‘మరేటంతారు బాబూ…?’

ayodya rama mandir communal politics bjp govt modi satire

”జన్మ ధన్యం అయిపోయిందనుకో! ఆ బాలరాముడి విగ్రహం దర్శించుకోవడం నిజంగా నా అదృష్టం. ఇహ అక్కడ ఏర్పాట్లూ, ఆ జన సందోహం-ఏమైనా అతగాడు కారణ జన్ముడయ్యా!” అంటూ పరవశించిపోతున్నాడు అప్పలాచారి. అతగాడిది అయోధ్య పర్యటనను తలుచుకుని వచ్చిన పారవశ్యమో లేక మా ఆవిడ ఫ్రెష్‌గా వేసిన ఫిల్టర్‌ నుండి దిగిన డికాషన్‌తో కలిపిన కాఫీ తాగినందువలన కలిగిన పారవశ్యమో నేను తేల్చుకోలేకపోతున్నాను.

”అక్కడికి వెళ్ళలేకపోయామే అన్న దిగులు తప్ప మేం కూడా ఇక్కడ నుంచే టీవీల్లో అంతా చూస్తూనే వున్నాం అన్నగారూ! అంతా మోడీ గారి చలవే అనుకోండి” అంటూ తోడైంది నా సతీమణి.

ఆ పక్కనే ఇస్త్రీకి తీసుకెళ్ళిన బట్టల లెక్కకి, తెచ్చిన బట్టల లెక్కకి సరి చూస్తున్నాడు మా అబ్బాయి. బట్టలు తెచ్చిన అప్పారావు అప్పలాచారి చెప్పినది తలాడిస్తూ వింటున్నాడు. తాను చెప్పేదాన్ని తలాడిస్తూ వినే శ్రోత దొరికితే అప్పలాచారి రెచ్చిపోతాడు. అందుకే నేను భయపడుతున్నాను. ఇంతలో ”బాబూ! అయితేటి? తవుఁరు అంతదూరం రాముడిని సూడ్డానికా ఎల్లారు ? మనూరి కోవెల్లో ఉన్నోరు రాముడు కాదంతారేటి ఐతే ?” అంటూ అప్పారావు సందేహం వెలిబుచ్చాడు.

”ఓరి వెర్రివాడా ! అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళా రాముడు తిరిగొచ్చాడోరు ! మరి వెళ్ళొద్దూ?” అన్నాడు ఆచారి. ”బాబూ! నాను మీలా సదూకున్నోడిని కాదు. అంచాత ఎర్రి మొర్రి పెశ్నలే నాకు వత్తాయి. తవుఁరు మరోలాగ అనుకోకండా మా అగ్గేనాన్ని మన్నించాల మరి.

ఏటంతారు? అంచాత నా డౌటేటంటే మరి ఈ ఐదొందల ఏళ్ళూ ఆ రాముడు ఎక్కడికి పోనాడు? ఎందుకు పోనాడు? మనూర్లో ఎలిసిన రాములోరు, తమరు అంత దూరం ఎల్లి సూసొచ్చిన రాములోరు ఒక్కరేనా ? కాదా? మనూర్లో మొక్కితే రాములోరు నా మొక్కు తీర్సడా? ఆయనగోరు నా మొక్కు తీర్సాలంటే నాను అయోద్య దాకా ఎల్లి రావలసిందేనా? ఏటి? ఏటంతారు ?” అని చాలా వినయంగా, భక్తి పూర్వకంగా, పరవశంతో అడిగాడు అప్పారావు (ఫిల్టర్‌ కాఫీ తాగకపోయినా కూడా).

అప్పలాచారి అప్పారావు సందేహాలను తీర్చడానికి ఉపక్రమించేడు. ” అసలు ఐదు వందల ఏళ్ళ క్రితం రాములవారి ఆలయాన్ని ఒక దుర్మార్గుడు, పరాయి మతస్తుడు …” అంటూ ఆరంభించగానే నాకర్ధమైపోయింది. అప్పలాచారిని అప్పుడు గనక ఆపకపోతే అతగాడు భోజనాలదాకా మా ఇంట్లోనే సెటిలైపోతాడు. అందుచేత ”ఇదిగో అప్పారావ్‌ ! నీకు వేరే ఇళ్ళల్లో ఇవ్వవలసిన ఇస్త్రీ బట్టలు లేవా ఏమిటి?” అని గుర్తు చేశాను.

”అయ్ బాబోయ్ ! నేకపోవడమేటి బాబూ ! శానా ఉన్నాయి. కాప్పోతే ఆచారిగారి లాంటి గొప్పోరు ఎదుట బడితే మరి డౌట్లు అలా వొరసపెట్టి తరుముకుంటూ ఒచ్చేస్తాయి గదా ! నానైతే ఇప్పుడెల్తాగానీ ఆచారిగోరూ ! నాకు ఇంకా మరికొన్ని డౌట్లు ఉన్నాయండీ, సెప్పుకోమంటారా? ఇప్పుడు సెప్పేస్తాను. ఆనక తవఁరు మల్లీ ఒచ్చినప్పుడు కనిపెట్టుకుని ఉండి గబుక్కున వొచ్చేస్తాను. అప్పుడు ఈ డౌట్లన్నీ తీరిసీయాల తవఁరు. ఏటంతారు ?” అన్నాడు.

భక్తుడికి వరం ఇచ్చిన భగవంతుడి పోజు పెట్టి అప్పలాచారి ”అడుక్కో నీ డౌట్లు” అన్నాడు.

”మరేమోనండీ, అల్లప్పుడెప్పుడో త్రేతాయుగం నాడు రాములోరు లవకుశులకి రాజ్యం వొప్పజెప్పి సరయూ నదిలో దిగి అవతారం సాలించీసినారని కోవెల్లో పూజారిగారు సెప్పినారు. అంతే గాదండోయ్! రాములోరు ఇష్ణువు అవతారం అని సెప్పినారు. ఇష్ణువు ఒకోకసారి ఒక్కో అవతారంలో బూమ్మీదకొచ్చి పాపాలు సేసినోల్లందరినీ సిచ్చించి మళ్ళీ ఎలిపోతారని కూడా సెప్పినారు. ఒకపాలి వొచ్చిన అవతారంలో మళ్ళీ రారని, ఈమారు గనక వొత్తే కలికి అవుతారంలో గుర్రం ఎక్కి కత్తొట్టుకుని వొచ్చి కసా బిసా పాపుల్ని ఏసేస్తారని కూడా సెప్పారండీ. మరి మా పూజారిగోరు సెప్పింది కరెట్టే అయితే ఇప్పుడు రాముడు మళ్ళీ రావడం అంతారేటండీ ? పూజారిగోరు తప్పా? తమరు సెప్పింది తప్పా? తెలక అడిగినాను బాబూ, మరేటనుకోకండి.” అప్పలాచారి ఏం చెప్పాలో తేల్చుకోకమునుపే …

”బాబూ ! ఇంకో డౌటండి. మనూర్లో బూవుఁల్ని కబ్జా సేయిస్సి రీలెట్టేట్లో (అనగా రియల్‌ ఎస్టేల్‌ లో అని చదువరులు గమనించ ప్రార్ధన) కోట్ల లెక్కన అమ్మీసిన పాపాల బైరవుడు యీరయ్యగోరు అయోద్యలో గుడి కట్టడానికి ఏబై కోట్లంపినాడంట. పత్రికల్లో కూడా ఆ యిసయం అచ్చేసేరు. తవఁరు సూసివుంటార్లెండి. ఇంతకీ ఆ ఏబై కోట్లూ కర్సెట్టి గుడి కడితే అక్కడ రాములోరు ఉండడానికి ఒప్పుకుంతారా బాబూ ?”

”ఆగండాగండి బాబూ ! ఇంకొక్క డౌటుంది మరి. ఈ మద్దెన డిల్లీలో పార్లమెంటుకి కొత్త బిల్డింగు శానా గొప్పగా కట్టినారంట కదండీ బావూఁ మరా బిల్డింగుని వోపెనింగు సేయించడానికి మన దేశానికే పెద్ద దిక్కు, మన రాస్ట్రపతిగోరు, ఆ యమ్మగోరి ..” అని పేరు కోసం అప్పారావు తడుముకుంటూంటే మా అబ్బాయి ”ద్రౌపది ముర్ము” అని అందించాడు.

”మా బాబే !” అని మురిపెంగా మా వాడిని మెచ్చుకుని అప్పారావు కొనసాగించేడు. ”అదేనండి , ఆ యమ్మగోరిని పిలవలేదెందుకని అడిగితే ఆ యమ్మ బరత ఇప్పుడు లేరు గదా. యితంతువులు పేరంబించకూడదు కదా అని ఊల్లో తమబోటి పెద్దలు సెప్పేరండి మరి. అటువంటప్పుడు రాములోరి గుడిని మోడీగోరు పేరంబించడం ఏటని అదేదో పేద్ద మటం పెద్ద గోరు..(పూరీ శంకరాచార్య అని మళ్ళీ మావాడు అందించేడు) అడిగినారట గదా. మరి ఆ మటం పెద్ద రైటా ? మోడీ గోరిసేత గుడిని పేరంబం సేయించిన పెద్దలు రైటా? నాకైతే ఏటీ బోదపడకండా ఉన్నాది.

”రాములోరంటే నాకు శేనా ఇష్టం. ఆయనగోరికి దేశం నిండా ఎక్కడ బడితే అక్కడ గుళ్ళు ఉన్నాయి. మరి బద్రాశెలంలో గుడి కట్టినదానికి అయిన కరుసంతా ఆ రాములోరే సొయంగా తెచ్చి ఆ తానీషాకి దరిశెనం ఇచ్చి మరీ సెల్లుబాటు సేసేరు. అంత లెక్కైన దేవుడు మరి అలాంటి రాములోరికి మళ్ళీ ఇప్పుడు ఇంకో గుడి కట్టడం ఏంటో, అందుకోసం శేనామంది తాలూకు నెత్తురు పారడం ఏంటో, అరదం కావడం లేదు బాబూ.”

”మాబోటోల్లు తిండికి లేకుండా ఇబ్బందులు పడుతూంటే ఆ సంగతి వొదిలేసి కోట్లకి కోట్లు కరుసెట్టి లచ్చ గుడులున్న తనకి మల్లీ ఇంకో గుడి కట్టమని గాని రాములోరు ఎవురికైనా సెప్పినాడా ? ఏటి అవుతోందో ఏటీ బోద పడడం లేదు బాబూ.”

”ఈ పాలొచ్చినప్పుడు ఈ డౌట్లన్నీ తమ రే నాకు సక్కగా యిప్పి సెప్పాల మరి. దయుంచండి బాబూ! నాను గాని తప్పు మాట గాని మాట్టాడితే నన్నొగ్గకండి బాబూ! ఏటి తప్పు మాట ఆడినానో సెప్పి మరీ సిచ్చించండి బాబూ! శెలవిప్పించండి మరి” అంటూ గుమ్మం దిగాడు అప్పారావు. మరి ఏమైందో ఏమో గాని…ఆ తర్వాత ఇంతవరకూ అప్పలాచారి మా ఇంటికి రాలేదు. ఆఫీసులోనే పలకరిస్తున్నాడు. మా ఆవిడ ఇచ్చే ఫిల్టర్‌ కాఫీ పారవశ్యం ఇప్పుడు పూర్తిగా నా ఒక్కడిదే.

 

– సుబ్రమణ్యం

➡️