స్వోత్కర్షలు…

Jun 29,2024 05:30 #editpage

గడచిన పదేళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం చేసిన రాజ్యాంగ వ్యవస్థల విధ్వంస పాలనను పదేపదే మెచ్చుకుంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి గురువారం చేసిన ప్రసంగం వెగటు పుట్టించింది. ఎన్నికల అనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వ విధానాలను వెల్లడించాల్సిన ఈ ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలా సాగింది. నీట్‌ దోషులను శిక్షిస్తామనడం తప్ప కొత్త విషయమేమీ చెప్పలేదు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ప్రధానమైనవిగా భావించిన అధిక ధరలు, పెరిగిన నిరుద్యోగం వంటి సమస్యలను వాటికి పరిష్కారాలను లేదా కనీస ఉపశమనం కల్పించడం గురించైనా పేర్కొనకపోవడం సబబు కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న వైనాన్ని ప్రస్తావించకుండా ప్రభుత్వ సుపరిపాలన గురించి గొప్పలు చెప్పారు. ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తరాదిన చర్చనీయాంశమైన అగ్ని పథ్‌ ఊసే ఎత్తలేదు. పార్లమెంటరీ వ్యవస్థపై విశ్వాసం గురించి సుదీర్ఘంగా సూక్తులు వల్లించిన ఆ ప్రసంగంలో 17వ లోక్‌సభలో ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ప్రభుత్వం అనుమతించలేదనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ముఖ్యమైన ఎలాంటి చర్చ లేకుండా గిలెటెన్‌ చేయడం, సభలో హోం మంత్రి వివరణ ఇవ్వాలని కోరినందుకు 140 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడం వంటివన్నీ మరచిపోయి పార్లమెంటు సక్రమంగా జరగాలని రాష్ట్రపతి హితోపదేశం చేయడం సర్కారు నిరంకుశ చరిత్రను కప్పిపెట్టే ప్రయత్నం తప్ప వేరేమీ కాదు.
గత పదేళ్లుగా దేశంలో మోడీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్న సంగతి వదిలేసి 1975 ఎమర్జెన్సీ గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు బుక్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేసి తగ్గినట్టుగా చూపగా అదంతా మోడీ సర్కారు గొప్పతనంగా ముర్ము పేర్కొనడం మసిబూసి మారేడు కాయ చేయడమే! వివక్షాపూరితమైన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను గొప్పగా ప్రస్తుతించారు. మత పరంగా వివక్ష చూపుతున్న ఆ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా ఆందోళనలు సాగితే దాని గురించి ప్రస్తావించకుండా విదేశాల నుంచి వచ్చే శరణార్థులకు హుందాగా జీవించేందుకు ఇది ఉపయోగపడుతుందని రాష్ట్రపతి సెలవివ్వడం వక్రభాష్యం చెప్పడమే. ప్రజాస్వామ్య ప్రియులు ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా పార్లమెంటు ఉభయ సభల్లో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదింపజేసుకున్న కొత్త క్రిమినల్‌ చట్టాలు జులై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయని రాష్ట్రపతి చెప్పడం మోడీ సర్కారు నిరంకుశ చర్యలను మరింత ముందుకు నెట్టడమే! రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు గురించి కూడా రాష్ట్రపతి గొప్పగా చెప్పడం దారుణమైన విషయం. ప్రకృతి సేద్యాన్ని గురించి, గ్లోబల్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఆర్గానిక్‌ పంటలకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన, ఆయుష్మాన్‌ భారత్‌ తదితర పథకాలను వల్లె వేశారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం ఇంకా ఆచరణకు రాకపోయినా మహిళా సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుందని చెప్పడం అంతుపట్టని అంశం. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎఫ్‌పిఓలతో పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని గొప్పగా పేర్కొన్న రాష్ట్రపతి మద్దతు ధరల చట్టం గురించి మాట్లాడకపోవడం అన్నదాతల పట్ల ఈ సర్కారు చిన్నచూపునకు నిదర్శనం.
రాష్ట్రపతి ప్రసంగం ఆసాంతం స్వోత్కర్ష, పరనిందగానే సాగడం విచారకరం. గడచిన రెండు సాధారణ ఎన్నికలకు భిన్నంగా భారత ప్రజలు బిజెపికి సొంతంగా మెజార్టీని ఇవ్వకపోయినా మోడీ-అమిత్‌ షా ద్వయం గతంలో మాదిరిగానే పాలన సాగించాలని ప్రయత్నిస్తున్నారనడానికిది తాజా తార్కాణం. ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కాలని చూస్తున్న ఇటువంటి ప్రయత్నాలను ప్రతిపక్షాలు ఉమ్మడిగా ప్రతిఘటించాలి. భారత రాజ్యాంగానికి, దాని మౌలికమైన ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సార్వభౌమత్వం, సామాజిక న్యాయం, ఫెడరలిజాన్ని దెబ్బ తీస్తున్న కార్పొరేట్‌ మతతత్వ సర్కారు ఆటలు సాగనివ్వరాదు.

➡️