‘కంటైనర్‌ టెర్మినల్‌ ‘ మూసివేతకు అదానీ కుతంత్రాలు

Feb 25,2024 07:15 #Editorial

టెర్మినల్‌ ఆధారిత కంపెనీలు ఇప్పటికే ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లాలో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో ఏర్పాటైన ‘సీమెన్స్‌ గమేషా’ కంపెనీ ఒక యూనిట్‌ను మూసివేసింది. 600 మంది కార్మికులు వీధినపడ్డారు. జి.ఆర్‌.ఐ టవర్స్‌ మూసివేత దిశగా పయనిస్తోంది. ఇది మూతపడితే 300 మంది కార్మికులు రోడ్డున పడతారు. న్యూస్‌ ప్రింట్‌, ఫుడ్‌ ఐటమ్స్‌, 150కి పైగా కస్టమ్స్‌ ఏజెంట్‌ కంపెనీలు, 20కి పైగా ఫునిమేషన్‌ సర్వీసెస్‌ కార్యాలయాలు, 2 కంటైనర్‌ ఫ్లైట్‌ స్టేషన్లు, వారి మీద ఆధారపడిన హమాలీలు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టర్లు, హౌస్‌ కీపింగ్‌, రోజువారీ కూలీలు కూడా రోడ్డున పడతారు.

                అదానీ కంపెనీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ మూసివేతకు ప్రయత్నిస్తోంది. తన కంపెనీ నేతృత్వంలోని ఇతర పోర్టులను బలోపేతం చేసుకునేందుకు ఈ పోర్టును బలిచేస్తున్నది. గత సంవత్సర కాలంగా అదానీ పోర్టు యాజమాన్యం తమ ప్రయోజనాల కోసం ఒక ప్రణాళిక ప్రకారం తమిళనాడులోని తమ స్వంత పోర్టులకు కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను తరలిస్తున్నది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోతున్నది. సుమారుగా 10 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతారు. పరోక్షంగా వేలాదిమంది జీవన భృతి దెబ్బ తింటుంది.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అండదండలు పుష్కలంగా ఉన్న అదానీ యాజమాన్యం 2020వ సంవత్సరంలో ‘నవయుగ విశ్వేశ్వరరావు’ కంపెనీ నుంచి కృష్ణపట్నం పోర్టును హస్తగతం చేసుకున్నప్పటి నుండే టెర్మినల్‌ విషయంలో ద్వంద్వనీతిని అవలంభిస్తోంది. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే కె.పి.సి.యల్‌ కంపెనీకి 2004 సెప్టెంబర్‌ 17న ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అగ్రిమెంట్‌ ప్రకారం యాజమాన్యం సంరక్షకుడి పాత్రను మాత్రమే పోషించాలి. కానీ ఎక్కడా ఈ నిబంధన అమలైన పరిస్థితి లేదు. ప్రభుత్వ ఒప్పందాన్ని గత, ప్రస్తుత యాజమాన్యాలు నిర్వీర్యం చేశాయి. నిర్మించు, నిర్వహించు, వాటా మరియు బదిలీ (బి.ఒ.ఎస్‌.టి-బోస్ట్‌) ప్రాతిపదికన పోర్టు వ్యవహారాలను నిర్వహించాలి. 30 ఏళ్ళ అగ్రిమెంట్‌ ప్రకారం మొదటి 30 సంవత్సరాలలో ఓడరేవు స్థూల ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 2.6 శాతం చెల్లించాలి. 30వ సంవత్సరం నుండి ఆ వాటా 5.4 శాతం, 40వ సంవత్సరం నుండి ఆ వాటా 10.8 శాతం చెల్లించాలి. ఈ ఒప్పందం ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరం నుండి 2023-2024 ఆర్థిక సంవత్సరం వరకు వరుసగా రూ.46 కోట్లు, రూ.54 కోట్లు, రూ.72 కోట్లు, 89 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించారు. ఇవి కాకుండా జి.యస్‌.టి, ఇతర పన్నులు, రైల్వే ఆదాయం అదనంగా ప్రభుత్వానికి వస్తుంది.

‘బోస్ట్‌’ అగ్రిమెంట్‌ ప్రకారం నవయుగ కంపెనీ పోర్టును 2017 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. పోర్టు సామర్ధ్యం 200 మిలియన్‌ టన్నుల రవాణా నిర్వహించగల స్థాయికి చేరింది. కానీ 2020లో పోర్టును తన చేతుల్లోకి తీసుకున్న అదానీ సంస్థ వ్యవహారం చూస్తే వారి సొంత పోర్టులను అభివృద్ధి చేసుకునేందుకు ఈ పోర్టును పావుగా వాడుకుంటున్నట్లుగా అనిపిస్తున్నది. ‘బోస్ట్‌’ అగ్రిమెంట్‌ కాలపరిమితి పూర్తయ్యే నాటికి కృష్ణపట్నం పోర్టును నిర్వీర్యం చేసేలా ఈ సంస్థ వ్యవహారిస్తున్నది.

ఇష్టారాజ్యంగా కార్మికుల బదిలీలు

                 తన కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్న ప్రత్యక్ష ఉద్యోగులను కట్టుపల్లి, గంగవరం, ఎన్నూరు పోర్టులకు యాజమాన్యం బదిలీలు చేసింది. కొంత మందితో బలవంతంగా రాజీనామాలు చేయించింది. మరికొంత మందిని పోర్టులో వివిధ విభాగాలకు బదిలీ చేసి తాత్కాలికంగా సర్దుబాటు చేసింది.

పోర్టు హ్యాండ్లింగ్‌ సామర్ధ్యాన్ని పరిశీలిస్తే..

            2020-2021 ఆర్థిక సంత్సరంలో 38 మిలియన్‌ టన్నులు, 2021-2022లో 40 మిలియన్‌ టన్నులు, 2022-2023లో 48 మిలియన్‌ టన్నులు ఎగుమతులు, దిగుమతులు అయ్యాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 58 మిలియన్‌ టన్నులు లక్ష్యంగా పెట్టుకుంది. 2021 నుండి 2024 వరకు జరిగిన లావాదేవీలను పరిశీలిస్తే కంటైనర్‌ సరుకుల (కార్గో) షేర్‌ నామమాత్రంగా ఉంది.

కంటైనర్‌ టెర్మినల్‌ విశిష్టత

                     ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక నుండి ఎగుమతులు, దిగుమతులు చేసుకునే వారికి అనుకూలమైన టెర్మినల్‌ ఇది. గతంలో ముంబైలోని జవహర్‌లాల్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ మీద ఆధారపడి లావాదేవీలు నిర్వహించేవారు. పై ప్రాంతాల వారికి ఈ పోర్టు సౌకర్యంగా ఉండడంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతున్నది. దీంతో వినియోగదారులు ఈ పోర్టు గుండా లావాదేవీలు జరిపేందుకు ఆసక్తి కనపరచేవారు. యాజమాన్యం అనుసరిస్తున్న విధానంతో వారు తీవ్ర నిరాశకు గురై ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.

మూతపడుతున్న కంపెనీలు..

                  వీధిన పడుతున్న కార్మికులుటెర్మినల్‌ ఆధారిత కంపెనీలు ఇప్పటికే ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లాలో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో ఏర్పాటైన ‘సీమెన్స్‌ గమేషా’ కంపెనీ ఒక యూనిట్‌ను మూసివేసింది. 600 మంది కార్మికులు వీధినపడ్డారు. జి.ఆర్‌.ఐ టవర్స్‌ మూసివేత దిశగా పయనిస్తోంది. ఇది మూతపడితే 300 మంది కార్మికులు రోడ్డున పడతారు. న్యూస్‌ ప్రింట్‌, ఫుడ్‌ ఐటమ్స్‌, 150కి పైగా కస్టమ్స్‌ ఏజెంట్‌ కంపెనీలు, 20కి పైగా ఫునిమేషన్‌ సర్వీసెస్‌ కార్యాలయాలు, 2 కంటైనర్‌ ఫ్లైట్‌ స్టేషన్లు, వారి మీద ఆధారపడిన హమాలీలు, డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టర్లు, హౌస్‌ కీపింగ్‌, రోజువారీ కూలీలు కూడా రోడ్డున పడతారు.

బోసిపోతున్న గోదాములు

               జిల్లాలో పదికి పైగా గోదాములు సరుకుల లావాదేవీలు లేక బోసిపోతున్నాయి. వీటిని నమ్ముకుని జీవిస్తున్న సుమారు 3000 మంది హమాలీ కార్మికులు జీవనభృతి కోల్పోయారు. రైల్వే వ్యాగన్‌ లోడింగ్‌-అన్‌లోడింగ్‌, రైల్వే వ్యాగన్‌ లోడింగ్‌- అన్‌లోడింగ్‌ కార్మికులు 2000 మంది కంటైనర్‌ టెర్మినల్‌ మూసివేతతో పనులు కోల్పోయారు.

రాష్ట్రంపై ప్రభావం

                   రాయలసీమ జిల్లాల్లోని సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు సౌర పలకల (సోలార్‌ ప్యానెళ్లు) దిగుమతి ఈ టెర్మినల్‌ ద్వారా జరిగేది. వాటి రవాణాకు రైలు, రోడ్డు మార్గాన తీసుకు వెళ్లేందుకు రైళ్లు, ట్రాలీలు అవసరం అయ్యేవి. వందలాది మంది డ్రైవర్లు, కార్మికులు ఉపాధి పొందేవారు. శ్రీ సిటీ లోని పరిశ్రమలకు విడిభాగాలు, బెంగళూరులోని బి.యం.డబ్ల్యు, ఇసుజు కార్ల కంపెనీలకు విడిభాగాలు, గుంటూరులోని సిమెంట్‌ పరిశ్రమకు తెల్ల సిమెంట్‌ దిగుమతులు, సిమెంట్‌ ఎగుమతి, పేపర్‌ రోల్స్‌, టైల్స్‌ దిగుమతులకు, చీమకుర్తి గ్రానైట్‌ ఎగుమతి, గుంటూరు మిర్చి, పత్తి, కోస్తా ప్రాంతంలోని బియ్యం, వందలాది రొయ్యల ప్రాసెసింగ్‌ పరిశ్రమల ద్వారా రొయ్యల ఎగుమతులకు ఈ టెర్మినల్‌ అనుకూలంగా ఉండేది. కానీ కృష్ణపట్నం పోర్టు టెర్మినల్‌ మూసివేత కారణంగా ఇవన్నీ తమిళనాడుకు తరలిపోయాయి. దీని ప్రభావం ఎప్పుడూ రద్దీగా ఉండే తమిళనాడు పోర్టులపై పడింది. దీంతో ఎగుమతులు, దిగుమతులకు రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి మన రాష్ట్ర వ్యాపారులకు దాపురించింది.

పోరాడుతున్న కార్మిక సంఘాలు

             ఈ పరిస్థితులను గమనించి పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ను యథాతథంగా కొనసాగించాలని కార్మిక సంఘాలు ఇప్పటికే పోరాటం ప్రారంభించాయి. పోర్టు టెర్మినల్‌ తరలింపును నిరసిస్తూ 2024 ఫిబ్రవరి 19వ తేదీన కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద మహా ధర్నాకు పిలుపునిచ్చాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పోర్టు యాజమాన్యం అనుసరిస్తున్న దివాళాకోరు విధానాన్ని అడ్డుకోవాలి. కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలు యథాప్రకారం కృష్ణపట్నం పోర్టులోనే నిర్వహించేలా చూడాలి. వ్యాపారులు, కార్మికులు, పోర్టు పరిసర ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు కాపాడాలి.

/ వ్యాసకర్త కృష్ణపట్నం పారిశ్రామిక క్లస్టర్‌ కమిటీ కార్యదర్శి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సెల్‌ : 9493355318 /గోగుల శ్రీనివాసులు

➡️