తీరు మారని మోడీ రాజ్యం

Jun 29,2024 04:46 #editpage

ఈ దఫా మోడీ నాయకత్వంలో ఏర్పడింది ఎన్‌డిఎ మిశ్రమ ప్రభుత్వం గనక బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంకుశ, మతతత్వ కార్పొరేట్‌ ఎజెండాతో ముందుకు పోవడంలో తీవ్రమైన చిక్కులు ఎదుర్కోవలసి రావచ్చని కొన్ని వర్గాల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ ఆశాభావాల్లో కొన్ని అతి అంచనాలేనని చెప్పాలి. బిజెపి మెజార్టీ కోల్పోయి లోక్‌సభలో 240 స్థానాలకే పరిమితమైంది గనక మోడీ మూడో దఫా పాలనలో ఆయనగానీ ఆరెస్సెస్‌, బిజెపిలుగానీ అమలు చేయాలనుకున్న ఎజెండాలో కొన్నిటికి అదుపు చేయడం, నెమ్మదించడం జరగొచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థను, లౌకిక సూత్రాలను మరింత దెబ్బ తీసి ఏకీకృత నియంతృత్వాన్ని మళ్లీ రుద్దే విధంగా రాజ్యాంగ మార్పులు చేయడం ఇప్పుడు సాధించడం కష్టమే కావచ్చు. అయితే ఆర్థిక రంగంలో మోడీ విధానాల పరంగానూ, వ్యవస్థలను దెబ్బ తీసి నిరంకుశత్వం పెంచే పోకడలలోనూ మోడీ ప్రభుత్వ వైఖరిలో గుణాత్మకమైన మార్పేమీ వుండదు. ప్రతిపక్షంతో మోడీ సర్కారు ఘర్షణాత్మక వైఖరి, పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల తృణీకరణ పార్లమెంటు సమావేశాల ప్రారంభంలోనే కనిపించింది. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే సందర్భంలో ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్‌ స్థానం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఆ విధంగా ఎన్నికపై ఏకాభిప్రాయం లేకుండా చేసింది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత కొద్ది రోజులలోనే దాని నిరంకుశ నిర్బంధ పాలన నిర్మాణ చట్రం రంగంలోకి వచ్చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు కింది కోర్టు బెయిల్‌ ఇస్తే హైకోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్‌ జైలు నుంచి బయటికి రాకుండా చేసేందుకై సిబిఐ అదే కేసులో మరోసారి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది. రచయిత్రి అరుంధతీ రారుపై ఒక కేసు నమోదైన తర్వాత 14 ఏళ్లకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉపా కింద విచారణ జరిపేందుకు అనుమతి మంజూరు చేశారు. జులై 1 నుంచి మూడు నేర స్మృతులు (కోడ్స్‌) అంతకు ముందున్న నేర స్మృతులు శిక్షా స్మృతుల స్థానంలో అమలులోకి రానున్నాయి. ఈ కొత్త కోడ్స్‌లోని అనేక నిబంధనలు పౌరుల ప్రజాస్వామిక హక్కులపై అనేక రకాలైన ఆంక్షలు పెంచబోతున్నాయి. పౌరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పించడమే గాక…రాజద్రోహం వంటి వాటిని శిక్షించేందుకు కర్కోటకమైన అధికారాలు కట్టబెట్టనున్నాయి.
నిర్బంధ చట్టాలకు కోరలు
అమిత్‌ షాను మళ్లీ హోంమంత్రిగా నియమించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సిబిఐ తదితర సంస్థలు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలు కొనసాగించబోతున్నాయి. తమకు వ్యతిరేకమైన ఏ ఇతర వ్యక్తులను లేదా వ్యవస్థలను, తమ అవసరాల కోసం బెదిరించి లొంగదీసుకోవలసిన వారి విషయంలోనూ ఇదే జరగబోతుంది.గత ప్రభుత్వ పాలన ఆఖరి దశలో తీసుకొచ్చిన టెలికాం చట్టం, ఐ.టి చట్టం నిబంధనలు ఇప్పుడు అమలులోకి రానున్నాయి. టెలికాం చట్టం 2023 జనవరి 26న పాక్షికంగా నోటిఫై అయ్యింది కూడా. బహిరంగ ఎమర్జన్సీ సమయంలో ఏ విధంగానైతే ఏదైనా మెసేజ్‌ను ఇంటర్నెట్‌ ద్వారా చేరవేయకుండా నిరోధించవచ్చునో ఆ విధంగా అడ్డుకోవడానికి ఈ చట్టం ప్రభుత్వానికి అవకాశమిస్తుంది. హోం శాఖ కార్యదర్శి అనుమతి వుంటే చాలు కేంద్ర సంస్థలు ఏ టెలికాం ప్రసారాన్నయినా ఆపేయడానికి 4 కేంద్ర సంస్థలకు అధికారం ఇస్తుంది.
కార్పొరేట్‌ హిందూత్వ కూటమి దాడి
ఎన్నికల తరుణంలో బడా వాణిజ్య వర్గం నిర్ద్వంద్వంగా నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చింది. బిజెపికి మెజార్టీ రాలేదని వార్తలు రాగానే స్టాక్‌ మార్కెట్‌ వణికిపోయింది. అయితే మోడీ నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వ ఏర్పాటు గురించి ప్రకటన రాగానే ఒక్కసారిగా పైకి లేచి కూచుంది. ఆర్థిక మంత్రిగా మళ్లీ నియమితమైన నిర్మలా సీతారామన్‌ తన తొలి ప్రకటనలోనే తదుపరి దఫా సంస్కరణలు తక్షణం చేపడతామని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో పొందుపరచవలసిన తమ కోర్కెల జాబితాతో బడా వాణిజ్య వర్గం ఆర్థిక మంత్రి దగ్గర మంతనాలు జరుపుతున్నది. మోడీ మూడో సర్కారు ఏర్పాటుతో కార్పొరేట్‌ అనుకూల నయా ఉదారవాద విధానాలు పూర్తి ఊపుగా కొనసాగబోతున్నాయనే సంకేతం వస్తున్నది. నేషనల్‌ మానెటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) వంటి ప్రైవేటీకరణ చర్యలు మరింతగా విచ్చుకుంటాయని భావించవచ్చు. ప్రభుత్వంలో మిత్ర పక్ష భాగస్వాములుగా వున్న తెలుగుదేశం పార్టీ, జెడి(యు) వంటి వాటి స్వభావం రీత్యా కూడా ఈ ఆర్థిక విధానాలకు ఎలాంటి ప్రతిఘటన వుండబోదని అర్థమవుతుంది.
హిందూత్వ రాజకీయాల కొనసాగింపు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకునే దాడుల విషయంలోనూ ఎలాంటి విరామం వుండబోదు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి కొద్ది రోజులలోనే ఈ విషయం స్పష్టమైంది. ప్రత్యేకించి బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లిములను లక్ష్యంగా చేసుకుని అనేక దాడి ఘటనలు జరిగాయి. చత్తీస్‌గఢ్‌లో రారుపూర్‌ సమీపంలోని అరంగ్‌లో పశువుల రవాణాదారులైన ముగ్గురిని మూక చంపివేసింది. పశువుల వ్యాపారం చేయడమే వారి నేరమైంది. బిజెపి పాలిత మధ్య ప్రదేశ్‌ మాండ్ల జిల్లాలో తమ ఇంటి రిఫ్రజిరేటర్లలో పశుమాంసం నిల్వ పెట్టుకున్నారనే ఆరోపణలతో పదకొండు మందిని అరెస్టు చేశారు. ఆ తదనంతరం స్థానిక యంగ్రాంగం అక్రమాక్రమణలనే నెపంతో ఆ పదకొండు మంది వ్యక్తుల ఇళ్లను కూల్చివేసింది. రాజస్థాన్‌ లోని జోధ్‌పూర్‌లో మత ఘర్షణల్లో 51 మంది అరెస్టయ్యారు. మతపరమైన విభజనతో సమీకరణలు చేయడం, మైనార్టీలు లక్ష్యంగా దాడులు జరపడం హిందూత్వ శక్తుల జీవ ధాతు రాజకీయం. కేంద్ర ప్రభుత్వం వీటిని అడ్డుకోవడం, అదుపు చేయడం జరగదు.
కేంద్రంలో జెడియు, టిడిపి
గుర్తించవలసిన విషయమేమంటే ఈ మిశ్రమ కూటమిలో బిజెపి ప్రధాన శక్తి. ఇద్దరు ప్రధాన మిత్రులుగా వున్న పార్టీలు టిడిపి, జెడి(యు)లకు ఏదైనా రాజకీయ విధానపరమైన వైఖరి తీసుకోగల శక్తిగాని, గట్టిగా నిలబడాలనే ఆసక్తి గాని లేవు. టిడిపికి సంబంధించినంత వరకూ దాని నాయకుడైన చంద్రబాబు నాయుడు దృష్టి ఆంధ్రప్రదేశ్‌లో తన స్థానం పటిష్టం చేసుకోవడంపైనే కేంద్రీకరించి వుంది. కేంద్రం పట్ల ఆయన వైఖరి ఎ.పి లో తన ప్రాధాన్యతా ప్రాజెక్టులకు నిధులు, ప్యాకేజీల గురించి సంప్రదింపులకు పరిమితమై వుంటుంది. ఇక జెడియు వరకూ తీసుకుంటే బీహార్‌ సరిహద్దుల పరిధి మించి వారికి మరేమీ పట్టదు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల దృష్ట్యా తన స్థానాన్ని గట్టిపర్చుకోవడంపైనే జెడియు దృష్టి. ప్రతిపక్ష ఐక్యత కోసం పని చేసే సమయంలో ఈ వాస్తవాన్ని బుర్రలో పెట్టుకోవాలి.
విశాల ఐక్యత, వామపక్ష కీలక పాత్ర
పార్లమెంటులో ప్రతిపక్షం బలం పెరిగిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటం మరింత మెరుగ్గా సాగించవచ్చుననే విషయంలో సందేహం లేదు. ప్రభుత్వ దుశ్చర్యలను మరింత బాగా బహిర్గత పరచడానికిది దోహదపడుతుంది. అయితే ప్రజాస్వామ్యంపై మోడీ ప్రభుత్వ నిరంకుశ దాడులపై ప్రతిఘటన పెంపొందించడం మరింత ముఖ్యం. నయా ఉదారవాద విధానాలతో ప్రజల జీవనోపాధిపై సాగించే దాడులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, నిరసనలు పెంపొందించాలి. ఈ సందర్భంలోనే వామపక్షాల పాత్ర కీలకమవుతుంది. ఎందుకంటే నయా ఉదారవాద విధానాలను హిందూత్వ భావజాలాన్ని నికరంగా నిరంతరంగా వ్యతిరేకించేది వామపక్షమే.
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సమాఖ్యతత్వం కాపాడుకోవడం వంటి విషయాల్లో ఇండియా వేదిక, విశాల ప్రతిపక్ష ఐక్యత ఫ్రధాన పాత్ర వహించాల్సి వుంటుంది. ప్రజల దైనందిన పోరాటాలలో ప్రజలను సమీకరించడంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాలి, నయా ఉదారవాద విధానాలపై మొత్తం వ్యతిరేక ఉద్యమాలతో వీటిని అనుసంధానం చేయాల్సి వుంటుంది. తద్వారా ప్రత్యామ్నాయ విధానాలను ఒక విశ్వసనీయ వేదికగా రూపొందించాలి. వామపక్షాలతో ముడిపిన వివిధ ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వేదికలు అత్యంత విశాల ఐక్య కార్యాచరణను పెంపొందించాలి. హిందూత్వ కార్పొరేట్‌ కూటమికి వ్యతిరేకంగా ప్రతిఘటనను తీవ్రం చేయడానికి కొంత రాజకీయావరణం (జాగా) లభించిందనేది లోక్‌సభ ఎన్నికల పలితాల నుంచి తీసుకోదగిన ప్రధాన పాఠం.
(జూన్‌ 26 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️