రైతు ఉద్యమాలే కా|| కొరటాలకు నిజమైన నివాళి

Jul 1,2024 11:27 #editpage

కామ్రేడ్‌ కొరటాలగా అందరూ పిలుచుకునే ప్రియతమ నేత, సిపిఎం రాష్ట్ర కమిటీ పూర్వ కార్యదర్శి, పోలిట్‌బ్యూరో మాజీ సభ్యులు, రైతు, వ్యవసాయ కార్మిక, చేనేత కార్మిక సంఘాల ఉద్యమ సారథి కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతి జులై ఒకటవ తేది.
కొరటాల సత్యనారాయణ గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో 1923 సెప్టెంబర్‌ 24వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే పద్నాలుగేళ్ల వయసులో డిటెన్షన్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంతో ప్రజా జీవితంలోకి ప్రవేశించిన కొరటాల 2006 జులై 1వ తేదీన అనారోగ్యంతో మరణించే వరకు ఏడు దశాబ్దాల పాటు ఎర్రజెండా చేత పట్టుకుని అలుపెరుగని పోరాటం నిర్వహించారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్బంధ కాలంలో నాలుగేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపారు. అజ్ఞాత జీవితంలో ఉండగా 1948లో అరెస్టు చేసి సుమారు మూడు సంవత్సరాలకు పైగా బళ్లారి, కడలూరు జైళ్ళలో నిర్బంధించారు. చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా జరిగిన భూపోరాటంలో, పేదల స్వాధీనంలో ఉన్న బంజరు భూముల పోరాటంలో, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, కరువు నుండి రాయలసీమను విముక్తి చేసేందుకు రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు మళ్లించాలని సాగిన పోరాటాలలో, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించాలని, రైతులకు పంటలకు మద్దతు ధరలు కల్పించాలని జరిగిన పోరాటాలలో కొరటాల క్రియాశీలక పాత్ర పోషించారు.
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్రంలో కరువు, తుఫాన్‌ వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా బాధితుల పక్షాన నిలబడి ఉద్యమాలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన పత్తి రైతుల ఆత్మహత్యలపైన, వరి, పత్తి, కంది, మిరప, పొగాకు వంటి పంటలకు కనీస మద్దతు ధరల కోసం ఉద్యమాలు నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకునిగా వ్యవసాయ కార్మికులకు బంజరు భూములు పంచాలని, కూలి రేట్ల పెంపుదల, ఉపాధి వంటి సమస్యలపై ఉద్యమాలు నిర్వహించారు. చేనేత కార్మిక సంఘం బాధ్యుడిగా చేనేత కార్మికుల మజూరి, రంగుల ధరలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు వంటి సమస్యలపై ఎనలేని కృషి చేశారు. తాను ఏ రంగంలో పని చేసినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం లోతైన అధ్యయనంతో ఉద్యమ నిర్మాణానికి కొరటాల కృషి చేశారు.
రైతు వ్యతిరేక విధానాలపై…
2024 పార్లమెంట్‌ ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా బొటా బొటీ మెజారిటీతో, చంద్రబాబు, నితీష్‌ కుమార్‌ వంటి మిత్రుల మద్దతుతో కేంద్రంలో బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చింది. అయినా బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వం తన వెనుకటి విధానాల నుండి ఏ మాత్రం పక్కకు వైదొలగలేదన్నది స్పష్టమవుతున్నది.
జూన్‌ 19న 2024-25 సంవత్సరానికి 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం అరకొరగా మద్దతు ధరలను ప్రకటించి రైతాంగం పట్ల తన వైఖరిని మరోమారు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో రైతాంగం క్వింటాలుకు వరి పైన రూ.712, కందులకు రూ.2,206, మినుములకు రూ.2,344, వేరుశనగకు రూ.1,713, పత్తికి రూ.2,224 నష్టపోతున్నారు. వ్యవసాయ ఖర్చులు 18 శాతం నుండి 35 శాతం వరకు పెరుగుతుంటే మద్దతు ధరలు మాత్రం 5 నుండి 10 శాతం మాత్రమే పెంచారు. పెట్టుబడిపై 50 శాతం (సి2+50 శాతం) లాభం కలిపి పంటలకు మద్దతు ధర నిర్ణయించాలన్న డా||స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను ఏ మాత్రం అమలు చేయకుండా పక్కన పెట్టిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదే.
కార్పొరేట్‌ అనుకూల సాగు విధానాలు
నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 2019లో తెచ్చిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిర్బంధాలను లెక్క చేయకుండా రైతాంగం పెద్ద ఎత్తున చారిత్రాత్మక ఉద్యమం నిర్వహించింది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ స్వయంగా పార్లమెంటులో రైతులకు క్షమాపణలు చెప్పి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించారు. రైతుల ప్రతినిధులతో చర్చించి మద్దతు ధరలిచ్చేలా పార్లమెంటులో చట్టం తెస్తామని, విద్యుత్‌ సవరణ బిల్లు ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు. కాని ఆ చట్టాలను మరో రూపంలో అమలు చేస్తూ రైతు కేంద్రంగా ఉన్న మన వ్యవసాయాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఎఫ్‌సిఐ గిడ్డంగులను ప్రైవేట్‌ కార్పొరేట్‌ కంపెనీలకు ఇస్తున్నది. విద్యుత్‌ రంగంలో తెస్తున్న సంస్కరణలతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ప్రశ్నార్థకం కానుంది. వ్యవసాయ రంగంపైనే కాక, గృహ విద్యుత్‌ వినియోగదారులపైనా విపరీతంగా భారం పడే అవకాశం ఉంది.
రైతు వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు
రూ.20,000 వ్యవసాయ పెట్టుబడి సాయం, రూ.2 లక్షల వరకు పంట రుణాలు రద్దు, సున్నా వడ్డీ, పావలా వడ్డీ బకాయిల విడుదల వంటి ఎన్నికల హామీలను టిడిపి సంకీర్ణ ప్రభుత్వం అమలు చేయాలి. కేరళ తరహాలో రాష్ట్రంలో రైతు రుణ విమోచన చట్టం తీసుకురావాలి. పంటలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలకు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించి అమలు చేయాలి. కేంద్రం ప్రకటించని పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు ప్రకటించి అమలు చేయాలి. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్‌ ఒడుదుడుకులలో రైతుకు అండగా నిలవాలి.
పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం చేయాల్సిందే. అదే సమయంలో పోలవరం నిర్మాణంలో సర్వం కోల్పోతున్న లక్ష మందికి పైగా నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం, పునరావాసం ప్రభుత్వం బాధ్యత అన్న విషయం మరువరాదు. వీటితో పాటు వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం వెలుగొండ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైసిపికి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద గుణపాఠం నేర్పారు. దీని నుండి తెలుగుదేశం ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలి. వెనుకబడ్డ ప్రాంతాల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
శ్రీకాకుళం జీడి మామిడి రైతులు, కోనసీమలో కొబ్బరి రైతులు, రాయలసీమలో ఉద్యానపంటల రైతులు, చిత్తూరు, ఎన్టీఆర్‌ జిల్లాలలో మామిడి రైతులు, కృష్ణా, గోదావరి డెల్టా జిల్లాలలో లక్షలాది మంది కౌలురైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి. పత్తి, మిరప, చెరుకు, పొగాకు వంటి వ్యాపార పంటలు పండించే రైతులు మార్కెట్‌ ఒడిదుడుకులకు తీవ్రంగా నష్టపోతున్నారు. డెల్టా జిల్లాలలో ధాన్యం రైతులు ప్రభత్వం నుండి వందల కోట్ల రూపాయలు బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న పంటల బీమా పథకం కార్పొరేట్‌ కంపెనీలకు తప్ప రైతులకు లాభదాయకంగా లేదు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు రైతు అనుకూల విధానాలను రూపొందించాలి. ఆలా చేయకపోతే…కొరటాల సత్యనారాయణ స్ఫూర్తితో సమరశీల రైతు ఉద్యమాలకు రాష్ట్ర రైతాంగం సిద్ధం కావాలి. అదే కామ్రేడ్‌ కొరటాలకు అర్పించే నిజమైన నివాళి.

కె. ప్రభాకర రెడ్డి
/ వ్యాసకర్త ఎ.పి రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి /

➡️