Pensions – లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను అందజేసిన సిఎం చంద్రబాబు

అమరావతి : ఎపిలో ‘ఎన్టీఆర్‌ భరోసా’ పింఛన్ల పంపిణీ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4,408 కోట్లు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సిఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మంత్రి లోకేశ్‌, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి…. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇప్పటివరకు పింఛనుదారులకు రూ.3,000 చొప్పున అందుతుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి రూ. 1,000 పెంచి రూ. 4,000 చేశారు. దీంతోపాటు ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు రూ. 1,000 చొప్పున కలిపి రూ. 7,000 నేడు పంపిణీ చేస్తున్నారు. ఎపిలో పింఛన్ల పంపిణీ … తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తిచేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు. అంతకుమించి ఉంటే కొన్నిచోట్ల అంగన్‌వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేనివారికి రెండోరోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లను అందిస్తారు.

➡️