన్నాయి. వీరు రాజకీయ రంగాన్ని నియంత్రణ చేస్తూ తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వీరికి పూర్తిగా సహకరిస్తున్నది.

రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి మూడు దశాబ్దాలు వివిధ రాజకీయ పార్టీలలో సేవా దృక్పథం కలవారు, రాజకీయాలను పూర్తికాలపు వృత్తిగా స్వీకరించిన వారు పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు. కానీ ఆర్థిక సంస్కరణల తర్వాత రాజకీయాలు కార్పొరేటీకరణ చెంది, ప్రధాన రాజకీయ పార్టీలలో కార్పొరేట్‌ ప్రతినిధులు వ్యాపారవేత్తలు, ప్రజా ప్రతినిధులుగా పోటీ చేస్తున్నారు. లోకసభకు రూ. 100 కోట్లు, శాసనసభకు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేసేవారు మాత్రమే పోటీ చేయాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. గెలుపొందిన వారు వ్యాపారం చేసుకుంటూ తమ పదవిని వ్యాపార ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. దీని వలన నిజాయితీపరులు, సామాజికవేత్తలు, వామపక్ష ప్రజా దృక్పథం కలిగిన వారు ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నారు.

క్రోనీ కాపిటలిజమ్‌ విస్తృతంగా పెరిగి రాజకీయ అధికారం కలిగిన వారు భూములను, ఖనిజ సంపదను, ఇసుకను, కాంట్రాక్టులను విస్తృతంగా పందేరాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చొక్కా మార్చుకున్నంత తేలికగా మారిపోవటం క్రోనీ కాపిటలిజానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కార్పొరేట్‌ రాజకీయాల ద్వారా జరుగుతున్న పరిణామాలు, క్రోనీ కాపిటలిజమ్‌ రూపంలో జరుగుతున్న అంశాలు రాజ్యాంగ లక్ష్యాలకు పూర్తి విరుద్ధం.

రాజ్యాంగమే సర్వోన్నతం

భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాలి. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 26న కింది విధంగా పేర్కొన్నారు. ‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైనా కావచ్చు, కాని దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు’ అని చెప్పారు. 1975లో భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితి విధింపు రూపంలో ఒక దాడిని ఎదుర్కొన్నది. భారత ప్రజలు 1977లో దానిని విజయవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వ రూపంలో భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంపై, రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలపై దాడి జరుగుతున్నది. రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ సవాళ్లు ఎదుర్కొనటానికి విస్తృతమైన ప్రజా మద్దతు అవసరం. ఆధునిక భారత రాజ్యాంగ లక్ష్యాల స్థానంలో ప్రాచీన మనుస్మృతి లక్ష్యాలను ప్రతిష్టించటానికి సంఘ పరివార్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో పనిచేస్తున్నది. ఈ ఎత్తుగడలను ఓడించడానికి ప్రజాభిప్రాయం, ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఈ కృషి కొనసాగాలి.

/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్‌ : 8309965083 /కె.యస్‌.లక్ష్మణరావు
/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్‌ : 8309965083 /కె.యస్‌.లక్ష్మణరావు
➡️