బాలల హక్కులు

Dec 10,2023 07:20 #Editorial

            ‘పాపం, పుణ్యం, ప్రపంచమార్గం/ కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ/ ఏమీ ఎరుగని పూవుల్లారా/ అయిదారేడుల పాపల్లారా/ మెరుపు మెరిస్తే/ వాన కురిస్తే/ ఆకసమున హరివిల్లు విరిస్తే/ అవి మీకే అని ఆనందించే/ కూనల్లారా’ అంటాడు శ్రీశ్రీ. బాలలు స్వేచ్ఛా విహంగాలు. బాల్యం అందమైన జ్ఞాపకం. ఏ మనిషి వ్యక్తిత్వం అయినా బాల్యంతో పెనవేసుకునే వికసిస్తుంది. బాలలు దేశ అభివృద్ధికి అతి పెద్ద పెట్టుబడి. మనిషికి గాలి, నీరు, ఆహారం, ఎంత అవసరమో… స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంతే అవసరం. మానవ హక్కులలో ఒక ముఖ్యమైన భాగం బాలల హక్కులు. రక్షణ, విద్య, సంరక్షణ, సామాజిక, సాంస్కృతిక జీవనంలో చురుకైన పాత్ర నిర్వహించే ప్రతి హక్కూ బాలలకు వున్నాయి. ‘ప్రతి బిడ్డకూ ప్రతి హక్కు’ వుంది. ‘చదువని వాడజ్ఞుండగు/ చదివిన సదసద్వివేక చతురత గలుగున్‌’ అంటాడు పోతన. ‘చదువు జదవుకున్న/ సౌఖ్యంబులును లేవు/ చదువుజదివెనేని సరసుడగును/ చదువు మర్మమెరిగి చదువంగ చూడుము’ అంటాడు వేమన. ‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్‌/ విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడన్‌/ విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్‌/ విద్య నృపాల పూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే?’ అని విద్య ప్రాధాన్యత చెబుతాడు భర్తృహరి. కనుకనే-పిల్లల హక్కుల చట్రంలో అత్యంత ముఖ్యమైన వాటిలో విద్యాహక్కు ఒకటిగా మారింది. అంతేకాదు-సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే హక్కూ పిల్లలకు వుండాలి.

దాదాపు 45 కోట్ల మంది పిల్లలున్న దేశం మనది. వికసిత భారత్‌ వంటి ఎన్ని భుజకీర్తులు తగిలించుకున్నా… దయనీయమైన స్థితిలో బతుకుతున్న పిల్లలు ులక్షల్లో వున్నారు. బాలికల పరిస్థితి మరింత దుర్భరంగా వుంది. సరైన ఆహారం లేక, ఆశ్రయం లేక, వీధుల్లో బతుకుతూ అనారోగ్యం పాలై, లైంగిక వేధింపులకు గురవుతూ వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్నవారు అనేకమంది వున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు మానవ హక్కులపైనా, బాలల హక్కులపైనా దాడి జరుగుతోంది. యుద్ధం జరుగుతున్న ప్రతి చోటా మొదటి బాధితులు బాలలే. 190కి పైగా దేశాలలోని బాలల సంక్షేమ అభివృద్ధి కోసం పాటు పడే యునిసెఫ్‌… ప్రతి డిసెంబర్‌ 11న ఒక కొత్త థీమ్‌ను ప్రకటిస్తుంది. ఈ ఏడాది ‘ప్రతి బిడ్డకు… ప్రతి హక్కు’ అనే థీమ్‌ తీసుకున్నారు. జీవించే హక్కు, విద్యాహక్కు, సామాజిక భద్రత హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, సమానత్వ హక్కు వంటి 40 రకాల హక్కులు బాలలకు వున్నాయి. బాలలను రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. శరణార్థులుగా మారిన బాలలకు మానవతతో సాయం అందించాలి. మానసిక, శారీరక వికలాంగులైన వారి వృద్ధికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపుదలకు చర్యలు తీసుకోవాలి.

‘బతుకంటే చావు కాదనీ/ ఆహారమంటే గాలి కాదనీ/ ఈ భూమి ఎవరి సొత్తు కాదనీ/ బతికే హక్కు మీకు వుందనీ మీరు తెలుసుకుంటారు’ అంటారో కవయిత్రి. పెద్దలకు హక్కులున్నట్లే, పిల్లలకీ హక్కులున్నాయి. ఆ హక్కులను కాపాడాలి. పడుతూ లేస్తూ పరుగులెడుతూ… పడిపోయిన ప్రతిసారీ కొత్త విషయాలను ఆకళింపు చేసుకుంటూ స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. బాల్యం అంటేనే రంగుల హరివిల్లు. అనుభూతుల విరిజల్లు. అదేసమయంలో మింగుడు పడని విషాదాలు, కనబడని కల్లోలాలూ వుంటాయి. అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగే విద్య, వివేకం బాలలకు అందించాలి. నేర్చుకోగలిగే సుహృద్భావం, ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి. వాన కురిసినా, మెరుపు మెరిసినా తమ కోసమే అని ఆనందించే వారి హక్కులను కాపాడాలి. బాలలకు ఉచితంగా విద్యనందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. వారు స్వేచ్ఛగా చదువుకునే హక్కును కల్పించాలి. వారే రేపటి మన భవిత, భవిష్యత్తూ. ‘మీదే మీదే సమస్తవిశ్వం/ మీరే లోకపు భాగ్యవిధాతలు/ మీ హాసంలో మెరుగులు తీరును/ వచ్చేనాళ్ల విభాప్రభాతములు’ అని శ్రీశ్రీ తన ఆకాంక్ష వ్యక్తం చేస్తాడు. ఆ బాధ్యతను ప్రభుత్వాలు సక్రమంగా నెరవేర్చాలి. బాధాకరమైన విషయం ఏమిటంటే-నవంబర్‌ 14 బాలల దినోత్సవం రోజున ఇజ్రాయిల్‌ దాడుల్లో చనిపోతున్న, నెత్తురోడుతున్న పాలస్తీనా చిన్నారులకు సంఘీభావం తెలిపేందుకు ముంబయిలోని జహువా బీచ్‌ వద్ద గుమికూడిన బాలలను కొందరిని అరెస్టు చేశారు. రక్షకులే భక్షకులుగా మారుతున్న ఈ స్థితిలో బాలల హక్కుల కోసం నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా వుంది.

➡️