వెలుగుల కోసం ‘కళింగ కథాజాడ’

Jul 1,2024 05:02 #aksharam

1910 లో అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయ తెలుగు కథావరణాన్ని ఆధునికత వైపుగా ‘దిద్దుబాటు’కు లాకులు తెరిచిన గురజాడ గురుజాడను అనుసరించి కళింగాంధ్ర కథకులు గడచిన 114 ఏండ్లుగా విస్తారమైన కథా సేద్యం చేస్తూ వస్తున్నారు. ఆనాటి నుంచి అధమ పక్షం ఏడాదికి వంద కథలు వెలుగుచూశాయనుకున్నా కళింగాంధ్ర మొత్తం మీద పదకొండున్నర వేల కథలు ప్రజాబాహుళ్యాన్ని చుట్టివేశాయి. ఇంతటి కళింగ కథాసాహిత్యం అనే దధిని మధించి 63 కధల వెన్నముద్దను బయటకు తీయడం గొప్ప యజ్ఞమే! ఈ క్రతువును పట్టుదలతో నిర్వర్తించినవారు అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌర్నాయుడు, చీకటి దివాకర్‌ గార్లు.
ఒకానొక సందర్భంలో అట్టాడ అప్పల్నాయుడు కళింగాంధ్ర కథా సాహిత్యం మీద విహంగ వీక్షణం చేస్తూ, ఓ పత్రికలో వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని చదివిన ఎంతోమంది పాఠకులు పలు విధాల స్పందనకు లోనయ్యారు. పలు రకాల అభిప్రాయాలను వెలువరించారు. అటువంటి పాఠకుల్లో ఓ అరుదైన పాఠకుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి సభ్యులు ఎంవిఎస్‌.శర్మ. వారో వేదిక మీద నుంచి మాట్లాడుతూ, ‘అట్టాడ అప్పల్నాయుడు గారి వ్యాసాన్ని చదివాను. ఆ వ్యాసాన్ని చదివిన తరువాత గురజాడ నుంచి ఇప్పటిదాకా వచ్చిన కళింగాంధ్ర కథా సాహిత్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు సంకలనాలుగా తెస్తే బావుంటుంది అనిపించింది. ఆలోచించండీ!” అంటూ సభలో వున్న సాహితీ ప్రేమికులకు ఓ అప్పీల్‌ చేశారు. ఆ సభలోని సాహితీ పిపాసులు కొందరు, సభానంతరం ఓచోట చేరి ‘శర్మ గారన్నట్టు మన కళింగ కథా సాహిత్యాన్ని నాలుగు సంకలనాలుగా తేవాలంటే మనమేం చేయాలి?’ అన్న ఆలోచన చేశారు. అనేక ఆలోచనల వడపోతల తరువాత ‘నాలుగు సంకలనాలుగా కాకుండా, నాలుగు తరాల మంచి కథలను ఎంపిక చేసి, ఒకే సంకలనంగా వెలుగులోకి తీసుకొస్తే మంచిది” అన్న అంతిమ నిర్ణయం వచ్చింది. ఆర్థిక వనరుల సమీకరణ ఏవిధంగా చేయాలన్న విషయం ముందుకొచ్చిన్నప్పుడు ”ఆ పుస్తకం ముద్రణకు ఎంత ఖర్చైనా మేము భరిస్తాం. మా చీకటి ప్రచురణల ద్వారా వెలువరిస్తాం” అంటూ చీకటి చంద్రిక, దివాకర్‌ దంపతులు ముందుకొచ్చారు. ఇంతకుముందు ఆ దంపతులు 2023లో ‘పేగుబంధం’ అనే శీర్షికన వందమంది కవులు రాసిన వంద కవితలతో ఓ బృహత్‌ సంకలనాన్ని వెలువరించారు. 2024లో వారి కుమారుడు రవితేజ, కోడలు వైష్ణవిల వివాహ సందర్భంగా ‘మహాకవుల మాటలు’ అన్న శీర్షికన దిగ్గజ కవుల, రచయితల ఉటంకింపులతో మలి సంకలనాన్ని వెలువరించారు.
సంపాదక వర్గ సభ్యులు ముగ్గురూ పలు దఫాలు సమావేశమై, 114 ఏండ్ల కళింగాంధ్ర కథా ప్రవాహంలో కొన్ని నెలలపాటు మునిగీతలు కొట్టి, నాటి గురజాడ నుంచి నేటి డా.భారతి దాకా 63 మంది కథకుల కథలను సంకలనం కోసం ఎంచుకున్నారు. అలా ఎంచుకున్న కథలను మొదట అనుకున్నట్టుగా నాలుగు తరాలుగా విభజన చేసుకున్నారు. ఈ సంకలనాన్ని చదివే ప్రతి పాఠకుడూ ఒక విషయాన్ని గమనంలో వుంచుకోవాలి. భూమి లోతుల్లో దాగివున్న బంగారాన్ని వెలికి తీయాలంటే పైనుంచి తవ్వుకుంటూ లోలోతుల్లోకి వెళ్ళితే తప్ప అది దొరకదు. అదేవిధంగా ఈ పుస్తకంలోని 63 కథలను సంపా దకులు నాలుగు తరాలుగా విభజించి వరుస వారిగా పొందుపరి చారు. పాఠకులు చదివేటప్పుడు నాలుగో తరంలోని కథలతో ప్రారంభించాలని నా సూచన. అంటే అవరోహణ క్రమంలో నాలుగో తరం నుంచి ఒకటో తరానికి చదువుకుంటూ వెళ్ళాలి. ఈ పద్ధతి 114 సంవత్సరాల కథల ఎదుగుదల క్రమాన్ని కూలంకషంగా అర్ధం చేసుకోడానికి అనువుగా వుంటుంది.
నాలుగో తరంలో మొత్తం 29 మంది కథలను పొందుపర్చారు. ఈ కథల్లో ప్రధానంగా శ్రీకాకుళ సాయుధ పోరాటం చివరి దశ నుంచి మొదలై నేటి ప్రపంచీకరణలో విచ్ఛిన్నమైపోతున్న మానవ సంబంధాల స్థితిగతులను, రాజకీయార్ధిక రంగాల్లో చొచ్చుకుపోతున్న ఆధునికానంతరవాద వ్యక్తి కేంద్ర విధానాల దుష్పరిణామాల ఫలితాలను… కథకులు తమ స్వంత కంఠస్వరంతో విన్పించడం గొప్పగా వుంది. నా దృష్టిలో మొదటితరం కథకుల కన్నా ఈ నాలుగో తరం కథకులు కథావరణంలో అడుగు పెట్టేనాటికి, ఆధునిక మానవ జీవనం పూర్తిస్థాయిలో సంక్లిష్టతను సంతరించుకుంది. సమాజ పరిణామాలు వేగంగా మారిపోసాగాయి. ఈ సంక్లిష్ట సమాజ గమన వేగాన్ని అందుకోగలిగిన ఆధునిక కథకుల కథలనే సంపాదకవర్గం ఈ సంకలనంలోకి తీసుకొంది. గొప్ప ప్రయత్నాన్ని చేసిన ఈ నాలుగో తరంలోని ప్రతి కథకుణ్ణి పాఠకులు మనసారా అభినందిస్తూ, వారి నుంచి ముందు ముందు మరిన్ని మంచి కథల్ని ఆశించాల్సి వుంది. ఈ తరంలో అట్టాడ, గంటేడ వంటి వారి కథలు ఉద్యమ స్ఫూర్తితో రాయబడిన కథలు. మిగతా కథలు వేటికవే స్వతంత్రమైన వస్తువుతో రాయబడిన కథలు. వీటిలో మానవ సంబంధాల, కుటుంబ బంధాల నేపథ్యంతో బమ్మిడి జగదీశ్వరరావు రాసిన ‘మట్టి తీగలు’. కె.ఎన్‌.మల్లీశ్వరి స్త్రీవాద దృష్టి కోణంతో రాసిన ‘వొడుపెరిగిన దాయి’, సత్యాజీ రాసిన ‘బంగారు పిచ్చుక’ లాంటివి మచ్చుకు కొన్ని మంచి కథలు.’మూడో తరం’ దగ్గరికొస్తే ఇందులో మొత్తం 13 కథలున్నాయి. ఇది ఓ కథకుడుగా కళింగాంధ్రనే కాదు, మొత్తం తెలుగు సమాజాన్నే ఒక ఊపు ఊపిన భూషణం గారి తరంగా చెప్పుకోవాల్సిన తరం. వారితోపాటు చాగంటి తులసి, శ్రీపతి, పతంజలి, అర్నాద్‌ గార్లు కూడా కథక ప్రసిద్ధులే. కొద్దిగానే రాసినా ఎంతో మంచి కథలు రాసిన ఎన్‌.ఎస్‌.ప్రకాశరావు గారి కథల్లో నుంచి ‘పేపర్‌ టైగర్‌’ కథను తీసుకున్నారు. నిజానికి వారివి మరిన్ని మంచి కథలున్నాయి.
రెండవ తరంలో 11 మంది రచయితల కథలున్నాయి. కళింగాంధ్ర కథా క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన నాలుగు తరాల్లో ఈ రెండవ తరమే మొత్తంగా లబ్ధప్రతిష్టమైన తరంగా చెప్పుకోవచ్చు. ఇందులో మొదటి కథ కుంకుడాకులు. చెట్టు మీద పండి, ఎండి నేలరాలిన ఓ బుట్టెడు కుంకుడాకులు ఒక పేద కుటుంబం పొయ్యి కిందికి ఆధారం. బుట్టెడు ఆకు ఓ చిన్నపిల్ల రెక్కల కష్టం. దాన్ని కూడా సహించలేని భూస్వామి ఆకును నేలపాలు చేస్తే? ఆ కుటుంబం ఆ పూటకు పస్తే! అది, పొయ్యి మీదికిచ్చే వాళ్ళుంటారు గాని, పొయ్యి కిందికిచ్చేవాళ్ళుండరని పేదలు రోదించే పాడు కాలం. ఆ కఠోర నిజాన్ని ఎంతో సున్నితంగా వివరించిన చాసో గారు రాసి కన్నా వాసితో వన్నెకెక్కిన కథకులు. మరో మంచి కథ కారా మాష్టారి ‘ఆర్తి’. బడుగు జీవులైన ఇద్దరు వియ్యపురాళ్ళ మధ్య ఒకరికి కూతురు, మరొకరికి కోడలు అయిన ఓ యువతిని, ఆ తల్లి తన బిడ్డను పండగ ముందు అత్తవారింటికి పంపనంటే పంపనని మొండికేస్తుంది. అత్త కూడా అంటే మోతాదులో ససేమిరా పంపాల్సిందే అంటుంది. అది ముందుగా రెండు కుటుంబాల పంచాయితీగా మొదలై తరువాత గూడెం పంచాయితీగాను, ఆ దరిమిలా మొత్తం గ్రామ పంచాయితీ గానూ రూపాంతరం చెందుతుంది. వియ్యపురాళ్ళిద్దరూ ఆ యువతిని తమ ఇంట్లోనే వుంచుకుంటామంటూ గొడవ పడడానికి మూల కారణం ఏమిటో గ్రామపెద్ద కనిపెడతాడు. ఆ నెల పంటకోతల కాలం, కాబట్టి యువతి ఎవరి ఇంట్లో వుంటే వాళ్ళకు ఆవిడ కూలిగింజలు దక్కుతాయి. అందుచేతనే ఆ అమ్మాయి కోసం వియ్యపురాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. ఆ విషయంలోని ఆర్తిని అర్థం చేసుకున్న పెద్ద మనిషి దానికి ఎటువంటి ముగింపునిచ్చాడో తెలుసుకోవాలంటే తప్పకుండా కథను చదవాల్సిందే!
మొదటి తరంలో గురజాడ అప్పారావు గారి ”దేవుళ్ళారా! మీ పేరేమిటి?’ కథా నుంచి మొదలు పెట్టి, ”నీకేం తెలుసే అంట్ల వెధవా!” అన్న స్థానాపతి రుక్మిణమ్మ గారి కథ వరకు మొత్తం 10 కథలున్నాయి. ఇందులో సెట్టి ఈశ్వరరావు గారి కథ గురించి విచారిస్తే ఇదో ‘హిందూ – ముస్లిం’ కథ. అబ్బాస్‌ అనే ఓ బీద ముస్లిం యువకుడు నానా ఇబ్బందులు పడి పట్టణం చేరి ఒకచోట పండ్ల దుకాణం పెట్టుకొని జీవిస్తుంటాడు. ఒకరోజు రాందాస్‌ అనే యువకుడు ఆకలితో నకనకలాడుతూ వచ్చి ఏదైనా పని ఇమ్మని అడుగుతాడు. ఆ యువకుని అవతారాన్ని చూసిన అబ్బాస్‌ ‘రెండేండ్ల కిందట తన పరిస్థితి కూడా ఇలాగే వుంది కదా?’ అనుకున్నప్పటికీ రాందాస్‌తో పనిలేదు పొమ్మంటాడు. ముందుకు వెళ్ళిపోయిన రాందాస్‌ కొంతసేపటికి వెనుదిరిగి వస్తుంటే అతనికి పని దొరకలేదని గ్రహించిన అబ్బాస్‌ అతన్ని పిలిచి రెండు చపాతీలు, ఇంతపప్పు ఇస్తాడు. వాటిని తిన్న తరువాత ఒక ముస్లిం పెట్టిన రొట్టె తిని, పోసిన నీళ్ళు తాగాను. అందుకు తనను కన్న జాతి, మతమూ వెలి వేస్తాయేమోనన్న కించిత్‌ సందేహానికి లోనైనప్పటికి వెంటనే తేరుకుని ‘నా చర్మం వలిచి చెప్పులు కుట్టిచ్చినా ఇతని రుణం తీర్చలేను’ అనుకుని అతని దగ్గర కూలిగా కుదిరిపోతాడు. అది చూసిన ముస్లిములు అబ్బాస్‌తో ”ఒక కాఫీర్‌ని దగ్గర పెట్టుకున్నావెందుకు?” అంటూ బెదిరిస్తారు.
హిందువులొచ్చి రాందాస్‌తో ”నువ్వు తురకోడి దగ్గర చాకిరీ చేసుకుంటూ వాడు పెట్టిన తిండి తినడం చూస్తుంటే మాకు తలవంపులుగా వుంది” అంటూ నిష్ఠూరమాడసాగారు. అయితే, అబ్బాస్‌, రాందాస్‌ లిరువురూ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోతుంటారు. ఇంతలో శ్రీరామ నవమి, మొహరం పడుగలు రెండూ కలిసొచ్చాయి. అబ్బాస్‌ తన మతస్తులైన పేదలతో పాటు హిందూ మతస్తులైన పేదలకు కూడా దానధర్మాలు చేస్తాడు. గుడిలో అభిషేకాలూ చేయిస్తాడు. అది చూసిన ముస్లిములు అతని పట్ల తీవ్రమైన కోపంతో రగిలి పోతుంటారు.
పండుగ సందర్భంగా హిందువులు దేవుణ్ణి మేళతాళాలతో మసీద్‌ ముందు నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లడానికి పోలీస్‌ వారి అనుమతి కోసం విన్నవించుకుంటారు. దాన్ని ముస్లిములు అడ్డుకుంటారు. ఫలితంగా పట్టణంలో హత్యలు, మానభంగాలు, గృహ దహనాలు జరగసాగాయి. ఆ దమనకాండలో చాలామంది చచ్చిపోయారు. చావు బతుకుల మధ్య నున్న వారితో ఆస్పత్రి నిండిపోయింది. తన దుకాణం మీద జరిగిన దాడిలో అబ్బాస్‌ తల మీది గాయం కావడంతో అతను చనిపోతాడు. అదే సమయంలో ఆస్పత్రి బెడ్‌ మీద మృత్యువుతో పోరాడుతున్న రాందాస్‌ మరికొద్ది సేపట్లో చనిపోతాడని తెలిసిన నర్సు ”మీవాళ్లెవరన్నా వుంటే చెప్పండీ! పిలిపిస్తాం” అంటుంది. ఆ మాటలు విన్న రాందాస్‌ ”పెద్దబజార్‌ దేవీడీ దగ్గర పళ్ళ దుకాణం అబ్బాస్‌ను పిలిపించండి” అంటాడు. ఆ మాటలు విన్న నర్సు అదిరిపడడంతో కథ ముగుస్తుంది.
ఈ సంకలనంలోని మొదటి కథ గురజాడ వారి ”దేవుళ్ళారా! మీ పేరేమిటి” గురించి వినని, చదవని తెలుగు పాఠకులు ఉండకపోవొచ్చు. అదే విధంగా మతపరమైన అంశాన్ని వస్తువుగా తీసికొని ఓ మంచికథను రాసిన సెట్టి ఈశ్వరావు మనందరికీ ప్రాత:స్మరణీయులే. వారు గురజాడ సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన వారిలో ప్రథములు. ఈ మొదటి తరంలోని కథకులందరూ ఒకరిని మించి ఒకరు తమ రచనల ద్వారా సమాజంలోని అవలక్షణాలను ఎత్తిచూపి, దారి తప్పిన మనుషులను తిరిగి సన్మార్గంలోకి తేవాలన్న సమున్నత లక్ష్యంతో తమ కలాలను ఝళిపించిన అక్షరయోధులే కావడం గమనార్హం.
ఈ సంకలనాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా కళింగాంధ్ర కథక మిత్రులు మిగిలిన ప్రాంతాల కథకులకు మార్గదర్శకులవుతారని కథా ప్రేమికులమంతా ఆశిద్దాం. ఎ4 సైజులో 455 పేజీలున్న ఈ అరుదైన పుస్తకం ధర రూ.400. ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్‌ హౌస్‌ లో లభిస్తుంది. ప్రచురణకర్త చీకటి దివాకర్‌ (94411 76882) ను కూడా సంప్రదించొచ్చు.
– శిరంశెట్టి కాంతారావు

➡️